చెమట వల్ల చర్మం మెరిస్తే అది అందంగా కనిపించవచ్చు. కానీ ఉదయం నుంచి రాత్రి వరకు జిడ్డొడుతూ కనిపిస్తే మాత్రం విసుగ్గా ఉంటుంది. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. అవేంటో చూడండి.


చర్మం నుంచి ఉత్పత్తయ్యే నూనెను సెబమ్ అంటారు. ఇది చర్మ ఆరోగ్యానికి చాలా అవసరం కూడా. ఈ సెబమ్ ను సెబాస్టియస్ గ్రంధులు ఉత్పత్తి చేస్తాయి. వెంట్రుకల కుదుళ్లలో కనిపించే మైక్రోస్కోపిక్ గ్రంధులు. సెబమ్ ఫ్యాటీ ఆసిడ్స్, చక్కెరలు, వ్యాక్స్, ఇతర సహజ రసాయనాల సంక్లిష్ట మిశ్రమం. ఇది చర్మంలో తడి తగ్గిపోకుండా కాపాడేందుకు సహజంగా చర్మంలో ఉండే మెకానిజం ఈ సెబాస్టియన్ గ్రంధి వ్యవస్థ. చర్మం ఉపరితలం తేమగా ఉంచి రక్షిస్తూ ఉంటుంది. నిజానికి ఆయిలీ స్కిన్ టైప్ చర్మం తక్కువ ముడతలతో, సహజమైన మెరుపుతో అందంగా ఉంటుంది. ఇది నాణానికి ఒక పక్క. మరోవైపు చర్మంలో ఉత్పత్తి అయ్యే  ఈ నూనె వల్ల చర్మం రంధ్రాలు మూసుకుపోతాయి. ఫలితంగా మొటిమలు వచ్చే ప్రమాదం ఉంటుంది.


హార్మోన్ల సమస్య


శరీరంలో ఉత్పత్తయ్యే హార్మోన్లలో కొన్ని హార్మోన్లకు సేబమ్ ఉత్పత్తితో సంబంధం ఉంటుంది. సేబమ్ ఉత్పత్తికి కారణమయ్యే హార్మోన్లను ఆండ్రోజెన్లు అంటారు. టెస్టోస్టిరాన్ వంటి యాక్టివ్ గా ఉండే ఆండ్రోజెన్లు అడ్రినల్ గ్రంథులు, అండాశయాలు, వృషణాల నుంచి ఉత్పత్తి అవుతాయి. చర్మంలో ఎక్కువ సెబమ్ ఉత్పత్తి అయ్యి చర్మం జిడ్డుగా కనిపించడం సాధారణంగా మహిళల్లో పీరియడ్ కి ముందు, ప్రెగ్నెన్సీలోనూ, యుక్తవయసు వారిలోనూ జిడ్డు చర్మం సమస్య అందుకే ఎక్కువగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ ఆండ్రోజెన్ కాదు కానీ ఇది సెబమ్ ఉత్పత్తి మీద ప్రభావం చూపుతుంది.


తీసుకునే ఆహారం


మీరు తీసుకునే ఆహారం శారీరక, మానసిక స్థితి పై మాత్రమే కాదు చర్మం, జుట్టు, గోళ్ల మీద కూడా చాలా ప్రభావాన్ని చూపుతుందని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. జిడ్డు చర్మం ఉండడం సాధారణమే. కానీ మరీ ఎక్కువ జిడ్డొడుతుంటే మాత్రం ఒకసారి తీసుకుంటున్న ఆహారం మీద దృష్టి నిలపడం అవసరం. కొన్ని ఆహారాలు చర్మంలో సెబమ్ ఉత్పత్తిని పెంచుతాయి. పేస్ట్రీలు, క్రిస్ప్ స్నాక్స్, డీప్ ఫ్రైడ్ ఆహారం, ఫిజీ డ్రింక్స్, ప్రాసెస్ చేసిన మాంసాహారం వంటివన్నీ కూడా సెబమ్ ఉత్పత్తిని పెంచుతాయి.


అందుకే ఇలా ఎక్కువ సెబమ్ ఉత్పత్తి అవుతున్నట్టు అనిపిస్తే యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ఫాలో చెయ్యడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, మంచి కొవ్వులు, ప్రొటీన్లు కలిగిన ఆహారం తీసుకోవాలి.


ఇందులో నూనె కలిగిన చేపలు, కూరగాయలు, ఆకుకూరలు, ఆలీవ్ నూనె వంటి వన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారాలుగా చెప్పుకోవచ్చు. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. యాక్టివ్ గా ఉండి, ఎక్కువ వేడిగా ఉండే వాతావరణంలో సమయం గడిపే వారు మరిన్ని ఎక్కువ నీళ్లు తాగడం అవసరం.


సరిపడినంత నిద్ర


రాత్రి పూట తగినంత నిద్రపోవడం తప్పనిసరి. ఇది చర్మ ఆరోగ్యానికి కూడా తప్పనిసరి జాగ్రత్త. నిద్ర లేమి వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ కు కారణం కావచ్చు, అది IGF-1 అనే హార్మోన్ ఉత్పత్తికి కారణం అవుతుంది. ఇది సెబమ్ ఉత్పత్తిని పెంచుతుంది. కనుక తగినంత నిద్ర చాలా అవసరం.


అంతేకాదు ఒత్తిడి కూడా జిడ్డు చర్మం కల వారి చర్మం మరింత జిడ్డుగా మారేందుకు కారణం అవుతుంది.


తగినంత వ్యాయమం ఉండడం వల్ల కార్టిసాల్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది చర్మ ఆరోగ్యానికి చాలా అవసరం. వ్యాయామం తర్వాత స్నానం చెయ్యడం, స్పోర్ట్స్ వేర్ త్వరగా తీసెయ్యడం వల్ల మొటిమల సమస్యకు దూరంగా ఉండొచ్చు.


చర్మం ఎక్కువ జిడ్డుగా కనిపించకుండా ఉండేందుకు సాలిసిలిక్ యాసిడ్, అజెలైక్ యాసిడ్, రెటినోల్, నియాసినమైడ్ వంటి రసాయనాలు కలిగిన చర్మ సంరక్షణ ఉత్పత్తులు వాడడం వల్ల మంచి ప్రయోజనం ఉండొచ్చు. జిడ్డుగా కనిపిస్తుందని మరీ ఎక్కువ సార్లు కడగడం కూడా అంత మంచిది కాదని నిపుణుల సలహా.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.