వేసవి అంటే మామిడి పండ్ల సీజన్. రుచికరమైన నోరూరించే ఈ పండ్ల కోసం కొంతమంది సంవత్సరమంతా ఎదురు చూస్తారు. జ్యూసీగా ఉండే మామిడి పండు తినగానే అమ్మాయిలకు మొహం మీద లావుగా మొటిమలు దర్శనమిచ్చేస్తాయి. అలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? మామిడి వేడి చేసే పదార్థం అందుకే అలా అవుతుందని కొంతమంది వాదన. అవి గిట్టకపోతే అలాగే చర్మం మీద మొటిమలు వస్తున్నాయని చెప్తారు. నిజానికి మామిడి పండ్లు తింటే మొటిమలు ఏర్పడటానికి కారణం ఫైటిక్ యాసిడ్. ఇది శరీరాన్ని వేడి చేస్తుంది.
మొటిమలు రాకుండా ఏం చేయాలి?
మామిడి పండ్లు తిన్నా కూడా మొటిమలు రాకుండా ఉండాలంటే ఒక మార్గం ఉంది. వాటిని తినడానికి ముందు కనీసం రెండు గంటల పాటు నీళ్ళలో నానబెట్టుకుని తింటే మంచిది. అలా చేయడం వల్ల ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది. అవి ఉత్పత్తి చేసే వేడిని తగ్గిస్తుంది. మామిడిలో యాంటీ న్యూట్రీయెంట్ ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలను గ్రహించే శరీర సామర్థ్యానికి ఇది ఆటంకం కలిగిస్తుంది. ఇవి సాధారణంగా థర్మోజెనిసిస్ కి కారణంఅవుతాయి. ఇది శరీర ఉష్ణోగ్రతని పెంచుతుంది. అదే వాటిని తినడానికి ముందు 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టడం వల్ల థర్మోజెనిక ప్రభావం తగ్గిపోతుంది.
నానబెట్టకుండా తినడం వల్ల మొటిమలు, అసిడిటీ, గుండెల్లో మంట వస్తాయి. వీటిని నీటిలో నానబెట్టడం వల్ల సహజ వేడి తగ్గి శరీరానికి, చర్మానికి సురక్షితంగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం పిత్త దోషం ఉన్న వాళ్ళు మామిడి తినడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకంటే వారి శరీరంలో అప్పటికే వేడి ఉంటుంది. మామిడి దాన్ని మరింతగా పెంచుతాయి. దీని వల్ల కొందరిలో గుండెల్లో మంట, అసిడిటీ, అజీర్ణం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే పిత్త దోషం ఉన్న వాళ్ళు మామిడి పండ్లు రోజుకి ఒకటి మాత్రమే పరిమితం చేయాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
ఇలా చేసి చూడండి
⦿ మామిడి పండు తిన్న తర్వాత చర్మం మీద మొటిమలు రాకుండా ఉండాలంటే రెండు గంటల పాటు వాటిని నీటిలో నానబెట్టాలి.
⦿ మామిడి పండు తినడం వల్ల వచ్చే వేడిని తగ్గించేందుకు ఒక గ్లాసు డైరీ పాలు లేదా వీగన్ పాలు తాగితే మంచిది.
⦿ పండిన మామిడి పండ్లను పెరుగుతో కలిపి అసలు తినకూడదు. ఇది పిత్త దోషాన్ని అసమతుల్యత చేస్తుంది. శరీరంలో వేడిని పెంచుతుంది.
సీజనల్ ఫ్రూట్ మామిడి పండ్లు ఖచ్చితంగా తినాల్సిందే. ఎందుకంటే ఇవి వేసవిలో వచ్చే రోగాల నుంచి రక్షణగా ఇచ్చే రోగనిరోధకశక్తిని పెంచుతుంది. అధిక రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. మహిళలు, పిల్లలు మామిడి పండ్లు తినడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయట పడొచ్చు. జీర్ణ సమస్యలను అధిగమిస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: పదే పదే బాత్రూమ్‌కు పరుగులు పెడుతున్నారా? ఈ లక్షణం క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు