పెదవులు ఎర్రగా, ఆకర్షణీయంగా కనిపించడం కోసం అమ్మాయిలు లిప్ స్టిక్స్ ఉపయోగిస్తారు. ప్రతి మేకప్ కిట్ లో ఇవి ముఖ్యమైన భాగమే. వీటిని వేసుకోవడం వల్ల ప్రత్యేకంగా కనిపిస్తారు. కానీ లిప్ స్టిక్ వల్ల పెదాలు ఎర్రగా మాత్రమే కాదు కొంతమందిలో నల్లగా కూడా మారిపోతాయి. అందుకు కారణం లిప్ స్టిక్ లో ఉపయోగించే రసాయనాల వల్ల పిగ్మెంటేషన్ కి కారణమవుతుంది. చర్మ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి, పెదవులపై శ్రద్ధ వహించడం, పెదాలు నల్లబడకుండా పిగ్మెంటేషన్ బారిన పడకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు అనుసరించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లిప్ స్టిక్ వల్ల పెదాలు నల్లగా మారకుండా ఉండాలంటే ఇలా చేసి చూడండి.


ఎక్స్ ఫోలియేట్ చేయాలి: పెదాలని ఎక్స్ ఫోలియేట్ చేయడం వల్ల చర్మం కొంత గాలి పీల్చుకునేలా చేస్తుంది. మృతకణాలు, మురికిని తొలగిస్తుంది. ఈ మలినాలు తరచుగా పిగ్మెంటేషన్ కు కారణమవుతాయి. వాటిని పోగొట్టేందుకు చక్కెర, కొబ్బరి నూనె ఉపయోగించాలి. వీటిని పేస్ట్ మాదిరిగా చేసి పెదవులపై కొన్ని నిమిషాల పాటు రుద్దాలి. ఆపై గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.


మాయిశ్చరైజర్: పొడి, పగుళ్లు పిగ్మెంటేషన్ కి కారణమవుతాయి. అందుకే పెదవులు మాయిశ్చరైజింగ్ కీలకం. సహజమైన బీస్ వాక్స్, షియా బటర్ లేదా కోకో బటర్ తో లిప్ బామ్ ను అప్లై చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి పెదాలను తేమగా, మృదువుగా ఉంచుతాయి. తరచూ ఈ విధంగా చేయాలి.


లిప్ ప్రైమర్: లిప్ స్టిక్ అందంగా కనిపించేందుకు లి ప్రైమర్ చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. పెదవుల నుంచి రక్తస్రావం కాకుండా ఇది అడ్డుకుంటుంది. అందుకే లిప్ స్టిక్ రాసుకునే ముందు పెదవులకు కొద్దిగా లిప్ ప్రైమార్ వేసుకుంటే మంచిది.


ఉత్తమ ఎంపిక: కొన్ని లిప్ స్టిక్స్ లో పిగ్మెంటేషన్ కి కారణమయ్యే పదార్థాలు ఉంటాయి. సీసం, పారాబెన్, సల్ఫేట్ లేని లిప్ స్టిక్స్ ఎంచుకోవాలి. జోజోబా ఆయిల్, విటమిన్ ఇ, బీస్వాక్ వంటి సహజ మూలకాలతో కూడిన లిప్ స్టిక్ లు ఉత్తమమైనవి.


పడుకునే ముందు శుభ్రం చేసుకోవాలి: రాత్రంతా లిప్ స్టిక్ ఉంచడం వల్ల పిగ్మెంటేషన్ వస్తుంది. అందుకే పడుకునే ముందు లిప్ స్టిక్ శుభ్రం చేసుకోవాలి. లిప్ స్టిక్ తొలగించడానికి సున్నితమైన మేకప్ రిమూవర్ లేదా కొబ్బరి నూనె ఉపయోగించాలి. లిప్ స్టిక్ తీసేసిన తర్వాత పెదాలు తేమగా ఉండాలంటే లిప్ బామ్ రాసుకోండి.


హాని చేసే రసాయనాలు లేని లిప్ స్టిక్స్ ఎంచుకోవాలి. అప్పుడే చర్మం రంగు మారిపోకుండా అడ్డుకుంటుంది. సరైన చిట్కాలు పాటించి పెదాలు నల్లబడకుండా నిరోధించవచ్చు. మీరు ఇలా చేశారంటే పెదాలు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: మీ పిల్లల కళ్లు ఈ కలర్‌లోకి మారుతున్నాయా? జాగ్రత్త, అది కరోనా కొత్త వేరియంట్ ఆర్క్టురస్ లక్షణం