Easy Tips to Stay Active and Avoid Tiredness : ఈ రోజుల్లో విపరీతమైన వేడి కారణంగా.. బయట కొద్దిసేపు ఉన్నా కూడా శరీరం త్వరగా అలసిపోతుంది. దీంతో చాలా మంది తల తిరగడం, తలనొప్పి, నీరసం లేదా స్పృహ కోల్పోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అయితే వేసవిలో ఎనర్జీ ఎలా తగ్గిపోతుందో.. రోజంతా చురుకుగా ఉండటానికి శక్తిని నిలుపుకోవడానికి ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

Continues below advertisement

తీవ్రమైన ఎండ, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన దైనందిన కార్యకలాపాలు, ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎండలో కాసేపు బయటకు వెళ్తే.. శరీరం అలసిపోయేంత వేడిగా మారుతుంది. దీనికి ప్రధాన కారణం శరీరంలో నీటి శాతం తగ్గడమే. డీహైడ్రేషన్, తీవ్రమైన వేడి మీ పరిస్థితిని మరింత దిగజార్చుతాయి. శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల గుండె మరింత కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. దీంతో శక్తి వేగంగా ఖర్చవుతుంది. కానీ మీ లైఫ్​స్టైల్, ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ సమస్యలను నివారించవచ్చు.

హైడ్రేషన్..

వేసవిలో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే.. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడమే. కాబట్టి రోజంతా కొద్దికొద్దిగా నీరు తాగండి. అలాగే దాహం వేసే వరకు వేచి ఉండకండి. కొబ్బరి నీరు, నిమ్మరసం, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటి పానీయాలను కూడా తీసుకోవచ్చు. ఇవి శరీరానికి అవసరమైన ఖనిజాలను, లవణాలను అందిస్తాయి. అలాగే పుచ్చకాయ, కర్బూజా, కీరదోస, నారింజ వంటి పండ్లను తింటే శరీరానికి హైడ్రేషన్ అందుతుంది. 

Continues below advertisement

ఆహారపు అలవాట్లు

వేసవిలో తేలికగా, సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినండి. వేయించిన, మసాలా, నూనెతో కూడిన ఆహారాలు శరీర వేడిని పెంచుతాయి. మీ ఆహారంలో పెరుగు, సలాడ్, పెసలు, ఆకుకూరలు చేర్చుకోండి. ఉదయాన్నే నానబెట్టిన బాదం, అరటిపండ్లు తినడం వల్ల తక్షణ శక్తి లభించి, నీరసం తగ్గుతుంది. 

సూర్యరశ్మి నుంచి రక్షణ 

మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే ఈ సమయంలో సూర్యరశ్మి చాలా తీవ్రంగా ఉంటుంది. ఒకవేళ తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే.. మీ తలకు టోపీ, స్కార్ఫ్ లేదా గొడుగుతో కప్పుకోండి. మీ శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడే లేత రంగు, వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించండి. 

ఎండలో తిరిగి వచ్చాక..

ఎండలో తిరిగి వచ్చిన వెంటనే చల్లటి నీటిని తాగకూడదు. కాసేపు విశ్రాంతి తీసుకుని.. ఆ తర్వాత గది ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని తాగండి. ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే స్నానం చేయడం లేదా బట్టలు మార్చుకోవడం వంటివి చేయవద్దు. 5 నుంచి 10 నిమిషాలు విశ్రాంతి తీసుకున్న తర్వాత మాత్రమే వీటిని చేయండి. అలాగే పని నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఏసీలోకి వెళ్లే బదులు.. మీ శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి తీసుకురావడానికి ఫ్యాన్ కింద కూర్చోండి. అలాగే చల్లని ఫుడ్స్ తీసుకోకూడదు. ఐస్​క్రీమ్, ఫ్రిజ్​లో ఉంచిన పండ్లు, నీరు తీసుకోకూడదు. దీనివల్ల గొంతునొప్పి రావచ్చు. 

విశ్రాంతి..

మీ శరీరానికి విశ్రాంతి, నిద్ర ఇవ్వండి. వేడిలో శరీరం త్వరగా అలసిపోతుంది. కాబట్టి తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం. రోజంతా చురుకుగా ఉండటానికి.. ప్రతి రాత్రి కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. 

వ్యాయామం, యోగా 

ఉదయం లేదా సాయంత్రం తేలికపాటి వ్యాయామం చేస్తే మంచిది. యోగా లేదా ధ్యానం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇది వేడిని తగ్గిస్తుంది.  

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.