లికాలంలో చాలామందికి స్నానం చేయడానికి బద్దకిస్తారు. గోరు వెచ్చని నీటితో స్నానం చేయడానికి అవకాశం ఉన్నా.. చలికాలమే కదా, స్నానం చేసినా.. చేయకపోయినా పర్వాలేదని అనుకుంటారు. కానీ, అది చాలా ప్రమాదకరమని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. స్నానం మిమ్మల్ని ఎన్నో విధాలుగా సురక్షితంగా ఉంచిందనే సంగతి మీకు తెలిసిందే. అయితే, ఇన్నాళ్లు కేవలం బ్యాక్టీరియా, దుమ్మూ దూళి నుంచి దూరంగా ఉంచి.. ఆరోగ్యం ఉండేందుకు మాత్రమే స్నానం అవసరమని భావించేవాళ్లం. అయితే, ఈ స్టడీలో మాత్రం.. కొన్ని కీలక విషయాలను తెలుసుకున్నారు. స్నానం వల్ల Stroke(పక్షవాతం), గుండె నొప్పి వంటి ప్రాణాపాయాల నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు. స్నానం చేయనివారిలో ఈ ముప్పు పెరిగి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. అయినా, స్నానానికి.. స్ట్రోక్స్‌కు సంబంధం ఏమిటనేగా మీ సందేహం. అయితే, ఈ స్టడీలో ఏం చెప్పారో చూడండి. 


స్ట్రోక్ అంటే?: మెదడుకు రక్తం, ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయినప్పుడు లేదా ఏదైనా అంతరాయం కలిగినప్పుడు ఏర్పడే స్థితినే స్ట్రోక్ (Stroke) అని అంటారు. దీనివల్ల మనిషి చనిపోవడం లేదా శరీరంలో ఏదైనా ఒక భాగం పనిచేయకపోవడం వంటివి ఏర్పడవచ్చు. అయితే, ఇది ఒక్కొక్కరిలో ఒకలా ఉంటుంది. రక్తం గడ్డకట్టడం లేదా రక్త నాళాల్లో కొవ్వులు పేరుకుపోవడం వల్ల ఏర్పడుతుంది. అయితే, నిత్యం చక్కగా స్నానం చేసేవారిలో ఈ సమస్యలు చాలావరకు తగ్గుతాయని హార్వర్డ్ విశ్వవిద్యాలయం నిపుణులు వెల్లడించారు.


వేడి నీళ్లతో ఎక్కువ ప్రయోజనం: హార్వర్డ్ విశ్వవిద్యాలయం నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. వేడి నీళ్ల స్నానం లేదా బాత్ టబ్‌లో వేడి నీళ్లలో రిలాక్స్ కావడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందవచ్చు. వెచ్చని నీటి వల్ల శరీరంలోని రక్త నాళాలు విస్తరిస్తాయి. దాని వల్ల రక్తపోటు తగ్గుతుంది. స్నానం చేసేప్పుడు ఏర్పడే నీటి ఒత్తిడి వల్ల గుండె పంప్ చేసే రక్త పరిమాణం కూడా పెరుగుతుంది. దీనివల్ల రక్త నాళాల నుంచి రక్తం చురుగ్గా ప్రవహిస్తుంది. 


జపాన్‌లో 30,000 మందిపై నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం.. ప్రజలు స్నానం చేసే సంఖ్య, సమయాల ఆధారంగా ప్రతిరోజూ స్నానం చేసేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 28 శాతం తగ్గుతుందని పేర్కొన్నారు. రోజూ స్నానం చేయడం వల్ల స్ట్రోక్ ముప్పు 26 శాతం తగ్గుతుందని కనుగొన్నారు. అయితే, ఆ వ్యక్తులు తీసుకొనే ఆహారం, వ్యాయామం, ఆల్కహాల్, ధూమపానం వంటి అలవాట్ల వల్ల ఒకొక్కరిలో ఒక్కో ఫలితం ఉంటుందని తెలిపారు. అలాగే స్నానం చేసేప్పుడు ఉపయోగించే నీటి ఉష్ణోగ్రత ఆధారంగా కూడా ఫలితాలు ఉంటాయి. 


స్టీమ్ బాత్ మంచిదేనా?: హార్వర్డ్ నిపుణులు పరిశోధనలో భాగంగా స్టీమ్ బాత్(ఆవిరి స్నానం)పై వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకోడానికి ప్రయత్నించారు. రక్త పీడనాన్ని తగ్గించడానికి ఆవిరి స్నానం మంచిదేనని తేల్చారు. దీనివల్ల గుండె సమస్యలు తగ్గుతాయని, వారంలో నాలుగు నుంచి ఏడుసార్లు స్టీమ్ బాత్ చేయడం ద్వారా సత్ఫలితాలు పొందవచ్చని పేర్కొన్నారు. 2018లో నిర్వహించిన మరో అధ్యయనంలో కూడా స్టీమ్ బాత్ మంచిదేనని తేలింది. ఆరోగ్యకరమైన కొవ్వు, రక్తనాళాలు మెరుగ్గా పనిచేయడానికి ఈ విధానం మంచిదని తెలిపింది. అయితే, స్టీమ్ బాత్ అనేది అందరికీ సురక్షితం కాదని హార్వర్డ్ నిపుణులు చెప్పారు. రక్తపోటు, గుండె సమస్యలతో చికిత్స పొందుతున్నవారికి ఇది అంత మంచిది కాదని, 70 ఏళ్లు పైబడి.. రక్తపోటు సమస్యలు ఉండే పెద్దలకు కూడా స్టీమ్ బాత్ మంచిది కాదని సూచించారు.  


ఇలా చేస్తే మీరు సేఫ్: 
❂ బాగా చల్లగా ఉండే నీటిని తలపై పోసుకోకూడదు. 
❂ గోరు వెచ్చని నీటితో స్నానం వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశాలు తక్కువ. 
❂ బీపీ, డయాబెటిస్‌లను నియంత్రణలో ఉంచుకోవాలి. 
❂ బరువు పెరగకుండా జాగ్రత్తగా ఉండాలి. ఫాస్ట్ ఫడ్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. 
❂ రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయమం లేదా యోగా చేయాలి. వాకింగ్, సైక్లింగ్ కూడా మంచిదే. 
❂ శరీరానికి మేలు చేసే సమతుల ఆహారాన్ని మాత్రమే తీసుకోండి.
❂ ఆహారంలో ఉప్పు తక్కువగా ఉండాలి. 
❂ తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. 
❂ ప్రమాదాల వల్ల కూడా పక్షవాతం వస్తుంది కాబట్టి.. బైకు మీద వెళ్లేప్పుడు తలకు హెల్మెట్ ధరించాలి. 


ఎలా గుర్తించాలి?: నడక తేడాగా ఉండటం లేదా నడవడానికి ఇబ్బందిగా ఉండటం. తరచుగా మతి మరపు, కాళ్లు-చేతులకు పట్టులేకపోవడం, మాట్లాడటంలో ఇబ్బంది కనిపిస్తాయి. పక్షవాతం వల్ల కొందరిలో మాట ముద్ద ముద్దగా వస్తుంది. అక్షరాలు సరిగా పలకలేరు. గట్టిగా మాట్లాడలేరు.


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.