ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పీఆర్సీ అంశంపై సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. ఆదివారం పీఆర్సీ సాధన సమితి నాయకులు సీఎం జగన్‌తో చర్చలు జరిపి.. వివాదం సద్దుమణిగిందని ప్రకటించిన వేళ ఉద్యోగులు, ఉపాధ్యాయుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే దీనికి వ్యతిరేకంగా ఉద్యోగులు అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట నేడు నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలపనున్నారు. మరోవైపు, సోషల్ మీడియాలో ఉద్యోగ సంఘాల నేతలపై ట్రోలింగ్స్ వ్యంగ్యంగా పోస్ట్ అవుతున్నాయి.
‘మేమడిగింది సీపీఎస్ రద్దు.. మీరు చేసింది చింతామణి రద్దు’
ఉద్యోగ సంఘాల నేతలు ఫిట్‌మెంట్ కోసం ప్రయత్నించమంటే.. సెటిల్మెంట్ చేసుకొని వచ్చారని ట్విటర్‌లో మీమ్స్ ప్రత్యక్షమయ్యాయి. ఈ మధ్య వచ్చిన అఖండ సినిమాలో డైలాగులనూ వదల్లేదు. బాగా ఫేమస్ అయిన ‘బోత్ ఆర్ నాట్ సేమ్’ డైలాగ్‌ను ప్రస్తుత సందర్భానికి ఆపాదించి పలువురు ఉద్యోగులు, నెటిజన్లు బాలయ్య ఫోటోతో మీమ్ రూపొందించారు. ‘‘మేము అడిగింది ఫిట్‌మెంట్. మీరు చేస్తామంటున్నది సెటిల్‌మెంట్. మేము అడిగింది హౌస్ రెంటు. మీరు ఇస్తామంటుంది టెంట్ హౌస్ రెంట్. మేము అడిగింది మిశ్రా రిపోర్టు. మీరు ఇచ్చింది సీఎస్ రిపోర్టు. మేము అడిగింది పీఆర్సీ. మీరు ఇస్తామంటున్నది రివర్స్ పీఆర్సీ. మేము అడిగింది సీపీఎస్ రద్దు. మీరు చేసింది చింతామణి రద్దు.’’ అని వ్యంగ్యంగా మీమ్ రూపొందించారు.
ఇంకా ఉద్యోగ సంఘాల లీడర్లపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు ఉద్యోగులు. ‘సుదీర్ఘ చర్చల అనంతరం చివరికి సాధించింది ఇదే!’ అంటూ ఓ చిప్ప ఫొటోను పోస్ట్ చేశారు. అవే కాక, ప్రస్థానం సినిమాలో బాగా జనాదరణ పొందిన సాయి కుమార్ డైలాగ్ ‘అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరీ నాటకంలో’ అనే వీడియోను కూడా ప్రస్తుత సందర్భానికి ఆపాదించారు. అలాగే ఇతర వైరల్ వీడియోలను కూడా ప్రస్తుత పీఆర్సీ అంశంతో పోల్చుతూ రకరకాలుగా ట్వీట్లు, ఫేస్ బుక్‌లో పోస్టులు చేశారు.