పిల్లలు తుమ్మితే.. మన పెద్దలు ‘‘చిరంజీవ.. చిరంజీవ..’’ అని అంటారు. ఎందుకంటే.. తుమ్మును పునర్జన్మగా భావిస్తారు. తుమ్ము వల్ల కాసేపు గుండె చప్పుడు ఆగిపోయి.. కొ్ట్టుకుంటుందనే నమ్మకం ఉంది. శాస్త్రీయంగా కూడా ఈ విషయం నిజమనే తేలింది. అయితే, తుమ్మును అశుభంగా భావిస్తూ.. మనలో చాలామంది బలవంతంగా ఆపేసుకుంటాం. కానీ, అలా ఎప్పుడూ చేయొద్దని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే.. తుమ్ము వల్ల గుండెకు కాదు.. మెదడుకే ప్రమాదకమట. బలవంతంగా తుమ్మును ఆపితే.. మెదడులో నరాలు చిట్లిపోయే ప్రమాదం ఉందట. దానివల్ల ప్రాణాలు కూడా పోవచ్చట.
మెదడులోని నరాలు కూడా పగిలిపోయే అవకాశం:
తుమ్మును ఆపేందుకు ప్రయత్నించినప్పుడు చెవులకు నష్టం వాటిల్లుతుందని, మెదడులోని నరాలు కూడా పగిలిపోతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ENT (చెవి, ముక్కు,గొంతు) విభాగానికి వైద్యులు తుమ్ము వస్తే ఆపడం చాలా ప్రమాదకరం అని సూచిస్తున్నారు. సైన్స్ ప్రకారం తుమ్ము అనేది శరీరానికి చెందిన ఒక రిఫ్లెక్స్ చర్య. దాన్ని నియంత్రణ చేస్తే ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు.
తుమ్మేటప్పుడు నోటికి రుమాలు అడ్డు పెట్టుకోండి:
తుమ్మినప్పుడు రోగాలు వ్యాపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటప్పుడు, మీరు మీ నోటికి అడ్డంగా రుమాలు పెట్టుకొని తుమ్మాలి. సాధారణంగా తుమ్మినప్పుడు ప్రతి ఒక్కరూ తమ నోటిని రుమాలు లేదా గుడ్డతో కప్పుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.
తుమ్ము వచ్చినప్పుడు ముక్కులో ఏం జరుగుతుంది:
ముక్కు లోపల శ్లేష్మ పొర ఉంటుంది. ఈ పొర వెనుక ఉన్న నరాలు ఎర్రబడినప్పుడు, అక్కడ దురద ప్రారంభమవుతుంది. అందుకే తుమ్ములు వస్తాయి. తుమ్ము వచ్చినప్పుడు ముక్కు, నోటి నుంచి గాలి వేగంగా బయటకు వస్తుంది. నిజానికి, జలుబు కారణంగా నరాల వాపు సంభవిస్తుంది. అప్పుడు తుమ్ములు చాలా ఎక్కువగా వస్తాయి.
ఈ కారణాల వల్ల కూడా ఇది జరుగుతుంది:
కొన్నిసార్లు ఏదైనా పదార్థం ముక్కు లోపలికి వెళ్లినప్పుడు, నరాలు అసౌకర్యంగా మారతాయి. అప్పుడు ఈ పదార్థాన్ని బయటకు పంపడానికి శరీరం తుమ్ముల రూపంలో స్పందిస్తుంది. కొన్నిసార్లు అలెర్జీ కారణంగా తుమ్ములు వస్తాయి. కొన్నిసార్లు పొగలు, దుమ్ము పీల్చడం వల్ల తుమ్ములు వస్తాయి.
తుమ్ము అనేది శరీరం సృష్టించే ప్రతీతాత్మక చర్య. గాలి సహాయంతో, శ్వాసనాళంలోని పొరలకు సమస్యలను సృష్టించే పదార్థాలను బయటకు పంపేందుకు ప్రయత్నిస్తుంది. మీరు తుమ్మినప్పుడు, మీ శరీరం మొత్తం షాక్ అవుతుంది. చాలా సార్లు, మనం తుమ్మినప్పుడు, నోటి నుండి ముక్కు నుండి వచ్చే గాలి గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఉంటుంది.
అప్పుడు సీరియస్ గా పరిగణించండి:
తుమ్మేటప్పుడు శరీరంలో వైబ్రేషన్ ఉంటుంది. కళ్లు మూసుకుపోతాయి. తుమ్మిన తర్వాత మనం తరచుగా రిఫ్రెష్‌గా ఉంటాము. శరీరం తేలికగా అనిపించడం ప్రారంభమవుతుంది. కానీ కొన్నిసార్లు వైరస్ లేదా ఫ్లూతో బాధపడుతున్నప్పుడు, వరుసగా తుమ్ములు వస్తాయి. అలాంటి తుమ్ము సాధారణమైనవి కాదు, తీవ్రమైనవిగా గుర్తించాలి. వరుస తుమ్ముల వల్ల తల భారంగా మారుతుంది. ఏ పనిచేయలేం. కాబట్టి.. తప్పకుండా మీరు వైద్యుడిని సంప్రదించాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.