రోజంతా అలసటగా అనిపించడం అనేది చాలా సాధారణ సమస్య. దీన్ని TATT అంటారు. అన్ని సమయాల్లో అలిసిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అలసటగా అనిపించడానికి అతిపెద్ద కారణం రాత్రి పూట తగినంత నిద్రలేకపోవడం. ఎన్ హెచ్ఎస్ యుకె ప్రకారం పెద్దలు ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్య నిద్రపోవాలి. అలసటకి నిద్ర ఒక్కటే కారణం కాదు. అందుకే దీన్ని తేలికగా తీసుకోకూడదు. అలసటతో సంబంధం ఉన్న కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి.


స్లీప్ అప్నియా


స్లీప్ అప్నియా అనే దాని వల్ల నిద్రలో కాసేపు శ్వాస ఆగిపోతుంది. ఇది నిద్ర నాణ్యతను దెబ్బతీసి పగటి పూట అలసటకు దారి తీస్తుంది. ఊపిరి పీల్చుకోవడం, గురక పెట్టడం లేదా నిద్రలో ఉక్కిరిబిక్కిరిగా అనిపించడం, బిగ్గరగా గురక వంటివి ఈ స్లీప్ అప్నియా లక్షణాలు. దీని వల్ల ఎక్కువగా నీరసంగా అనిపిస్తుంది.


రక్తహీనత


శరీరంలో తగినంత ఎర్ర రక్తకణాలు లేకపోతే రక్తహీనత ఏర్పడుతుంది. ఇది అలసట, బలహీనతకు దారి తీస్తుంది. రక్తహీనత అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. ఇనుము లేదా విటమిన్ బి 12 లోపం వల్ల ఎక్కువగా ఈ పరిస్థితి ఎదురవుతుంది. రక్తపరీక్ష శరీరంలోని పోషకాల స్థాయిలను వెల్లడిస్తుంది. ఆహారం లేదా సప్లిమెంట్ల ద్వారా రక్తం పెంచుకునేందుకు ప్రయత్నించవచ్చు.


థైరాయిడ్ సమస్యలు


థైరాయిడ్ గ్రంథి అతిగా రియాక్ట్ అయినా తక్కువగా పని చేసినా కూడా అలసట కలిగిస్తుంది. ఈ గ్రంథి ప్రధాన విధి జీవక్రియని నియంత్రించడంలో సహాయపడే హార్మోన్లను ఉత్పత్తి చేయడం. థైరాయిడ్ తక్కువగా ఉన్నవారిలో జీవక్రియ మందగిస్తుంది. దీనివల్ల నీరసంగా అనిపిస్తుంది. అలాగే థైరాయిడ్ ఎక్కువగా ఉన్న వారిలో జీవక్రియ వేగవంతం అవుతుంది. ఈ ఓవర్ యాక్టివిటీ కూడా అలసతకు దారి తీస్తుంది.


మధుమేహం


అధిక రక్త చక్కెర స్థాయిలు అలసటకు కలిగిస్తాయి. మధుమేహం ఉన్నవారిలో ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు. దీని వల్ల ఇన్సులిన్ సమర్థవంతంగా పని చేయదు. రక్తంలో అదనపు గ్లూకోజ్ కు కారణమవుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు శక్తి తగ్గిపోతుంది. అలసటకి దారి తీస్తుంది.


లైఫ్ స్టైల్ లో మార్పులు


తీవ్రమైన వైద్య సమస్యలు లేదా నిద్రలేకపోవడంతో పాటు అలసట అనేక జీవనశైలి కారణాల వల్ల కూడా కావచ్చు. అటువంటి వాటిలో నిర్జలీకర్ణం ఒకటి. అందుకే అన్ని సమయాల్లో హైడ్రేట్ గా ఉండటం ముఖ్యం. చక్కెర, ప్రాసెస్ చేయాయిన ఆహారాలు, అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల అలసటగా అనిపిస్తుంది. వీటికి బదులుగా తాజా పండ్లు, కాలానుగుణ కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండిన సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఎన్ని చేసినా కూడా అలసట తగ్గకపోతే మాత్రం వెంటనే వైద్యులని సంప్రదించడం ముఖ్యం.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: భోజనం చేసిన వెంటనే ఇలా చేస్తున్నారా? జాగ్రత్త, ప్రాణాంతక వ్యాధులకు దారితీయొచ్చు!