పాలతో తయారైన రుచికరమైన పదార్థం పనీర్. దీనిలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. ఈ పనీర్‌ను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీంతో చేసిన వంటకాలు కూడా చాలా రుచిగా ఉంటాయి. రుచిగా ఉంటాయి కదా అని రోజూ పనీర్ లాగిస్తే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు. నిజానికి శాఖాహారులకు ప్రోటీన్ అధికంగా అందేదీ పనీర్‌తోనే. కాబట్టి వారు వారంలో నాలుగైదు సార్లు పనీర్ తినేందుకు ఇష్టపడుతూ ఉంటారు. రెస్టారెంట్లకు వెళ్లినా కూడా పనీర్‌తో చేసిన వంటకాలను ఎక్కువగా ఆర్డర్ పెడతారు. పనీర్ తినడం ఆరోగ్యకరమైనా... మితంగా తింటేనే మంచిది. అధికంగా తింటే నొప్పి తప్పదు.
పనీర్‌లో అధికంగా లాక్టోజ్ ఉంటుంది. లాక్టోజ్ అధికంగా శరీరంలో చేరితే దాన్ని జీర్ణించుకోవడం కష్టం అవుతుంది. కొంతమందిలో లాక్టోజ్‌ను జీర్ణించుకునే శక్తి చాలా తక్కువగా ఉంటుంది. పనీర్‌ను అధికంగా తింటే విరేచనాలు, వాంతులు, పొట్ట ఉబ్బరం, గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి సమస్యల బారిన పడతారు. కాబట్టి పన్నీర్‌ను మితంగానే తినేందుకు ప్రయత్నించండి. మధ్యాహ్నం పూట పనీర్ కర్రీ తిన్నాక, రాత్రిపూట మళ్లీ పనీర్‌తో చేసిన వంటకాలు తినకండి. ఏదైనా ఒక పూట మాత్రమే పనీర్ కర్రీని తినేందుకు ప్రయత్నించండి. పనీర్ అధికంగా తినడం వల్ల ఎక్కువగా వచ్చేవి జీర్ణ సమస్యలు. అలాగే బరువు కూడా త్వరగా పెరిగిపోతారు. బరువు పెరగడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు త్వరగా వస్తాయి. మధుమేహం ఉన్నవారు పనీర్ తింటే ఆరోగ్యకరమే. కానీ మితంగానే తినాలి, లేకుంటే వారు బరువు పెరిగి శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశం ఉంది. అధిక రక్తపోటు కూడా ఉన్నవారు కూడా పనీర్ మితంగా తింటేనే ఆరోగ్యకరం. దీన్ని అధికంగా తింటే రక్తపోటు పెరిగిపోవచ్చు.
పనీర్‌ను అధికంగా తినడం వల్ల గుండెకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే పక్షవాతం, పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి వంటి సమస్యలు రావచ్చు. అలాగే కొందరిలో ఎలర్జీలకు కూడా కారణం కావచ్చు. పాలతో చేసిన పదార్థాలు అధికంగా తినడం వల్ల శరీరం రియాక్షన్ ఇస్తుంది. ఆ రియాక్షన్ చర్మంపై దురద, దద్దుర్లు వంటి రూపంలో కనిపిస్తుంది. కాబట్టి పనీర్‌ను అధికంగా తినకుండా మితంగా తినండి. ఇలా తక్కువగా తినడం వల్ల పనీర్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
పనీర్‌ను వారానికి ఒకటి నుంచి రెండుసార్లు తింటే చాలు. అది కూడా తక్కువ మొత్తంలోనే. ఇలా తినడం వల్ల క్యాన్సర్ వచ్చే సమస్య తగ్గుతుంది. ముఖ్యంగా మహిళలు పనీర్‌ను తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు. పనీర్ అనేది పాల ఉత్పత్తి. అంటే దీనిలో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. తక్కువగా తింటే గుండెకు ఇది ఎంతో మేలు చేస్తుంది. అదే ఎక్కువగా తింటే కొలెస్ట్రాల్ రూపంలో పేరుకుపోయి గుండెపోటు వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. రక్తంలోని షుగర్ స్థాయిలను అదుపులో ఉంచే శక్తి కూడా పనీర్ కి ఉంది. పనీర్ ఎక్కువగా తింటే షుగర్ స్థాయిలు పెరిగిపోవచ్చు. కాబట్టి రెండు రోజులకు ఒకసారి లేదా మూడు రోజులకు ఒకసారి తినడం అలవాటు చేసుకోండి. రోజులో రెండు పూటలా పనీర్‌ను అధికంగా తింటే మాత్రం గ్యాస్ట్రిక్ సమస్యలు, జీర్ణ సమస్యలు ఎక్కువైపోతాయి.
Also read: త్వరగా బరువు తగ్గేందుకు వాటర్ ఫాస్టింగ్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోపోతే కష్టాలు తప్పవు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.