సాధారణంగా గురక పెట్టి నిద్రపోతున్న వారిని చూసి అబ్బా ఎంత నిశ్చింతగా నిద్రపోతున్నాడో అనుకుంటాం. కానీ మీకు తెలుసా? అది నిశ్చింత నిద్ర కాదని, చింతించాల్సిన విషయమని. ఎందుకంటే.. తాజాగా జరిపిన అధ్యయనంలో పరిశోధకులు కొన్ని భయానక నిజాలు తెలుసుకున్నారు. అవేంటో చూడండి.  


నిద్రలో గురక పెట్టే అలవాటు ఉన్నవారు భవిష్యత్తులో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొనే ప్రమాదం ఉందట. చైనాకు చెందిన కొంత మంది సైంటిస్టులు నిద్ర సరిగాలేని వారు భవిష్యత్తులో చూపు కోల్పోవచ్చని అంటున్నారు. నిద్ర సరిగా లేకపోవడం అంటే ఇన్సోమ్నియా మాత్రమే కాదు, గురక పెట్టడం కూడా కావచ్చు. కారణం ఏదైనా రాత్రి పూట చాలా తక్కువగా నిద్రపొయ్యే వారికి ఈ గండం పొంచి ఉంటుందనేది వారి అభిప్రాయం.


సైంటిస్టుల హెచ్చరికల ప్రకారం ఈ పరిస్థితులు గ్లకోమాకు కారణం కావచ్చట. గ్లకోమాలో కంటి నుంచి మెదడుకు అనుసంధానం చేసే ఆప్టిక్ నర్వ్ డామేజ్ అవటం వల్ల కంటి చూపు క్రమేణా తగ్గుతూ వస్తుంది. దీనికి పూర్తిగా చికిత్స అందించడం సాధ్యం కాదు. కానీ అదుపులో ఉంచేందుకు మందులు వాడాల్సి ఉంటుంది. ఈ జబ్బు చాలా నిశ్శబ్ధంగా కంటి చూపును పోగొడుతుంది.


పెద్ద వయసు వారు ముఖ్యంగా 70,80 ల వయసులో ఉన్నవారు తప్పనిసరిగా స్లీప్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నిర్థారణల కోసం యూకే బయోబ్యాంక్ స్టడిలో దాదాపు 4 లక్షల మంది పాల్గొన్నారట. 40 నుంచి 69 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారిని 2006 నుంచి 2010 వరకు మానీటర్ చేసి ఈ వివరాలను వెల్లడించారు.  2021 లో మరోక సారి వారి స్లీపింగ్  ప్యాటర్న్ తో పాటు పరీక్షలు నిర్వహించినపుడు వారిలో 8 వేల 6 వందల 79 మందిలో గ్లకోమా నిర్ధారణ అయ్యింది.


రాత్రుళ్లు సరిపడినంత నిద్ర కలిగిన వారితో పోల్చితే నిద్ర సరిగా లేని వారు, గురక కారణంగా నిద్ర డిస్టర్బ్ అయ్యే వారిలో 11 శాతం వరకు గ్లకోమా రిస్క్ ఎక్కువ అని తేలిందట. అందుకని నిపుణులు గ్లకోమా ప్రివెన్షన్ లో భాగంగా తప్పనిసరిగా స్లీప్ ప్యాటర్న్ లను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని సూచిస్తున్నారు. ఇలా నిద్ర సరిగా లేని వారు కేవలం గ్లకోమా మాత్రమే కాదు బీపీ బారిన పడే ప్రమాదం కూడా ఉంటుంది. ఇప్పటికే బీపీ ఉండి నిద్ర కూడా సరిగా లేకపోతే స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటి ప్రాణాంతక పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందనేది నిపుణుల హెచ్చరిక.



Also read: స్టెరాయిడ్స్ ఉన్న క్రీములు అతిగా వినియోగిస్తున్నారా? జాగ్రత్త మీ అందం కోల్పోవాల్సి వస్తుందేమో



ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 5.5 మిలియన్ల మంది హైపర్ టెన్షన్ సమస్యను ఇంకా నిర్దారించుకోకుండా ఉన్నారని ఒక అంచనా. వీరిలో నిద్ర సమస్యలు ఎదుర్కొంటున్న వారే ఎక్కువ.  నిద్ర విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో చాలా మంది రకరకాల ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎల్లప్పుడు పొంచి ఉంటుందని అటువంటి వారు తగుజాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమనేది నిపుణుల సలహా.