ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 ఎంతో మంది ప్రాణాలను పొట్టనపెట్టుకుంది. తమ వారిని కనీసం చివరి చూపు కూడా చూసుకోనివ్వకుండా చేసింది. ఈ వైరస్ వల్ల చనిపోయిన వారి మృతదేహాలను సొంతవారికి కూడా ఇవ్వకుండా హాస్పిటల్ సిబ్బందే దహన సంస్కారాలు నిర్వహించారు. అటువంటి పరిస్థితుల నుంచి.. ‘‘ఇప్పుడు కోవిడ్ ఏం చేస్తుందిలే, అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది కదా. వచ్చాక చూసుకుందాం’’ అని అనుకునే దాకా వచ్చింది. కోవిడ్ నియంత్రణకి వ్యాక్సిన్స్ వచ్చిన తర్వాత ప్రజల్లో దాని మీద భయం పోయింది. వ్యాక్సిన్ వేయించుకున్నాం కదా ఏం కాదులే అనే ధీమాతో ఉంటున్నారు. అయితే వ్యాక్సిన్స్ వల్ల కొంతమందికి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ వస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. అయితే, కోవిడ్ సోకి చికిత్స తీసుకుని తగ్గిపోయిన వాళ్ళలో కూడా కొన్ని వ్యాధులు బయట పడుతున్నాయి. తలనొప్పి, నీరసం, ఒళ్లు నొప్పులు వస్తూ తరచూ ఇబ్బందికి గురి చేస్తున్నాయి.
కరోనా ఇంకా ఉనికిలోనే ఉంది: కోవిడ్ ముప్పు ఇంకా పోలేదని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు. కోవిడ్ వచ్చిన తగ్గిన బాధితుల్లో రెండేళ్ల తర్వాత మానసిక ఆందోళన, మూర్చలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 1.25 మిలియన్ల కోవిడ్ పేషెంట్స్ రికార్డ్స్ పరిశీలించిన నిపుణులు ఈ విషయాన్ని వెల్లడించినట్టు కథనాలు వెలువడ్డాయి. కోవిడ్ మహమ్మారి నుంచి బయట పడిన వారిలో నాడీ సంబంధిత వ్యాధులకు గురయ్యే ప్రమాదాలు ఎక్కువగా ఉందనేందుకు ఆధారాలు పెరుగుతూనే ఉన్నాయి. గతంలో వెలువడిన అధ్యయనాల ప్రకారం కోవిడ్ నుంచి బయటపడిన 6 నెలల్లో నరాలు, మానసిక ఆందోళన పరిస్థితులు గురైనట్టు నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిస్థితులు మరో రెండు సంవత్సరాలు కొనసాగే ప్రమాదం ఉందని యూకేకి చెందిన ఓ ప్రొఫెసర్ చెప్పుకొచ్చారు.
కోవిడ్ 19 తర్వాత ఇలా ఎందుకు జరుగుతుంది?: కరోనా నుంచి కోలుకున్నా సరే, దాని ప్రభావం ఇంకా ఎందుకు ఉంటుంది? దానికి నివారణ చికిత్స ఏంటి అనే దాని మీద మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని సదరు ప్రొఫెసర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ రెండేళ్ల కాలపరిమితిలో అమెరికాకు చెందిన 14 మందిలో నరాలు, మానసిక సమస్యలు ఎదుర్కొన్న వారిని గుర్తించినట్టు ఆయన చెప్పుకొచ్చారు. యూఎస్ ఆరోగ్య నివేదికల ప్రకారం 1.2 కోట్ల మంది కోవిడ్ బారిన పడ్డారు. వారిలో చాలా మంది శ్వాసకోశ సంబంధ సమస్యలను కూడా ఎదుర్కొంటున్నట్టు తేలింది. ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ ఉన్నవారితో పోలిస్తే వైరస్ సోకిన 18-64 వయస్సు కలిగిన వ్యక్తులు కోవిడ్ 19 లక్షణాలని కలిగి ఉన్నారట.
ఎవరిపై ఎక్కువ ప్రభావం?: 65 ఏళ్లు పైబడిన వారిలో కోవిడ్ సోకిన తర్వాత రెండేళ్ల పాటు డీమెన్షియా, సైకలాజికల్ డిజార్డర్ వంటి సమస్యల్ని ఎదుర్కొంటూనే ఉన్నారు. అలాగే కోవిడ్ సోకిన పిల్లలు కూడా కొన్ని పరిస్థితిలో మూర్చలు, మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. డెల్టా వేరియంట్ లో ఎదురైన సమస్యలో ఒమిక్రాన్ వేరియంట్లోనూ కనిపించాయి. కోవిడ్ సోకిన వారిలో ఎక్కువగా డిప్రెషన్, యాంగ్జైటీ వంటి లక్షణాలు కనిపించాయి. రెండేళ్ల తర్వాత కూడా వాటిలో మార్పు స్వల్పంగా తగ్గినప్పటికీ మూర్ఛ, మానసిక ఆందోళన వంటి సమస్యలు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ లక్షణాలు పిల్లల కంటే పెద్దవారిలోనే ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే కోవిడ్ వల్ల దీర్ఘకాలిక సమస్యలు వచ్చే ప్రమాదం ఇంక ఎక్కువగానే ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి, నిర్లక్ష్యం చేయకుండా మాస్క్ పెట్టుకునే బయట తిరగండి. ఊపిరి ఆడటం లేదని తీసేస్తే.. అది ఏదో ఒకరోజు ఊపిరి ఆపేస్తుంది.
Also Read: టాయిలెట్‌లో టైంపాస్? గంటలు గంటలు దానిపై కూర్చుంటే చెప్పుకోలేని రోగం వస్తుందట!
Also Read: 30 డేస్ వాటర్ ఛాలెంజ్ - ఈ ట్రెండ్ ఫాలో కావద్దు, ప్రాణాలు పోతాయ్, ఎందుకంటే..