క్యాన్సర్లలో కొన్ని వారసత్వంగా వస్తాయి. వాటిలో రొమ్ము క్యాన్సర్ కూడా ఒకటి. వారసత్వపు క్యాన్సర్లు జన్యుపరమైన మ్యుటేషన్లతో కూడుకుని ఉంటాయి. అంటే ఓసారి తగ్గాక మళ్లీ రావనే ధీమా పనికిరాదు. మళ్లీ తిరగబెట్టే అవకాశం పుష్కలంగా ఉంది. జన్యపరమైన క్యాన్సర్ అంశంలోనే ‘ఏంజెలీనా జోలీ ఎఫెక్ట్’ అనే పదం వినిపిస్తుంది. దానికి కారణం ఏంజెలీనా జోలీ చేసిన ఓ పని. నిజానికి ఆ పని అందరూ చేయలేరు. ఇంతకీ ఏం చేసింది?


హాలీవుడ్ నటి ఏంజెలీని జోలీ తల్లికి రొమ్ము క్యాన్సర్ తో మరణించారు. అది జన్యపరంగా కూడా వచ్చే అవకాశం ఉండడంతో జోలీ కూడా టెస్టులు చేయించుకున్నారు. జన్యుపరంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందో లేదో చెప్పే పరీక్షలు అవన్నీ. అందులో ఆమెకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం 87 శాతం ఉన్నట్టు తేలింది. దీంతో ఏంజెలీనా తీవ్ర నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ రాకముందే తన రెండు రొమ్ములను తీయించేసుకుంది. ఆమె ఉన్న సినీ ఇండస్ట్రీలో అందంగా కనిపించడం చాలా ముఖ్యం. అవేవీ పట్టించుకోకుండా ఆమె రొమ్మును తొలగించుకోవడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. దీంతో ‘ఏంజెలీనా జోలీ ఎఫెక్ట్’ అనే పేరు వచ్చింది. 


హంసానందినికీ...
మిర్చి, అత్తారింటికి దారేది సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నర్తించిన హంసానందిని కూడా రొమ్ము క్యాన్సర్ బారిన పడినట్టు ప్రకటించింది. ఆమెకు జన్యుపరంగా వచ్చిన క్యాన్సరే. అంటే వారసత్వంగా వచ్చిందన్నమాట. ఇది తగ్గినట్టే కనిపించినా మళ్లీ తిరగబెట్టే అవకాశం 70 శాతం మేర ఉన్నట్టు ఆమె తన సోషల్ మీడియాలో ఖాతాలో రాసుకొచ్చారు.


రొమ్ము క్యాన్సర్ ను ఎలా కనిపెట్టాలి?
మహిళలు రొమ్ము క్యాన్సర్ విషయంలో అవగాహన పెంచుకోవాలి. రొమ్ము ఆకారంలో కానీ, పరిమాణంలో కూడా తేడా వస్తే తేలికగా తీసుకోకూడదు. రొమ్ముల నుంచి స్రావాలు కారుతున్నా కూడా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. రొమ్ముల రంగులో తేడా వచ్చినా వెంటనే టెస్టులు చేయించుకోవాలి. మామోగ్రామ్ పరీక్ష ద్వారా రొమ్ము క్యాన్సర్ ఉందో లేదో తేలుస్తారు. రొమ్ములో గడ్డల్లాంటివి తగిలితే అవి క్యాన్సర్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి నిర్లక్ష్యం వహించకుండా వైద్యులను కలవాలి. 


ఎన్నో కారణాలు...
క్యాన్సర్ రావడానికి ఇదే ప్రధాన కారణం అని చెప్పడానికీ ఏదీ లేదు. చెడు జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్లు, వారసత్వం, హార్మోన్లు ఇలా... రకరకాల కారణాల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. మహిళలకు అధికంగా రొమ్ము, అండాశయ క్యాన్సర్లు వస్తాయి. అయితే మనదేశంలో వారసత్వంగా వచ్చే క్యాన్సర్ల శాతం తక్కువగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. 


Also read: బరువు తగ్గేందుకు లిక్విడ్ డైట్ ఫాలో అవుతున్నారా? ముందుగా వాటి దుష్ప్రభావాలేంటో తెలుసుకోండి


Also read: హార్వర్డ్ నిపుణులు చెప్పిన ఆరు ఉత్తమ ఆహారాలు ఇవే, తింటే డాక్టర్ అవసరం తగ్గుతుంది