ప్రకాశవంతమైన, ఆరోగ్యవంతమైన చర్మం ఈరోజుల్లో చాలా తక్కువ మందికి ఉంటుంది. ఒత్తిడి, కాలుష్యం ఇతర కారకాల వల్ల చర్మం పాడైపోతుంది. దాన్ని సంరక్షించుకునేందుకు ఉన్న అన్నీ మార్గాలని ప్రయత్నిస్తున్నారు. వాటిలో ఉపయోగకరమైన చిట్కా నారింజ రసం. సిట్రస్ పండు నుంచి తీసే ఈ రసం ఆరోగ్యకరమైన పానీయం మాత్రమే కాదు అందాన్ని ఇస్తుంది. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. నారింజ రసం చర్మంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
నారింజ రసం ప్రయోజనాలు
ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ ఎ, సి, బి ఉన్నాయి. పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాల మూలం. ఇందులోని విటమిన్ సి చర్మ సంరక్షణకి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తికి సహకరిస్తుంది. చర్మం ముడతలు పడకుండా నిరోధిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. ఇవి చర్మ కణాలని దెబ్బతీసి, వృద్ధాప్య ప్రక్రియని వేగవంతం చేస్తాయి.
కొల్లాజెన్ ఉత్పత్తి: చర్మ సంరక్షణకి అవసరమైన ప్రోటీన్ కొల్లాజెన్. ఇది చర్మానికి దృడత్వాన్ని, మృదుత్వాన్ని అందిస్తుంది. నారింజ రసం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం స్థితిస్థాపకత మెరుగుపరుస్తుంది. చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
మెరిసే చర్మం: ఆరెంజ్ జ్యూస్ లోని విటమిన్ సి చర్మానికి మెరుపుని ఇస్తుంది. చర్మాన్ని నల్లగా చేసే మెలనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. నల్ల మచ్చల రూపాన్ని తగ్గిస్తుంది.
హైడ్రేషన్: ఆరెంజ్ జ్యూస్ ఎక్కువగా నీటితో నిండి ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా చేస్తుంది. హైడ్రేట్ గా ఉన్న చర్మం నిగనిగలాడుతూ ఆరోగ్యంగా కనిపిస్తుంది. చర్మానికి మేలు చేస్తుంది.
గాయాలు నయం: ఇందులోని విటమిన్ సి గాయాలు మానేలా చేస్తుంది. కొత్త రక్త నాళాలు, కొల్లాజెన్ ఏర్పడటానికి మద్దతు ఇస్తుంది. ఈ రెండూ చర్మం దెబ్బతినకుండా కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తాయి. ఆహారంలో నారింజ రసం చేర్చుకోవడం వల్ల గాయాలు త్వరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
ఆరెంజ్ జ్యూస్ కొంత వరకు మేలు చేస్తుంది. కానీ ఇది తీసుకునే ముందు దీని వల్ల కలిగే నష్టాల గురించి కూడా తెలుసుకోవాలి. దీన్ని తీసుకునే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మ ప్రయోజనాల కోసం కేవలం ఆరెంజ్ జ్యూస్ మీద మాత్రమే ఆధారపడటం సరైన ఆలోచన కాదు. ఇది శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలని అందించలేకపోవచ్చు.
నారింజ జ్యూస్ వల్ల దుష్ప్రభావాలు
అసిడిటీ: ఇది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. అధిక వినియోగం చర్మ చికాకు కలిగిస్తుంది. సున్నితమైన చర్మం కలిగిన వాళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చర్మంపై నారింజ రసాన్ని ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది.
అలర్జీ: కొందరికి సిట్రస్ పండ్లు తీసుకుంటే అలర్జీ కలుగుతుంది. డైట్ లేదా స్కిన్ కేర్ రొటీన్ లో తీసుకునే ముందు వచ్చే అలర్జీ గురించి తెలుసుకోవడం ముఖ్యం. అధిక మొత్తంలో నారింజ రసం తీసుకోవడం వల్ల చక్కెర, కేలరీలు ఎక్కువగా శరీరానికి అందుతాయి. అది చర్మ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాలు చూపదు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: మధుమేహులు మొక్కజొన్న తినొచ్చా? ఎలా తింటే ఆరోగ్యానికి మేలు