ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఔషధ మొక్క కలబంద. దాదాపు అన్ని ఇళ్లల్లో కుండీలో కలబందను పెంచుతూనే ఉంటారు. దీనికి పెద్దగా స్థలం అవసరం లేదు. చిన్న కుండీ ఉంటే చాలు, పెరిగేస్తుంది. ఇది అందాన్ని, ఆరోగ్యాన్ని తెచ్చే మొక్కగా చెప్పుకుంటారు. ఆయుర్వేదంలో దీని స్థానం ఉన్నతమైనది. దీన్ని పెంచడం కూడా చాలా సులభం. రోజూ నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. గాలిలో ఉన్న తేమను పీల్చుకొని కూడా జీవించేస్తుంది. అందుకే ఈ మొక్కను ప్రతి ఒక్కరూ పెంచుకుంటారు. అయితే కలబంద అందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుందని చెబుతుంది ఆయుర్వేదం. అది నిజమే, కలబంద రసాన్ని చర్మానికి రాయడం వల్ల చాలా చర్మ సమస్యలు తగ్గుతాయి. అనేక కాస్మెటిక్స్ లోను, ఆయుర్వేద వైద్య విధానాల్లోనూ కలబందను వాడుతూ ఉంటారు.


కలబందను మితంగా వాడడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. గుండె మంట తగ్గుతుంది. అజీర్తి వంటి రోగాలు రాకుండా ఉంటాయి. ఉదయానే పరగడుపున కలబంద ఆకుని తింటే పొట్టలో ఉన్న అన్ని రకాల సమస్యలు తగ్గిపోతాయని చెబుతారు. నోటి పరిశుభ్రతను కాపాడే లక్షణం కూడా కలబందకు ఉంది. దీంతో తయారు చేసిన టూత్ పేస్ట్ ను వాడితే  నోటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెబుతారు. కలబందలోని గుజ్జు, కీళ్ల నొప్పులు తగ్గడానికి ఉపయోగపడుతుంది. జుట్టు సంరక్షణకు కూడా కలబంద సహకరిస్తుంది. చుండ్రు పట్టినప్పుడు కలబంద గుజ్జును మాడుకు పట్టించడం వల్ల చుండ్రు పోయే అవకాశం ఉంది. అలాగే ఎండకు కమిలిన చర్మాన్ని కాపాడుకోవాలన్నా కలబందను ఆశ్రయించాల్సిందే. అయితే దీన్ని మితంగా వాడితేనే ఈ లాభాలన్నీ కలుగుతాయి. అధికంగా వాడితే మాత్రం అలర్జీలు రావడం ఖాయం.


ఔషధ విలువలకు పేరుగాంచిన ఈ ఆకుపచ్చ రంగు మొక్క సౌందర్య సంరక్షణకు ముందుంటుంది. అయితే కొంతమందిపై ఇది చెడు ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. కలబంద నుంచి ఉత్పత్తి అయ్యే రబ్బరు పాలు చర్మానికి తగిలినప్పుడు అవి అలర్జీలను కలిగించే అవకాశం ఉంది. ఈ అలెర్జీ వల్ల పొట్ట తిమ్మిరి, పొటాషియం స్థాయిలు పడిపోవడం వంటివి జరగవచ్చు. అలాగే అలోవెరా జెల్ పడకపోతే చర్మ అలెర్జీలు, దద్దుర్లు, మండుతున్న ఫీలింగ్ వచ్చే అవకాశం ఎక్కువ. కలబంద రసాన్ని తీసుకోవడం వల్ల చక్కెరస్థాయిలు తీవ్రంగా పడిపోయే అవకాశం ఎక్కువ. కాబట్టి తక్కువగానే దీన్ని తాగాలి. అలోవెరాను అధికంగా తాగితే డిహైడ్రేషన్ సమస్య కూడా వస్తుంది. కాబట్టి వేసవిలో అలోవెరా ఆహారంలో భాగం చేసుకోకపోవడమే మంచిది. అలాగే చర్మంపై లోతైన గాయాలను మాన్పే శక్తిని ఇది తగ్గిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. 




Also read: ఇక్కడున్న అంకెల్లో తేడాగా ఉన్న అంకె ఎక్కడుందో కనిపెట్టండి, అది కూడా పది సెకన్లలో...


Also read: నా భర్త తమ్ముడే నా మాజీ లవర్, ఈ విషయం నా భర్తకి ఎలా చెప్పాలి?












































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.