ప్రంపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని వేధిస్తున్న సమస్య ఊబకాయం. ఆధునిక జీవనశైలి ఫలితంగా శరీరం అధిక బరువును సంతరించుకోవటం వయస్సుతో నిమిత్తం లేకుండా అన్ని ఆర్థిక వర్గాల వారిలోనూ కనిపిస్తుంది. మితిమీరిన శరీర బరువు వైద్యపరంగా ఓ సమస్య. అదుపులేని ఊబకాయం శరీరంలోని వివిధ అవయవాలపైన ప్రతికూల ప్రభావాన్ని చూపించి తీవ్ర అనారోగ్యానికి కలిగిస్తుంది. ఆయుష్షు తగ్గించేస్తుంది. వ్యక్తి పొడవు, శరీరపు బరువు ఆధారంగా లెక్కించే బి.ఎం.ఐ.(బాడీ మాస్ ఇండెక్స్)ను బట్టి ఊబకాయం తీవ్రతను అంచనా వేస్తారు. బి.ఎం.ఐ. 25 కి.గ్రా/ఎం2 నుంచి 30కి.గ్రా /ఎం2 వరకూ ఉంటే అధిక బరువుగా భావిస్తారు. అది 30కి.గ్రా /ఎం2 దాటితే ఊబకాయంగా పరిగణిస్తారు.


'వరల్డ్ ఒబేసిటీ డే' సందర్భంగా కామినేని హాస్పిటల్స్ సీనియర్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్. సందీప్ రెడ్డి మాట్లాడుతూ  “మనదేశంతో సహా ప్రపంచమంతటా ప్రస్తుతం  ప్రాణనష్టం జరగకుండా నివారించగల అవకాశం ఉన్న తీవ్రమైన ఆరోగ్యసమస్యగా ఊబకాయం గుర్తింపు పొందింది. ఏటా 30 నుంచి 40 లక్షల మంది దీని కారణంగా మరణిస్తున్నారు. మితిమీరిన శరీర బరువుగల వయోజనులు, పిల్లలతో మన దేశం అమెరికా, చైనా తరువాత మూడో స్థానంలో ఉంది. దాదాపు అయిదు కోట్ల మంది భారతీయులు ఊబకాయంతో బాధపడుతున్నట్లు అంచనా. జనాభాలో  34 శాతం మితిమీరిన శరీర బరువుగల వారితో పంజాబ్ దేశంలో మొదటి స్థానంలో ఉండగా 20 శాతం మందితో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుఐదో స్థానంలో ఉన్నాయి. అధిక బరువు వల్ల టైప్ -2 డయాబెటిస్, గుండెవ్యాధులు, నిద్రలో శ్వాససమస్యలు, ఆస్టియో ఆర్థరైటిస్, కొన్నిరకాల కాన్సర్లు వస్తున్నాయి” అని ఆయన అన్నారు.


బరువు పెరగడానికి కారణాలు ఇవే.. 


జన్యుపరమైన కారణాల వల్ల  భారతీయులలో నడుము చుట్టూ పెద్ద మొత్తంలో కొవ్వుపెరిగి ఊబకాయం ఏర్పడే అవకాశాలు ఎక్కవగా ఉన్నాయి. దీనికి తోడు జీవనశైలికి సంబంధించిన కొన్ని అంశాలు కూడా శరీరం బరువును విపరీతంగా పెంచేస్తున్నాయి. అవసరానికి మించి కేలరీలను సమకూర్చే ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవటం, ఎండోక్రైన్ డిజార్డర్స్(వినాళ గ్రంధుల వ్యాధులు), మనోవ్యాధులు, కొన్నిరకాల ఔషధాలు కారణంగా ఉన్నాయి. ఆహారపు అలవాట్లు, తగినంత నిద్రలేకపోవటం, వాహనాలపైనే ఎక్కువ ఆధారపడటం వంటివి కూడా శరీర బరువు పెరగటానికి కారణాలుగా ఉన్నాయి.


ఈ సమస్య నుంచి బయట పడాలంటే శారీరక శ్రమ చాలా అవసరం. ఇందుకోసం వ్యాయామం, తక్కువ కేలరీలు గల ఆహారం తీసుకోవటం, బరువు తగ్గించే మందులు వాడటం వంటివి చేయాలి. ఈ ప్రయత్నాలు ఫలితం ఇవ్వకపోతే బరువు తగ్గించే శస్త్ర చికిత్సల ద్వార పరిష్కారం పొందవచ్చు. మితిమీరిన మొండి శరీరపు బరువు తగ్గించటంలో సర్జరీలు మంచి ఫలితాలు ఇస్తున్నట్లు వెల్లడి అయ్యింది. ఊబకాయం గల వారు ఈ ఆపరేషన్లతో తమ బరువును గణనీయంగా తగ్గించుకోగలిగారు. జీర్ణవ్యవస్థలో కొన్ని మార్పులు చేయటంతో ఈ సర్జరీలు ఆహారం ద్వారా అందే కేలరీలను పరిమితం చేస్తాయి. ఈ రకంగా ఆహారంతో అందే కేలరీలను తగ్గించటమే అధిక శరీరబరువుకు అన్నిరకాల సమస్యలకు అసలైన పరిష్కారం కాగలదు. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: బ్రేక్‌ఫాస్ట్‌గా అరటిపండు ఇలా తీసుకోండి, ఎటువంటి ఇబ్బందులు దరిచేరవు