నేడు అత్యధికులు ఎదుర్కొంటున్న సమస్య ఊబకాయం, అధిక బరువు. బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కంటికి నచ్చింది ఫుల్ గా లాగించేసి లావైపోతారు. తర్వాత దాన్ని తగ్గించుకునేందుకు తంటాలు పడతారు. బరువు తగ్గడం అనేది చాలా క్రమశిక్షణతో కూడుకున్నది. నాలుగు రోజులు చేసి బోర్ కొట్టి మధ్యలో వదిలేశారంటే ఎటువంటి ప్రయోజనం దక్కదు. మనలో చాలా మంది బరువు తగ్గించుకునేందుకు ప్రణాళిక వేసుకుంటారు. డైట్ ఫాలో అవుతారు, వ్యాయామం చేస్తారు. కానీ కొన్ని రోజులకే అదంతా పక్కన పెట్టేస్తారు. దీనికి పరిష్కారం ఒక్కటే అదే వామ్ము వాటర్.


మన అమ్మమ్మ, నానమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా ఇది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. అందుకే ప్రతిరోజు మీ డైట్ లో వామ్ము నీళ్ళు తాగడం అలవాటు చేసుకుంటే నాజూకైన అందం మీ సొంతం అవుతుంది. ఈ నీళ్ళు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అజీర్ణ సమస్యలు వచ్చినప్పుడు ఇళ్ళలో కొందరు పెద్ద వాళ్ళు వామ్ము లేదా జీలకర నోట్లో వేసుకుని నములుతారు.


జీర్ణక్రియ మెరుగు


రోజూ వామ్ము నీళ్లు తాగడం వల్ల అజీర్ణం తగ్గుతుంది. అయితే ఖాళీ కడుపుతోనే దీన్ని తీసుకోవాలి. మెరుగైన జీర్ణక్రియ బరువు హెచ్చుతగ్గులని నియంత్రిస్తుంది. అంటే పరోక్షంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పేగు కదలికలని నియంత్రించి మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.


పొట్ట ఉబ్బరం తగ్గిస్తుంది


గ్యాస్ట్రిక్ సమస్యలు, పొత్తి కడుపు నొప్పి, కడుపు ఉబ్బరానికి దారి తీసే తిమ్మిర్లని తగ్గించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఇది పేగుల్లోని కొన్ని ఎంజైమ్ లని సక్రమంగా పని చేసేలా చేస్తుంది. పేగులని శుభ్రం చేస్తుంది. పొట్ట ఉబ్బరం నుంచి బయట పడేలా చేస్తుంది.


కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది


వామ్ము పోషకాల్ని పూర్తిగా గ్రహించడంలో సహాయపడుతుంది. తద్వారా కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఇందులో ఉండే ఎసెన్షియల్ ఆయిల్ థైమోల్ కారణంగా జీవక్రియని పెంచేందుకు దోహదపడుతుంది. మెరుగైన జీవక్రియని ఇస్తుంది.


కొలెస్ట్రాల్ కి బై బై


ఊబకాయానికి ప్రధాన కారణమైన కొలెస్ట్రాల్ ని తగ్గించగలిగే ఔషధ గుణాలు వామ్ములో మెండుగా ఉన్నాయి. చెడు కొలెస్ట్రాల్ కారణంగా ఊబకాయం బారిన పడిపోతారు. కానీ ఈ వామ్ము వాటర్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులోకి వస్తుంది. బరువు తగ్గడంతో పాటు మధుమేహం, స్ట్రోక్, హృదయ సంబంధిత వ్యాధులు నుంచి రక్షణగా నిలుస్తుంది.


ప్రసవం తర్వాత బరువు తగ్గేందుకు


సాధారణంగా ప్రసవించిన మహిళలు తర్వాట లావుగా కనిపిస్తారు. ఒళ్ళు తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలే చేస్తారు. మీరు కూడా బరువు తగ్గించే ప్రణాళిక కోసం చూస్తున్నట్లయితే వామ్ము నీళ్ళు చక్కని పరిష్కారం. గర్భధారణ సమయంలో కూడా వీటిని తాగొచ్చు. ఎందుకంటే ఇది జీర్ణ సమస్యల్ని అధిగమిస్తుంది. అతిసారం, మలబద్దకాన్ని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. అంతే కాదు గర్భధారణ సమయంలో ఏర్పడిన అదనపు కొవ్వుని కరిగించడంలో సాయం చేస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also read: ఈ స్పెషల్ ఛాయ్ తాగారంటే తలనొప్పి చిటికెలో మటుమాయం