పొట్టకూటి కోసం కడుపు చేతబట్టుకుని వలసపోయే కార్మికులు ఎంతోమంది ఈ ప్రపంచంలో ఉన్నారు. సొంత దేశంలో అవకాశాలు లభించక, పూట గడవడమే కష్టంగా మారడంతో.. మనసు చంపుకుని మరో ప్రాంతానికో, దేశానికో వలసపోవడం సాధారణమే. ఏ పని దొరికినా చాలు.. ఆ డబ్బుతో ఒక పూట గడుస్తుందనేది పేదవాడి తపన. కూటి కోసం కోటి విద్యలని మన పెద్దవాళ్లు ఊరికే అనలేదు. కడుపు నిండాలంటే కష్టపడాలి. మనలో ఉన్న ప్రతిభకు పని చెప్పాలి. కానీ, కొన్ని దేశాల్లో ఎంత ప్రతిభ ఉన్నా.. దానికి తగ్గ ఫలితం దక్కదు. అందుకే, కష్టజీవులు వలసబాట పట్టడం పరిపాటి. ఆఫ్రికా వంటి దేశాల్లో ఇలాంటివి కోకొల్లాలు. అక్కడి ప్రజలు ఇతర దేశాలకు వలసపోయేందుకు రకరకాల మార్గాలను ఎంచుకుంటారు. హ్యూమన్ ట్రాఫికర్స్ ఏవిధంగా చెబితే అలా నడుచుకుంటారు. కారు సీట్ల లోపల స్పాంజుల్లా ఒదిగిపోయి కొందరు.. కారు ఇంజిన్ కాలిపోతున్నా.. ఆ వేడిని భరిస్తూ.. ఏదో ఒకలా సరిహద్దులు దాటేస్తే చాలు కొత్త జీవితాన్ని ప్రారంభించేయొచ్చు అనేది వారి ఆశ. కానీ.. పోలీసులు, సరిహద్దుల్లో మోహరించే సైన్యం కళ్లు గప్పి ఇతర దేశాల్లోకి ప్రవేశించడం అంత ఈజీ కాదు. ఏదో ఒకలా దొరికేస్తూనే ఉంటారు. అందుకే, కొందరు సముద్ర మార్గాలను కూడా ఎంచుకుంటారు. దురదృష్టవశాత్తు ప్రాణాలు కూడా కోల్పోతారు. పై చిత్రంలో కనిపించే ఆఫ్రికా కుర్రాళ్లు కూడా ఆ టైపే. 


ఆ ఫొటో చూడగానే ముందు మనకు నవ్వు వస్తుంది. వీరేంటి ఇలా తయారయ్యారు అనిపిస్తుంది. కానీ.. వారి కష్టాలు తెలిస్తే తప్పకుండా బాధ కలుగుతుంది. అయ్యో, పాపం అనిపిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే.. ఆఫ్రికాకు చెందిన ముగ్గురు యువకులు అరబ్ మహిళ్లా ముఖాలకు తెల్లగా మేకప్ వేసుకున్నారు. అక్కడి మహిళల్లా నిండుగా దుస్తులు ధరించి, ముఖాన్ని ముసుగుతో కవర్ చేసుకున్నారు. అల్జేరియా మీదుగా దుబాయ్‌కు వెళ్లాలనేది వారి ప్లాన్. కానీ, అల్జేరియా పోలీసులకు అనుమానం కలిగి.. వారిని తనిఖీ చేశారు. ముసుగులు తొలగించి చూస్తే.. వారి ముఖానికి సగం మేకప్ వేసి ఉంది. దీంతో పోలీసులు షాకయ్యారు. వారు ముఖం మొత్తానికి మేకప్ వేసుకోలేదు. కేవలం బయటకు కనిపించే చేతులు, కాళ్లు, ముఖానికి మాత్రమే తెల్ల రంగు మేకప్ వేసుకుని మిగతా భాగాలను దుస్తులతో కవర్ చేశారు. ఇందుకు భారీగా ఫౌండేషన్ వేసుకున్నారు. కను బొమ్మలను బ్లాక్ లైనర్‌తో దిద్దుకున్నారు. అదే వారిని పట్టించింది. వారి నడక, మేకప్ తేడాగా ఉండటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని నిజం తెలుసుకున్నారు.


సంపన్న దేశమైన దుబాయ్‌లో ఏదో ఒక పనిచేసుకుని బతకాలనే ఆశతో ఈ ప్రయత్నం చేశామని ఆ ముగ్గురు యువకులు తెలియజేశారు. కానీ, దుబాయ్ వెళ్లకుండానే వారి ప్లాన్ బెడిసి కొట్టింది. ప్రస్తుతం అల్జేరియా పోలీసుల అదుపులో ఉన్న ఆ ముగ్గురికి ఎలాంటి శిక్ష విధించలేదు. వారిని తిరిగి ఆఫ్రికాకు పంపించే అవకాశాలున్నాయని తెలిసింది. అయితే, వీరి ఫొటోలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఒకొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. కొందరు వారిని విమర్శిస్తుంటే.. మరికొందరు వారి మేకప్ స్కిల్స్‌ను పోగొడుతున్నారు. పాపం, కడుపు నింపు కోవడానికే కదా వారు ఆ ప్రయత్నం చేశారని మరికొందరు జాలి చూపుతున్నారు. మరి మీరు ఏమంటారు?