'రెండేళ్ల క్రితం ఓ వ్యక్తి ఈ ఆకు వల్ల కలిగే లాభాల గురించి నాకు చెప్పాడు. ఇది షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తుందని అన్నాడు. నా భార్యకి రక్తంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉండేవి. దీంతో నేను ఈ ఆకులను నా భార్యకు ఇచ్చాను. వీటిని తినడం ద్వారా నిజంగానే ఆమె షుగర్ లెవల్స్ కంట్రోల్ అయ్యాయి. అప్పటి నుంచి వీటిని అందరికీ ఇవ్వడం ప్రారంభించాను' అని ఓ వ్యక్తి అన్న మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అసలేంటి ఆకులు? నిజంగా డయాబెటిస్‌ను కంట్రోల్ చేసే గుణాలు వీటికి ఉన్నాయా?

  


ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ ప్రాంతానికి చెందిన గోపాల్ తివారి (72) అనే వ్యక్తి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చెబుతున్న ఆకు పేరు వెర్నోనియా అమిగ్డలినా. దీనినే ఆఫ్రికన్ బిట్టర్ లీఫ్ ప్లాంట్ (African bitter leaf tree/plant) అని కూడా అంటారు. రెండేళ్ల క్రితం ఓ వ్యక్తి ఈ ఆకు గురించిన లాభాలు తనకు చెప్పాడని గోపాల్ పేర్కొన్నారు. దీనిని వాడిన తర్వాత తన భార్య డయాబెటిస్ కంట్రోల్ అయిందని చెప్పారు.



దీంతో ఈ చెట్లను తన ఇంటి ఆవరణలో పెంచానని, ప్రస్తుతం చాలా మొక్కలు ఉన్నాయని అన్నారు. ఈ ఆకులను ప్రతిరోజూ ఉదయం యూపీలోని కత్రా ప్రాంతంలో ఉన్న ఒక గుడికి వచ్చే భక్తులకు పంచిపెడుతున్నట్లు తెలిపారు. ఈ ఆకులను తీసుకున్న భక్తులు సైతం తమకు వీటి వల్ల లబ్ధి కలిగిందని చెబుతున్నారు. వీటిని తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు రాలేదని అంటున్నారు. 


నిపుణులు ఏమంటున్నారు?
అలహాబాద్ విశ్వవిద్యాలయంలో బోటనీ విభాగం మాజీ అధిపతి, ప్రొఫెసర్ అనుపమ్ దీక్షిత్ దీనిపై వివరణ ఇచ్చారు. ఆఫ్రికన్ బిట్టర్ మొక్కకు ఔషధ గుణాలు ఉన్నాయని.. దీని బొటానికల్ నామం వెర్నోనియా అమిగ్డలినా అని చెప్పారు. ఇది బంతి పువ్వు కుటుంబానికి చెందినదని తెలిపారు. వీటిలో ఉండే కాండం, ఇతర భాగాలకు డయాబెటిస్ నిరోధక లక్షణాలు ఉన్నాయని కొన్ని పరిశోధనల్లో తేలిందని పేర్కొన్నారు. 



యాంటీ డయాబెటిక్ లక్షణాలు.. 
ఇదే అంశంపై ఆయుర్వేద నిపుణులు డాక్టర్ డి.కె. శ్రీవాస్తవ సైతం స్పందించారు. ఈ చెట్టు ఆకులను తీసుకోవడం ద్వారా డయాబెటిస్‌ను నియంత్రించవచ్చనే విషయం వాస్తవమేనని అన్నారు. ఈ మొక్కలలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయని చెప్పారు. దీని ఆకులు చేదుగా ఉంటాయని తెలిపారు. డయాబెటిస్ తీవ్రతను బట్టి ఈ ఆకులను.. బ్రేక్ ఫాస్ట్ లేదా లంచ్ ముందు తీసుకుంటే ఫలితం ఉంటుందని తెలిపారు. ఇలా 30 రోజుల పాటు తింటే రక్తంలో షుగర్ స్థాయి తగ్గుతుందని పేర్కొన్నారు.


ఈ చెట్లు అన్ని సీజన్లలోనూ బతుకుతాయని.. ముఖ్యంగా వేసవి కాలంలో వేగంగా పెరుగుతాయని శ్రీవాస్తవ చెప్పారు. అయితే ఆఫ్రికన్ బిట్టర్ ఆకులతో డయాబెటిస్ తగ్గుతుందనడానికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవని.. ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.