Adrenaline Effect on Body : అహ్మదాబాద్ విమాన ప్రమాదం(Air India Crash)లో ప్రయాణికులందరూ మరణించగా.. ఒక్క వ్యక్తి (Vishwas Kumar)మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. అతని వెనుక విమాన నుంచి మంటలు వస్తోన్న.. బిల్డింగ్ నుంచి హాహాకారాలు వినిపిస్తున్నా.. అవేమి పట్టనట్టు స్వల్ప గాయాలతో విశ్వాస్ అనే వ్యక్తి బయటకు నడుచుకుంటూ.. ఎలాంటి ఇబ్బంది పడకుండా ఫోన్ చూస్తూ వచ్చేశాడు. ఈ వీడియో కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో కొందరు అతనిపై అనుమానం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు ఇది మిరాకిల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
విశ్వాస్ కుమార్ ప్రాణాలతో బయటపడడం పక్కనపెడితే.. అతను గాయాలతో ఉన్నా.. ఏమి జరగనట్టు బయటకు క్యాజువల్‌గా రావడానికి అడ్రినలిన్ రష్నే కారణమని కొందరు చెప్తున్నారు. అసలు ఈ అడ్రినలిన్ రష్ అంటే ఏమిటి? దీనివల్ల లాభమా? నష్టమా? ఎలాంటి సమయాల్లో ట్రిగర్ అవుతుంది? వంటి అన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అడ్రినలిన్ రష్..
అడ్రినలిన్ రష్. దీనిని ఎపినెఫ్రిన్ అని కూడా అంటారు. అడ్రినలిన్ అనే హార్మోన్ రక్తప్రవాహంలోకి విడుదలైనప్పుడు అకస్మాత్తుగా ఎనర్జీ, చురుకుదనం వస్తుంది. దీనినే అడ్రినలిన్ రష్ అంటారు. ఒత్తిడి, భయం, ప్రమాద సమయంలో శరీరం వ్యతిరేకంగా పోరాడేలా చేసే ప్రతిస్పందన ఇది. ఒత్తిడితో కూడిన లేదా భయంకర పరిస్థితిని గుర్తించినప్పుడు బ్రెయిన్.. కిడ్నీలపై ఉన్న అడ్రినల్ గ్రంథులను అలెర్ట్ చేస్తుంది. ఆ సమయంలో అడ్రినలిన్ విడుదల అవుతుంది.
ప్రేరేపించే అంశాలివే..
తీవ్రమైన ప్రమాదం, భయం అంటే యాక్సిడెంట్లు, బెదిరింపులకు గురైనప్పుడు ఇలా జరగవచ్చు. లేదంటే ఎగ్జైటింగ్ పనులు చేసినప్పుడు, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువైనప్పుడు, వ్యాయామం చేసేప్పుడు కూడా ఇది విడుదల అవుతుంది. యాంగ్జైటీ లేదా పానిక్ అటాక్స్ సమయంలో, కోపం లేదా ఎమోషనల్ షాక్ అయినప్పుడు.. సడెన్‌గా పెద్ద శబ్ధం వినిపించినా.. భయపెట్టే సన్నివేశాన్ని చూసినా కూడా ఈ హార్మోన్ విడుదల అవుతుంది.
లక్షణాలు ఇవే
అడ్రినలిన్ హార్మోన్ విడుదలైతే శరీరం త్వరగా రియాక్ట్ అవుతుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, బీపీ పెరగడం, వేగంగా శ్వాస తీసుకోవడం, చెమటలు పట్టడం, సడెన్‌గా శరీరం అంతా ఎనర్జిటీక్‌గా మారడం, వణకడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇది కొన్ని నిముషాలే ఉంటుంది. పరిస్థితిని బట్టి కొన్నిసార్లు అది గంట కూడా ఉండొచ్చు.
లాభమా? నష్టమా?
అడ్రినలిన్ రష్ అనేది శరీరానికి సహాయమే చేస్తుంది. కాబట్టి లాభమే. ప్రమాదానికి త్వరగా స్పందించేలా చేస్తుంది. కండరాలకు ఆక్సిజన్, గ్లూకోజ్ సరఫరాను అందిస్తుంది. ప్రమాదాన్ని గుర్తించి.. దానిని నుంచి బయటపడేలా చేస్తుంది. అయితే ఎక్కువసార్లు అడ్రినలిన్ రష్ దీర్ఘకాలిక ఒత్తిడి, ఆందోళనకు దారితీస్తుంది. బీపీ, గుండె సమస్యలు, ఆందోళన వంటివి పెరుగుతాయి. ఆ సమయంలో మీరు వైద్యుల సూచనలు తీసుకోవచ్చు.
విమాన ప్రమాదం జరిగిన తర్వాత విశ్వాస్ అలా ఫోన్ చూసుకుంటూ నడిచి రావడానికి ఈ అడ్రినలిన్ రష్నే కారణమని కొందరు చెప్తున్నారు. ప్రమాద సమయంలో అతని శరీరం అడ్రినల్ విడుదల చేసి ఉంటుందని.. మనుగడలో భాగంగా అతనికి తెలియకుండానే ఈ మిరాకిల్ జరిగిందని చెప్తున్నారు.