పైలెట్ ఉద్యోగం అందరికీ అందే ద్రాక్ష కాదు. చాలా కొద్ది మంది మాత్రమే పైలెట్ కాగలరు. అందుకు ఎంతో ఆసక్తితో పాటూ కఠోర దీక్ష అవసరం. అలాంటి ఓ పైలెట్ విమానం నడపాల్సింది పోయి, బైక్ ను నడుపుతూ ఫుడ్ ఆర్డర్లు డెలివరీ చేస్తున్నాడు. దానికి కారణం అతని ‘గుర్తింపు’. ఈ ప్రపంచంలో స్త్రీ, పురుష లింగాలకు మాత్రమే గౌరవనీయమైన గుర్తింపు ఉంది. ఇక మూడో సెక్స్ కేటగిరీవారంటే అంటే చిన్నచూపే. ఆ గుర్తింపు వల్లే విమానం నడపాల్సిన ఆడమ్ హ్యరీ, జొమాటో బాయ్‌గా మారాడు. అతడు విమానం నడిపేందుకు వీల్లేదంటూ ‘డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్’ (డిజీసీఎ) ఆదేశాలు జారీ చేసింది. దానికి వారు చూపించిన కారణం ‘జెండర్ డిస్ఫోరియా’. దీంతో బతుకుదెరువు కోసం జొమాటోలో చేరాడు ఆడమ్. ఇతనిది కేరళ. దేశంలోనే తొలి ట్రాన్స్‌మెన్ పైలైట్. 


జెండర్ డిస్ఫోరియా అంటే...
ఒక వ్యక్తి పుట్టినప్పుడు స్త్రీగానో, పురుషుడిగానో పరిగణింపబడతాడు. కాస్త పెద్దయ్యాక తనకు నచ్చిన విధంగా పురుషుడిగానో, స్త్రీగానో లింగ మార్పిడి చేసుకునే  అవకాశం ఉంది. కొంతమంది మగవారిగా పుట్టినా, వారిలో ఆడలక్షణాల వల్ల జెండర్ మార్చుకుని స్త్రీగా మారుతారు. కానీ పుట్టినప్పుడు వారు మగవారే. ఇలా పుట్టినప్పుడు ఒక జెండర్ గుర్తింపు, పెద్దయ్యాక మరో జెండర్  గుర్తింపుతో ఉంటే ఆ సమస్యను ‘జెండర్ డిస్పోరియా’ అంటారు. ఆడమ్ హ్యారీ పుట్టినప్పుడు ఒక ఆడపిల్ల. పెరిగి పెద్దవుతున్నప్పుడు, అతడు తనలో మగవాడి లక్షణాలు, ఇష్టాలు అధికంగా ఉన్నట్టు గుర్తించాడు. దీంతో పేరుతో పాటూ జెండర్ మార్చుకున్నాడు. అబ్బాయిగా మారాడు. అదే అతడిని విమానం నడపకుండా అడ్డుకుంటోంది. 


అంతా అవమానాలే...
 చిన్నప్పుడు కూతురు సమస్యని అర్థం చేసుకోవాల్సిన తల్లిదండ్రులు ఆడమ్‌ను తీవ్రంగా కొట్టారు. ఉపాధ్యాయులు, ఇతర విద్యార్థులు స్కూల్లో అవమానించేవారు. వీటిన్నింటి మధ్యే చదువును పూర్తి చేశాడు ఆడమ్.  వాణిజ్య పైలెట్ శిక్షణ కోసం చాలా అకాడమీలకు అప్లయ్ చేశాడు. కానీ అన్నీ తిర్కరించాయి. చివరికి అమెరికాలోని జోహన్నస్ బర్గ్ లోని స్కైలార్క్ ఏవియేషన్ అకాడమీ నుంచి ప్రైవేటు పైలెట్ లైసెన్స్‌ను పొందాడు. 2019లో లింగమార్పిడి చేసుకున్న వ్యక్తల కోసం కేరళ ప్రభుత్వం సంక్షేమ నిధి నుంచి సాయం అందుకున్నాడు. శిక్షణ కోసం రాజీవ్ గాంధీ అకాడమీ ఫర్ ఏవియేషన్ టెక్నాలజీలో చేరాడు. విజయవంతంగా శిక్షణ పొందాడు. దేశంలోనే తొలి ట్రాన్స్ మ్యాన్ ట్రైనీ పైలెట్ గా మారాడు. 


ఆ థెరపీ వల్లే...
ప్రస్తుతం ఆడమ్ హార్మోన్ థెరపీ చేయించుకుంటున్నాడు. పూర్తిగా పురుషుడిగా మారిపోయేందుకే ఈ థెరపీ. ఇలాంటి థెరపీలు చేయించుకుంటున్నప్పుడు అతడికి విమానాన్ని నడిపేందుకు అనుమతి ఇవ్వడం కుదరదని చెప్పింది డిజీసీఎ. ఇలాంటి థెరపీలు రోజు వారీ జీవనాన్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉందని, నిరాశ, డిప్రెషన్ లాంటివి రావొచ్చని అభిప్రాయ పడింది డీజీసీఎ. 


ఇక ఎప్పుడూ విమానం నడపలేడా?
ఆడమ్ ఎంత కష్టపడి పైలెట్ కోర్సు పూర్తి చేసినా విమానం నడిపే వరకు అతను పూర్తి స్థాయి పైలెట్ అని చెప్పుకోలేడు. అయితే అతను భవిష్యత్తులో విమానాన్ని నడిపే అవకాశం తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అతను తీసుకుంటున్న హార్మోనల్ థెరపీ జీవితాంతాం తీసుకోవాల్సి వస్తుంది. హార్మోనల్ థెరపీ పూర్తయ్యాక మళ్లీ వైద్య పరీక్షలకు అప్లయ్ చేయమని చెప్పింది డీజీసీఏ. కానీ హార్మోనల్ థెరపీకి ఒక ముగింపు ఉండదని ఆ సంస్థకు తెలియదా? 


ఇలాంటి నిర్ణయాలు లింగ సమానత్వానికి వ్యతిరేకమని ట్రాన్స్ పర్సన్స్ వాదిస్తున్నారు. ఆడమ్ త్వరలోనే ఈ విషయంపై కోర్టుకు వెళ్లబోతున్నాడు. 



Also Read: మునక్కాయల నిల్వ పచ్చడి, ఇలా చేస్తే ఆరునెలలు తినొచ్చు


Also read: డయాబెటిక్ రోగులకు గ్రీన్ టీ మంచిదేనా? తాగడం వల్ల షుగర్ కంట్రోల్‌లో ఉంటుందా?