Gut Health Ayurveda : ఆయుర్వేదం ప్రకారం కొన్ని రకాల ఆహారాలను కలిపి తీసుకోకూడదట. దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని.. ముఖ్యంగా జీర్ణ సమస్యలు వస్తాయని చెప్తున్నారు. అయితే వీటిలో కొన్ని హిట్ ఫుడ్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఏ ఫుడ్స్​ని కలిపి తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో.. వాటిని ఎందుకు తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. 

పాలు, పండ్లు

పాలతో పాటు పండ్లను కలిపి అస్సలు తీసుకోకూడదట. పుల్లని, విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను పాలతో కలిపి తీసుకోకూదని చెప్తున్నారు. ఒకవేళ ఈ కాంబినేషన్ తీసుకుంటే శరీరంలో టాక్సిన్లు పెరుగుతాయి. అంతేకాకుండా జీర్ణ సమస్యలు పెరుగుతాయి. ఇది కడుపు ఉబ్బరాన్ని, ఎసిడిటీని పెంచుతుంది. 

అరటిపండు, పాలు

చాలామంది పాలతో పాటు అరటిపండును ఎక్కువగా తీసుకుంటారు. ఇది బాగా ఫేమస్ ఫుడ్ కాంబినేషన్ కూడా. అయితే దీనిని రెగ్యులర్​గా తీసుకుంటే మెటబాలీజం తగ్గుతుంది. దీనివల్ల బరువు కూడా పెరుగుతారు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఈ కాంబినేషన్​కి దూరంగా ఉంటే మంచిది. 

వేడినీళ్లు, తేనె

చాలామంది తమ ఉదయాన్ని గోరువెచ్చని నీరు, తేనెతో కలిపి ప్రారంభిస్తారు. అయితే వేడి వేడి నీళ్లలో తేనె కలపడం వల్ల దానిలో యాంటీఆక్సిడెంట్లు డిస్టర్బ్ అవుతాయి. ఇవి జీర్ణ సమస్యలను, బరువును పెంచుతాయి. కాబట్టి గోరువెచ్చని నీటిలో తేనెను కలుపుకోవచ్చు కానీ.. వేడి నీళ్లలో కలిపి తీసుకోకూడదు. 

నెయ్యి, తేనె

నెయ్యి, తేనెను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్లు విడుదలవుతాయి. ఇది జీర్ణ సమస్యలను పెంచి.. సహజంగా దాని ప్రాసెస్​ను తగ్గిస్తుంది. 

టీతోపాటు తింటే.. 

చాలామంది ఫుడ్ తిన్న తర్వాత టీ తాగుతారు. అయితే ఇది అస్సలు మంచి అలవాటు కాదట. ఈ కాంబినేషన్ తీసుకోవడం వల్ల తీసుకున్న ఆహారం శరీరానికి అందదు. ఐరన్, కాల్షియం వంటి వాటిని శరీరం తీసుకోవడం కష్టమవుతుంది. టీలోని కెఫిన్ జీర్ణ సమస్యలను పెంచుతుంది. 

గులాబ్ జామున్, ఐస్ క్రీమ్

చాలామంది గులాబ్ జామున్​ను ఐస్​ క్రీమ్​తో కలిపి తీసుకుంటారు. అయితే ఆయుర్వేదం ప్రకారం ఇది మంచి కాంబినేషన్ కాదట. గులాబ్ జామున్ హాట్, ఐస్​ క్రీమ్ చల్లగా ఉంటే అస్సలు తినకూడదట. ఈ రెండూ కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు పెరిగి.. కడుపులో ఇబ్బంది ఏర్పడుతుందట. 

పాలు, చేపలు

చాలామంది చేపలను పెరుగుతో తినకూడదంటారు కానీ.. ఆయుర్వేదం ప్రకారం చేపలను పాలతో కలిపి తీసుకోకూడదట. ఇది జీర్ణసమస్యలను పెంచి స్కిన్​ అలెర్జీలను పెంచుతుంది. శరీరంలో టాక్సిన్లు పెరిగేలా చేసి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. 

కాబట్టి ఈ ఫుడ్ కాంబినేషన్స్​కి వీలైనంత దూరంగా ఉండాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. దీర్ఘకాలికంగా ఈ ఫుడ్ కాంబినేషన్స్ తీసుకుంటే తీవ్రమైన ఆరోగ్య ఇబ్బందులు వచ్చే అవకాశముంది. అలాగే మీ శరీరానికి ఏ ఫుడ్స్ మంచిది కాదో తెలుసుకొని.. వాటిని ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.