World Record: గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాలన్నది ఎంతో మంది కల. ఆ కలను నిజం చేసుకునేందుకు రకరకాల విన్యాసాలు, వింత పనులు చేస్తుంటారు చాలా మంది. అలా ఓ యువకుడు చప్పట్లతో వరల్డ్ రికార్డు స్థాపించాడు. అతను నిమిషానికి ఎన్ని చప్పట్లు కొట్టాడో తెలిస్తే  ఆశ్చర్యపోతారు. ఏకంగా 1140 చప్పట్లు. అంటే సెకనుకు 19 చప్పట్లు. ఇలా చేయడం అందరి వల్ల సాధ్యంకాదు. కావాలంటే మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి. 


అతగాడి పేరు డాల్టన్ మేయర్. అతని వయసు 20 ఏళ్లు. అమెరికాలో నివసిస్తున్నాడు. అతనికి సహజంగానే చప్పట్లు వేగంగా కొట్టడం వచ్చిందట. దాని కోసం తాను ఏమీ ప్రాక్టీసు చేయలేదని చెబుతున్నాడు. ఒకసారి యూబ్యూబ్‌లో కేట్ ఫ్రెంచ్ వీడియోను చూశాడు. కేట్ అత్యంత వేగంగా చప్పట్లు కొట్టి రికార్డులెన్నో సాధించాడు.  డాల్టన్‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాలని అనిపించింది. కేట్ కన్నా ఎక్కువ కొట్టాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికి నిమిషంలో అత్యంత ఎక్కువ చప్పట్లు కొట్టిన వ్యక్తిగా బిషప్ అనే వ్యక్తి పేరు మీద గిన్నిస్ రికార్డు ఉంది. దాన్ని అధిగమించాలని అనుకున్నాడు. బిషప్ నిమిషానికి 1103 కొట్టి రికార్టుకెక్కాడు. అంటే డాల్టన్ అంతకన్నా ఎక్కువ కొట్టాలి. 



ఎలా లెక్కపెట్టారు?
సెకనుకు 19 చప్పట్లు కొట్టమంటే మామూలు విషయం కాదు, వాటిని లెక్క పెట్టడం కూడా చాలా కష్టం. ఇల్లినాయిస్‌కు చెందిన ఓ మీడియా గ్రూప్ ఫోటోగ్రఫీ పరికరాలతో డాల్టన్ చప్పట్లు కొడుతుంటే చిత్రీకరించారు. అనంతరం ఆ వీడియోను స్లో మోషన్లో వేసి చప్పట్లు లెక్క పెట్టారు. దీనికి చాలా సమయం పట్టింది. ఆ వీడియోలను గిన్నిస్ బుక్ వారు దగ్గరుండి పర్యవేక్షించారు. లెక్క కట్టుకున్నాకే డాల్టన్‌కు రికార్డును అందించారు గిన్నిస్ రికార్డు వారు.  


అలాగే మరో రికార్డును సాధించింది ఓ బాలిక. పద్నాలుగేళ్ల వయసున్న ఓ అమ్మాయి 30 సెకన్లలో 22 సాక్సులను పాదాలకు వేసి వరల్డ్ రికార్డు సాధించింది. 


గతంలో ఎక్కువ చప్పట్లు కొట్టి రికార్డు సాధించిన ఎలీ బిషప్ ఇన్ స్టా వీడియో ఇదిగో. ఇతని రికార్డునే అధిగమించాడు డాల్టన్ మేయర్






Also read: ఆ బాలీవుడ్ హీరోకు వింత ఆరోగ్య సమస్య, అధిక ఒత్తిడి వల్లేనట - ఇది ఎవరికైనా రావచ్చు