Bigg Boss Telugu 6: ఈవారం రెడ్ టీమ్ వర్సెస్ బ్లూ టీమ్ గేమ్ అయింది. రెడ్ టీమ్‌లో గీతూ, రేవంత్, శ్రీసత్య, శ్రీహాన్, ఫైమా లాంటి ముదుర్లే ఉన్నారు. ఇక బ్లూ టీమ్లో మనసుతో ఆలోచించేవారు, కాస్త సున్నితంగా ఉండే మనుషులు ఉన్నారు. దీంతో అనుకున్నట్టుగా రెడ్ టీమ్ సభ్యులు వీరిపై రెచ్చిపోయారు. కన్నింగ్ ఆటకు తెరతీశారు రెడ్ టీమ్ వాళ్లు. గీతూ కన్నింగ్ ఆటలో ఆ టీమ్ సభ్యులంతా ఏకమయ్యారు. అయితే బ్లూటీమ్ పై గెలవలేకపోయారు. డ్రా అయింది ఆట. ఆ ఆటలోనే ఎన్నో గొడవలు, తోసుకోవడాలు, తిట్టుకోవడాలు... ఇన్ని ఉన్నాయి. కొన్ని గొడవలు తిట్లు చాలా హైలైట్ అయ్యాయి. ఈసారి ఎవరికి క్లాసు పడుతుందా అని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూశారు. ఒకరిని టార్గెట్ చేయకుండా నలుగురైదుగురికి క్లాసు తీసుకున్నారు నాగార్జున.


ముందుగా గీతూ - బాలాదిత్య గొడవ గురించి మాట్లాడారు. కోపంలో గీతూ చాలా మాటలు అనేశావని అన్నారు. దానికి బాలాదిత్య కోపంతో కాదు బాధతో అన్నానని చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో బాలాదిత్యదే తప్పని తేల్చారు నాగార్జున. గీతూని కూడా సున్నితంగానే మందలించారు. ఆట బాగా ఆడావని మెచ్చుకున్నారు.


శ్రీహాన్‌కు శిక్ష
శ్రీహాన్‌ను నీ కెప్టెన్సీ ఎలా ఉంది అని అడిగారు నాగార్జున. బావుందని చెప్పాడు శ్రీహాన్. నీకు ఒక వీడియో చూపిస్తా అని చెప్పి గీతూ పడుకుంటే ఆదిరెడ్డి బాత్రూమ్ క్లీన్ చేస్తున్న వీడియో చూపించాడే. దానికి అందరూ నవ్వారు. గీతూ చేత పని చేయించనందుకు శిక్షగా వచ్చే కెప్టెన్సీ కంటెండర్ కాలేవని చెప్పారు. దీంతో శ్రీహాన్ చాలా బాధ పడ్డాడు. 


మధ్యలో ఆదిరెడ్డి, కీర్తి, రేవంత్ సేఫ్ అయినట్టు చెప్పారు నాగార్జున. ఫుడ్ గురించి ఇనయా ఇంట్లో గొడవ పెడుతున్న విషయాన్ని లేవనెత్తారు నాగార్జున. ఇంట్లో ఆహారం సరిపోవడం లేదా అని అడిగారు. మీకు కావాల్సినంత ఫుడ్ పంపిస్తున్నా ఎందుకు గొడవలు అవుతున్నాయంటూ అడిగాడు. ముఖ్యంగా ఇనయాని టార్గెట్ చేశారు. టీ రెండు సార్లు ఇచ్చినట్టు పాలు రెండు సార్లు ఇవ్వడం కుదరదని చెప్పారు నాగార్జున. అలాగే శ్రీసత్య - శ్రీహాన్ గురించి ఇనయా అన్న మాటలను కూడా లేవనెత్తారు. శ్రీసత్య ఆ విషయాన్ని నాగార్జున దగ్గర లేవనెత్తింది. ఆ విషయంలో ఇనయానే తప్పుబట్టారు నాగార్జున. కానీ ఆయన సూర్య వెళ్లిపోవడానికి ఇనయానే కారణం అని అందరూ నిందించిన విషయంపై మాట్లాడలేదు. నిజానికి ఇనయా ఒక్కతే ఇంట్లోంచి సూర్యను పంపలేదు. బిగ్ బాస్ నిర్ణయం మేరకే అన్నీ జరుగుతాయి. ఆ విషయంలో నాగార్జున ఏదో ఒకటి మాట్లాడకపోవడం మాత్రం బాగోలేదు. 


రేవంత్‌కు ఎల్లో కార్డు
రేవంత్ ఆటలో అందరినీ విసిరి కొట్టేస్తున్నాడు. ఆ విషయాన్ని నాగార్జున వీడియోతో సహా చూపించాడు. అలా చేస్తే ఇకపై రెడ్ కార్డు పడుతుందనే విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతానికి ఎల్లో కార్డు ఇస్తున్నట్టు చెప్పారు. రేవంత్ తన కోపం గురించి అందరూ మాట్లాడడంపై అసహనం వ్యక్తం చేశాడు. కానీ అతని కోపమే అతని ఆటను చెడగొడుతుందన్న విషయం ఎప్పుడు తెలుసుకుంటాడో. 


Also read: ఈ సీజన్ మొత్తానికి షాకిచ్చే ఎలిమినేషన్, ఈ వారం గీతూ అవుట్? ఓవరాక్షనే కొంపముంచిందా?