ప్రపంచం అంచుకు వెళ్లి నిల్చుని చూస్తే ఎలా ఉంటుంది? చుట్టూ నీళ్లు, మధ్యలో మీరు... అలాంటి అనుభూతిని జ్ఞాపకాల రూపంలో పదిలంగా దాచుకోవాలనుందా? అయితే ధనుష్కోడి రామసేతును సందర్శించాల్సిందే. కుటుంబంతో సరదాగా గడిపేందుకు మంచి డెస్టినేషన్ ధనుష్కోడి. తమిళనాడులోని రామేశ్వరం దీవి ఒక అంచున ఉన్న గ్రామం ఇది. ఇదో చిన్న జాలర్ల గ్రామం. ఒకప్పుడు మనదేశానికి, శ్రీలంకుకు మధ్య వారధిలా ఉండేది ధనుష్కోడి. ఈ గ్రామం రామేశ్వరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
అదే రామసేతు
పూర్వం రాముడు లంకను చేరేందుకు సేతువును (వంతెన) నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ రామసేతు ప్రారంభమైంది ధనుష్కోడి నుంచే అనే నమ్మకం ప్రజల్లో ఉంది. అదే ధనుష్కోడి నుంచి సముద్రం మధ్యలోకి కనిపించే నడవ దారే. ఒక్కోసారి అది సముద్రం నీళ్లలోని మునిగిపోతుంది. సముద్ర నీళ్లు తగ్గి వంతెన బయటకు కనిపించినప్పుడు చక్కగా దానిపై నడవచ్చు. వంతెన చివరన నిలుచుంటే చుట్టూ నీళ్లతో ప్రపంచం అంచున నిల్చున్న ఫీలింగ్ కలుగుతుంది. నిల్చుని చుట్టూ ఒక్కసారి చూస్తే మీకు ప్రపంచానికి అదే చివరి పాయింట్ అనిపిస్తుంది.
రామసేతు రాళ్లు
రామ వంతెనకు వాడిన రాళ్లు ఇప్పటికి ఆ ప్రాంతంలో ఉన్నాయని నమ్ముతారు. జాలర్ల వలల్లో చాలా సార్లు ఆ రాళ్లు పడతాయి. వాటిని పర్యాటకులను అమ్ముతుంటారు. నిజానికి ఇలా అమ్మడం నిషేధమే అయినా, అమ్మకాలు మాత్రం జరుగుతున్నాయి. ధనుష్కోడి నుంచి కేవలం 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శ్రీలంక.
దెయ్యాల గ్రామం...
ధనుష్కోడిని ఘోస్ట్ టౌన్‌గా పిలుస్తారు. దానికి కారణం అక్కడ ఎవరూ నివసించకపోవడమే. ప్రస్తుతం పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన షాపులు, కొంతమంది జాలర్లు మాత్రమే అక్కడ కనిపిస్తారు. 1964లో వచ్చిన తుఫానుకు ధనుష్కోడి గ్రామం నాశనమైపోయింది. ఎంతోమంది చనిపోయారు. దీంతో ఆ గ్రామాన్ని అందరూ విడిచివెళ్లిపోయారు. జనాల్లేక దెయ్యాల గ్రామంగా పేరు పడిపోయింది. కానీ అక్కడ ఎలాంటి దెయ్యాల కథలు ప్రచారంలో లేవు. రాముడి కాలిడిన ప్రదేశంగా ప్రసిద్ధికెక్కింది. కేవలం సముద్రం పక్కనే ఉండడం తుఫానులు విరుచుకుపడడంతోనే గ్రామం ఖాళీగా మిగిలిపోయింది.
ఎలా వెళ్లాలి?
1. ధనుష్కోడికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ రామేశ్వరం. రామేశ్వరానికి చాలా ప్రాంతాల నుంచి రైళ్లు నడుస్తున్నాయి.
2. విమానంలో వెళ్లాలనుకుంటే మధురై ఎయిర్ పోర్టు వరకు, లేదా టుటికోరిన్ ఎయిర్ పోర్టు వరకు వెళ్లచ్చు. మధురై ఎయిర్ పోర్టు నుంచి 198 కిలోమీటర్ల దూరం, టుటికోరిన్ ఎయిర్ పోర్టు నుంచి 142 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ధనుష్కోడి.
3. బస్సుల్లో వెళ్లే వారయితే రామేశ్వరం వరకు బుక్ చేసుకుని వెళ్లచ్చు. అక్కడ్నించి ధనుష్కోడి చాలా దగ్గర. స్థానికంగా చాలా ట్యాక్సీలు, బస్సులు ధనుష్కోడికి తిరుగుతుంటాయి.
Also read: ఆ బీచ్‌లో గుసగుసలు వినిపిస్తాయి, మాట్లాడేదెవరో తెలియదు, అదో మిస్టరీ