ఏదో ఒక విషయంలో మానవాళికి మేలు చేసేందుకు కొత్త ఆవిష్కరణలు జరుగుతూనే ఉంటాయి. పరిశోధనలు, అధ్యయనాలు అలుపెరగకుండా సాగుతూనే ఉంటాయి. అలా ఓ పరిశోధనలో 32 వేల నాటి పురాతన విత్తనాల నుంచి మొక్కను సృష్టించారు. ఆ మొక్క తెల్లటి పువ్వులతో అందంగా కళకళలాడ సాగింది. ఈ విత్తనాలు సైబీరియాలోని 124 అడుగుల కింద లభించాయి. పూర్తిగా మంచుతో కప్పబడిన పరిపక్వ, అపరిపక్క విత్తనాలను సేకరించారు శాస్త్రవేత్తలు. ఆ విత్తనాలు చుట్టూ ఆనాటి మమ్మోత్‌లు, బైసన్, ఖడ్గమృగాల ఎముకలు ఉన్నాయి. ఈ జీవులన్నీ ఈ భూమిపై బతికిన కాలం ఇప్పటిది కాదు, 30వేల ఏళ్ల క్రితం.
దొరికిన విత్తనాల వయసు నిర్ణయించడానికి శాస్త్రవేత్తలు రేడియో కార్బన్ డేటింగ్ ను ఉపయోగించారు. ఆ పద్ధతిలోనే ఆ విత్తనాల వయసు 32,000 ఏళ్లుగా తేలింది. 2012లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో ఫిజిక్స్ కి చెందిన రష్యా శాస్త్రవేత్తలు ఈ విత్తనాల నుండి మొక్కను పుట్టించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ మొక్క ‘సైలిన్ స్టెనోఫిల్లా’ అనే జాతికి చెందిన మొక్క. సైబీరియాలో ఉంటుంది. ఇన్నాళ్లకు ఆ విత్తనాల నుంచి మొక్క ఎదిగి పువ్వులు పూసింది. ఇది ఒక అద్భుతమైన చెప్పాలి. ఇంతకుముందు 2000 ఏళ్ల క్రితం నాటి ఒక ఖర్జూర విత్తనాన్ని పునరుత్పత్తి చేసి మొక్కగా చిగురించేలా చేశారు. ఇదే ఇప్పటివరకు పురాతన మొక్కగా రికార్డుల్లో నిలిచింది. ఇప్పుడు ఈ రికార్డును ఈ తెల్ల పూల మొక్క బద్దలు కొట్టింది. ప్రపంచంలో అతి పురాతన మొక్క ఈ తెల్ల పూల సైలిన్ స్టెనోఫిల్లా మొక్కనే.
విత్తనాల నుంచి తిరిగి పునరుజ్జీవించేలా చేయడం వల్ల ఇది పురాతన మొక్కగా మారింది. అయితే భూమిపై ఓ చెట్టు గత అయిదు వేల ఏళ్లుగా బతికే ఉంది. ఇలా ఎక్కువ కాలం బతికిన చెట్టుగా ఇది రికార్డుల కెక్కింది. కాలిఫోర్నియాలోని వైట్ మౌంటెయిన్ ప్రాంతంలో పినస్ లాంగేవా అనే చెట్టు 5062 ఏళ్లుగా జీవించి ఉన్నట్టు గుర్తించారు.
Also read: టీ బ్యాగులను కనిపెట్టిన వ్యక్తి ఇతడే - అది కూడా అనుకోకుండానే జరిగింది