ఇప్పుడతని వయసు 83 ఏళ్లు. ఇంకా ఉద్యోగం చేస్తూనే ఉన్నారు. 70 ఏళ్లుగా ఒకే సంస్థలో పనిచేస్తున్నారు. ఈ డబ్బైఏళ్లలో ఎప్పుడు అనారోగ్యం బారిన పడి సెలవు తీసుకున్న దాఖలాలు లేవు. అందుకే ఆయనిప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. పేరు బ్రియాన్ చోర్లీ. 1953లో క్లార్క్స్ షూ ఫ్యాక్టరీలో పనికి చేరారు. అప్పుడతని వయసు చాలా తక్కువ. పదిహేనేళ్ల వయసులోపే పనికి కుదిరారు. అప్పట్నించి రోజూ  పనికి వెళ్లడం మొదలుపెట్టారు. అతనిది చాలా పేదకుటుంబం. తండ్రి కష్టపడినా కూడా ఆ డబ్బు సరిపోయేది కాదు. దీంతో కొడుకు బ్రియాన్‌ను కూడా పని చేయమని ప్రోత్సహించాడు. దీంతో చాలా చిన్న వయసు నుంచే పనిచేయడం ప్రారంభించాడు బ్రియాన్. వారానికి 45 గంటలు పనిచేసినందుకు అప్పట్లో రెండు పౌండ్ల మూడు షిల్లింగులు చెల్లించేవారు.  అవి తన తల్లికి తెచ్చి ఇచ్చేవాడు బ్రియాన్. అలా చాలా చిన్న వయసు నుంచే కష్టపడడం అలవాటు అవ్వడం వల్లనేమో పని చేయకుండా ఉండలేకపోతున్నారిప్పుడు. 


1980 వరకు క్లార్క్స్ సంస్థ కోసం పనిచేస్తూనే ఉన్నాడు. ఆ ఫ్యాక్టరీని మూసివేసి కొత్తగా నిర్మించారు యజమానులు. పేరును ‘ప్రీమియం క్లార్క్స్ విలేజ్ షాపింగ్ అవుట్ లెట్’గా మార్చారు. అది ఓపెన్ అయ్యాక దానిలో పనిచేయడం ప్రారంభించారు బ్రియాన్. 70 ఏళ్ల నుంచి అదే ఉద్యోగం. తనకు తెలిసినంత వరకు ఆ సంస్థ, దుకాణమే తన ప్రపంచమని అందుకే తాను ఎప్పుడు సెలవుపెట్టాలని కోరుకోలేదని చెబుతున్నారు. తాను అనారోగ్యం బారిన పడిందని చాలా తక్కువ అని, సెలవు పెట్టేంత స్థాయిలో ఎప్పుడూ అనారోగ్యం బారిన పడలేదని తెలిపారు. బ్రియాన్ పెళ్లి, పిల్లలు, మనవలు అందరూ ఉన్నా కూడా ఆఫీసును మాత్రం వదిలేవారు కాదు. అతని భార్య ఎనిమిదేళ్ల క్రితం మరణించింది. పిల్లలు పెళ్లిళ్లు చేసుకుని ఎవరి జీవితంలో వారు స్థిరపడ్డారు. బ్రియాన్ ఒంటరిగా మిగిలిపోయారు. ‘నా భార్య కూడా చనిపోయింది. నా కోసం ఎదురు చూసే వారు ఇంటి దగ్గర ఎవరూ లేరు. అందుకే నేను ఉద్యోగం మానేయాలని అనుకోవడం లేదు. నేను పనికి వెళుతుంటే అందరూ నన్ను వింతగా చూస్తారు. నేను ఖాళీగా కుర్చీలో కూర్చుని ఉండలేను. శక్తి ఉన్నంత వరకు పనిచేస్తూనే ఉంటాను’ అని చెప్పుకొచ్చారు ఆ పెద్దాయన. అతని వయసు ఇప్పుడు 83 ఏళ్లు. 


తాను రిటైర్ అవ్వాలని కోరుకోవడం లేదని చెబుతున్నాడు బ్రియాన్. క్లార్క్స్ సంస్థ కూడా బ్రియాన్ ను ఉద్యోగం తీయదు. ఆయనకు ఓపిక ఉన్నన్నాళ్లు ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది ఆ సంస్థ. గత 70 ఏళ్లుగా ఆ వ్యక్తి ఉద్యోగం మారకుండా తమ దగ్గరే పనిచేయడం గొప్పగా భావిస్తున్నట్టు చెప్పారు సంస్థ ప్రతినిధులు. అందుకే రిటైర్ ఎప్పుడవ్వాలో అన్న నిర్ణయాన్ని ఆయనకే వదిలేశారు.  


Also read: ఒక్కరాత్రిలో బరువు పెరిగినట్టు అనిపిస్తోందా? ఇవి కారణాలు కావచ్చు


Also read: కీళ్లనొప్పులు వేధిస్తుంటే ఈ ఆహారాలు తినకండి, నొప్పులు ఎక్కువవుతాయి