'రౌడీ బాయ్స్' సినిమాతో 'దిల్' రాజు సోదరుడు శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమా విడుదలకు ముందే హీరోగా ఆశిష్ రెడ్డి రెండో సినిమా 'సెల్ఫిష్'ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో ఈ సినిమా స్టార్ట్ కానుందని సమాచారం.
'సెల్ఫిష్' సినిమాతో సుకుమార్ శిష్యుడు కాశి విశాల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గతంలో ఆయన 'రంగస్థలం' సినిమాకు దర్శకత్వ శాఖలో కూడా పని చేశారు. ఇక, 'సెల్ఫిష్' విషయానికి వస్తే... ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించి, మార్చి లేదంటే ఏప్రిల్ నెలలో సెట్స్ మీదకు వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సుకుమార్ డైలాగులు అందించడంతో పాటు 'దిల్' రాజు ప్రొడక్షన్స్‌తో కలిసి సుకుమార్ రైటింగ్స్ పతాకంపై ప్రొడ్యూస్ చేయనున్నారు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు. మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయని సమాచారం. యూత్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమా చేస్తున్నారట.
'రౌడీ బాయ్స్'లో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. సినిమా విడుదలకు ముందు హీరో హీరోయిన్స్ మధ్య లిప్ లాక్ హాట్ టాపిక్ అయ్యింది. ఆశిష్ రెడ్డి కంటే అనుపమా పరమేశ్వరన్ సీనియర్. ఈసారి ఆమెతో పోలిస్తే... కొత్త హీరోయిన్‌ను తీసుకున్నారు. 'పెళ్లి సందడి'తో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయమైన అమ్మాయి శ్రీ లీల. శ్రీకాంత్ తనయుడు రోషన్ సరసన నటించారు. 'పెళ్లి సందడి' కంటే ముందు కన్నడలో సినిమాలు చేశారు. 'పెళ్లి సందడి' తర్వాత మాస్ మహారాజ రవితేజ 'ధమాకా'లో కథానాయికగా నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఇప్పుడు 'సెల్ఫిష్'లో ఆశిష్ రెడ్డికి జంటగా ఆమె కనిపించనున్నారు.