A Cell Discovery Could Lead To A Cure For Baldness: బట్టతల. పురుషులు ఎదుర్కొనే ప్రధాన సమస్య. కొంత మంది స్త్రీలను కూడా ఈ ప్రాబ్లమ్ ఇబ్బంది పెడుతుంది. కొంత మందికి వంశపారంపర్యంగా ఈ సమస్య వస్తే, మరికొంత మందికి ఒత్తిడి, పొల్యూషన్, పోషకాహార లోపం సహా పలు కారణాలతో బట్టతల ఏర్పడుతుంది. అయితే, బట్టతలతో బాధపడుతున్న వారికి గుడ్ న్యూస్ చెప్పారు లండన్ పరిశోధకులు. బట్టతలకు కచ్చితమైన కారణాలు కనుగొనడమే కాకుండా, ఇకపై ఆ సమస్యను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు మార్గాలను అన్వేషిస్తున్నారు.
సెల్ ఆవిష్కరణతో బట్టతల నివారణ
లండన్ లోని మాంచెస్టర్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు బట్టతలకు గల కారణాలపై విసృతంగా పరిశోధన నిర్వహించారు. బయోలాజికల్ స్ట్రెస్ అనేది జుట్టు కుదుళ్లను చనిపోయేలా చేస్తుంది. ఈ కారణంగా జుట్టు రాలిపోవడంతో పాటు మళ్లీ రావడం లేదని గుర్తించారు. అంతేకాదు, బాడీలో ఇన్ఫెక్షన్ ఏర్పడినప్పుడు లేదంటే శరీరానికి సరైన పోషకాలు అందనప్పుడు జుట్టు పెరుగుదల నిలిచిపోవడంతో పాటు కుదుళ్లు దెబ్బతింటున్నట్లు తేలింది. జుట్టును బలోపేతం చేసే స్కాల్ప్ కణాలు నెమ్మదిగా బలహీనంగా మారి కుదుళ్లు కూడా పూర్తిస్థాయిలో పని చేయకుండా తయారవుతున్నాయి. అయితే, కుదుళ్ల డ్యామేజీని ముందస్తుగా గుర్తిస్తే బట్టతల రాకుండా ఆపే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు.
జుట్టు రాలిపోయే దశలో ఉన్నప్పుడు గుర్తిస్తేనే..
ఒత్తిడి అనేది జుట్టు రాలడం సహా అనేక జుట్టు సంబంధ సమస్యలకు కారణం అవుతుందని ఈ పరిశోధనలో భాగం అయిన డాక్టర్ తల్వీన్ పుర్బా వెల్లడించారు. “ జుట్టు రాలడానికి కారణాలను తెలుసుకోవడం వల్ల బట్టతల నివారణకు కొత్త ట్రీట్మెంట్ కనుగొనే అవకాశం ఉంది. అయితే, జుట్టు పూర్తిగా కోల్పోయిన వ్యక్తులలో జుట్టు పునరుత్పత్తి సాధ్యం కాదు. రాలిపోయే దశలో ఉన్నప్పుడు గుర్తిస్తే నివారించే అవకాశం ఉంటుంది. సమర్థవంతంగా నివారించేందుకు ఏం చేయాలి అనే విషయంపై ప్రస్తుతం పరిశోధనలు కొనసాగుతున్నాయి” అని వెల్లడించారు.
ఆ కణాలను ప్రేరేపిస్తే మళ్లీ జుట్టు పెరిగే అవకాశం
లండన్ లో జుట్టురాలడంతో పాటు బట్టతలతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. 50 ఏళ్లలోపు వయసు ఉన్న పురుషులలో 85 శాతం మంది, 70 ఏళ్ల వయసులో సగం మంది బట్టతల సమస్యను ఎదుర్కొంటున్నారు. కీమో థెరపీ, లూపస్, సోరియాసిస లాంటి పలు అనారోగ్య కారణాలతో చాలా మంది జుట్టును కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే మాంచెస్టర్ హెయిర్ రీసెర్చ్ గ్రూప్ జుట్టు కుదుళ్లకు సంబంధించి పరిశోధన నిర్వహించారు. అంతేకాదు, జుట్టుకుదుళ్లను బలంగా మార్చేందుకు కనుగొన్న ఔషధ ప్రభావాన్ని అధ్యయనం చేసే సమయంలో కొత్త విషయాన్ని కనుగొన్నారు. కుదుళ్ల నుంచి జుట్టు రావడం ఆగిపోవడానికి కారణం ఒత్తిడని గుర్తించారు. ఒత్తిడి కారణంగానే కుదుళ్లు వృద్ధి చెందడం ఆగిపోయినట్లు తెలుసుకున్నారు. అయితే, జుట్టు కుదుళ్ల ఆరోగ్యాన్ని పెంచే స్కాల్ప్ కణాలను ప్రేరేపించడం ద్వారా మళ్లీ జుట్టు పెరుగుదలను యథావిధిగా తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. కీమో థెరపీ లేదంటే అలోపేసియా కారణంగా జుట్టు కోల్పోయే వారికి ఈ పద్దతి ద్వారా జుట్టును మళ్లీ రప్పించే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు.
Read Also: టమోటా పండా లేదా కూరగాయనా? అది ఎందుకంత ఆరోగ్యకరం? దీనిపై శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే..