కెనడాలోని న్యూ బ్రున్‌స్విక్‌ ప్రాంతంలో అంతుచిక్కని వ్యాధి ఆరుగురి ప్రాణాలను బలితీసుకుంది. వైద్యుల అంచనాలకు సైతం అందని బ్రెయిన్ డిసీజ్.. ప్రజలను భయకంపితులను చేస్తోంది. స్థానిక మీడియా సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు 48 మంది ఈ వ్యాధితో చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధి వల్ల చాలామంది మతిమరపు, గందరగోళానికి గురవ్వుతున్నట్లు తెలిసింది. దీంతో వైద్యాధికారులు, నిపుణులు ఈ అంతుచిక్కని వ్యాధికి గల కారణాలను తెలుసుకొనే ప్రయత్నంలో ఉన్నారు. చనిపోయినవారిలో 18 నుంచి 85 ఏళ్ల వయస్సు గల బాధితులు ఉన్నట్లు సమాచారం. 


ఈ వ్యాధికి గురైన బాధితులు అలసటకు గురవ్వుతున్నట్లు తెలిసింది. ఆందోళన, మైకం, తల నొప్పి తదితర లక్షణాలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ బ్రెయిన్ డిసీజ్ సోకిన యువతి.. ఒకే టీవీ షోను పదే పదే చూస్తోంది. నువ్వు అల్రెడీ ఆ టీవీ షో చూశావు కదా అని ప్రశ్నిస్తే.. మరిచిపోయానని చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులు హాస్పిటల్‌లో చేర్పించారు. మరో బాధితుడు తన కండరాల నియంత్రణను కూడా కోల్పోయి చికిత్స పొందుతున్నాడు. ఇలా ఒక్కోక్కరిలో ఒక్కో రకమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. 
 
మెదడుకు సంబంధించిన (న్యూరోలాజికల్ సిండ్రోమ్) ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందో తెలుసుకోవడం కోసం న్యూరాలజిస్టులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. అయితే, ఇది ఎలా ఒకరి నుంచి మరొకరికి సోకుతుందనేది మాత్రం తెలియరాలేదు. సెల్ ఫోన్ టవర్ల రేడియేషన్ వల్ల వస్తోందని పలువురు అంటున్నారు. మరికొందరైతే వ్యాక్సిన్ వల్ల ఈ సమస్య ఏర్పడి ఉండవచ్చని అంటున్నారు. అయితే, ఇందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దాదాపు ఆరేళ్ల కిందటి నుంచి ఈ వ్యాధి ఉనికిలో ఉందని, ఇప్పటివరకు ప్రజలు మతి స్థిమితం కోల్పోవడం, గందరగోళం, పిచ్చిగా ప్రవర్తిచండం వంటి సమస్యలకే గురయ్యేవారని,  తాజాగా మరణాలు కూడా సంభవించడంతో ఆందోళన మరింత పెరిగిందని స్థానిక మీడియా వెల్లడించింది.  


Also Read: కూల్ డ్రింక్స్ తాగితే సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుందా?


ఇప్పటివరకు శాస్త్రవేత్తలకు సైతం ఈ వ్యాధి కారణాలు తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది జన్యు సంబంధిత సమస్య వల్ల ఏర్పడుతుందా? లేదా చేపలు తినడం వల్ల? లేదా లేడి మాంసం వల్ల వస్తుందా అనే ప్రశ్నలకు కూడా పరిశోధకుల వద్ద సమాధానం లేదు. దీనిపై పరిశోధనలు జరుపుతున్నామని, ఇప్పట్లో దీనికి గల కారణాలు ఇవేనని చెప్పడానికి తమ వద్ద ఎలాంటి ఆధారలు లేవని వైద్యాధికారులు అంటున్నారు. పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఆఫ్ కెనడా (PHAC) గతేడాది ఈ అసాధారణమైన న్యూరోలాజికల్ కేసుల గురించి హెచ్చరించింది. ఈ సమస్యతో చనిపోయిన బాధితుల శవ పరీక్షల ద్వారా ఏజెన్సీ ప్రాథమిక సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. త్వరలోనే ఈ అంతుచిక్కని వ్యాధి మిస్టరీని చేధిస్తామని పరిశోధకులు అంటున్నారు. 


Also Read: కూల్ డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వ్యక్తి మృతి.. ఇతడిలా మీరు చేయొద్దు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి