బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి శుభవార్త. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ/ UBI) 347 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ నిన్నటి (ఆగస్టు 12) నుంచి ప్రారంభం కాగా.. గడువు సెప్టెంబర్ 3వ తేదీతో ముగియనుంది. దరఖాస్తులను ఆన్‌లైన్‌ విధానంలో స్వీకరిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో తెలిపింది. ఆన్‌లైన్‌ విధానంలో ఎగ్జామ్‌, గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూల ద్వారా అర్హులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొంది.


ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ (PWD) అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించనవసరం లేదు. మిగతా వారు రూ.850 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ సహా మరిన్ని వివరాల కోసం యూబీఐ అధికారిక వైబ్‌సైట్ https://www.unionbankofindia.co.in/ ను సంప్రదించవచ్చు. 


Also Read: BSF Recruitment 2021: మీరు టెన్త్ పూర్తి చేసి ఉంటే రూ.69,100 జీతం వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయండిలా


వయో పరిమితి, విద్యార్హత..
పోస్టును బట్టి విద్యార్హత మారుతోంది. గ్రాడ్యుయేషన్‌, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌, ఎంబీఏ, సీఏ/సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ)/సీఎస్‌ ఉత్తీర్ణత సాధించి ఉండటంతో పాటు సంబంధిత రంగంలో పనిచేసిన అనుభవం ఉండాలని నోటిఫికేషన్‌లో తెలిపింది. సీనియర్ మేనేజర్ విభాగంలో దరఖాస్తు చేసుకునే వారి వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.


విభాగాల వారీగా ఖాళీలు..
అసిస్టెంట్ మేనేజర్ (ఫోరెక్స్‌) - 120, సీనియర్ మేనేజర్ (రిస్క్)- 60, మేనేజర్ (రిస్క్)- 60, మేనేజర్ (ఫోరెక్స్‌) - 50, అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్ ఆఫీసర్) - 26, మేనేజర్ (చార్టెడ్ అకౌంటెంట్) - 14, మేనేజర్ (సివిల్ ఇంజనీర్)- 7, మేనేజర్ (ఆర్కిటెక్ట్) - 7, మేనేజర్ (ఎలక్ట్రికల్ ఇంజనీర్) - 2, మేనేజర్ (ప్రింటింగ్ టెక్నాలజిస్ట్) - 1 పోస్టు ఉంది. 


దరఖాస్తు చేసుకోండిలా..



  • యూబీఐ అధికారిక వైబ్‌సైట్ https://www.unionbankofindia.co.in/ ను ఓపెన్ చేయాలి.

  • ఇందులో రిక్రూట్‌మెంట్ పేజ్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.  

  • తర్వాత Current Recruitment ఆప్షన్ క్లిక్ చేయాలి. 

  • స్పెషలిస్ట్ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్ 2021-22 అనే లింక్ ను ఓపెన్ చేయాలి. 

  • 'క్లిక్ హియర్ టు అప్లయ్ ఆన్‌లైన్' ఆప్షన్ ఎంచుకోండి. దీంతో అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. 

  • న్యూ రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేసి, అభ్యర్థులు తమ వివరాలు ఇవ్వాలి. 

  • వివరాలన్నీ ఇచ్చాక.. ఫీజు చెల్లించి, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. దీంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.


Also Read: IDBI Recruitment 2021: ఐడీబీఐలో 920 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్..