తెలంగాణలో మార్చి 5న జరిగిన అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ), మున్సిపల్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల రాత పరీక్షను రద్దు చేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. టీఎస్‌పీఎస్సీలో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌కుమార్‌తోపాటు సిస్టం అడ్మినిస్ట్రేటర్‌ రాజశేఖర్‌రెడ్డి.. అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ప్రశ్నపత్రాన్ని ఇతరులకు ఇచ్చినట్లు తేలడంతో కమిషన్‌ ఆ పరీక్షను రద్దు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు మంగళవారం (మార్చి 14) కమిషన్‌ అత్యవసరంగా సమావేశమై చైర్మన్‌ జనార్దన్‌రెడ్డితోపాటు సభ్యులు చర్చించి, అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది


రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో 837 అసిస్టెంట్ ఇంజినీరు పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన రాతపరీక్ష ప్రశ్నపత్రం లీకైందన్న సమాచారంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. మార్చి 5న జరిగిన ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 74 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 55 వేల మంది హాజరయ్యారు. తొలుత మార్చి 12న నిర్వహించాల్సిన టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్ సీర్(టీపీబీవో) పరీక్ష ప్రశ్నపత్రాలు లీకయ్యాయని భావించారు. కానీ, ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాలు లీకైనట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు కంప్యూటర్ నుంచి కాపీ చేసిన ఫోల్డర్‌లో ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాలతో పాటు భవిష్యత్తులో జరగాల్సిన పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా ఉన్నట్లు తెలిసింది. నిందితుల ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిలోని సమాచారం ఆధారంగా పలువురు వ్యక్తులను విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పీఏ ప్రవీణ్, గురుకుల ఉపాధ్యాయురాలు రేణుక, పొరుగుసేవల ఉద్యోగి రాజశేఖర్‌ రెడ్డి ఉన్నారు. 


ఇప్పటికే టీపీబీవో, వీఏఎస్ పరీక్షలు వాయిదా..
పేపరు లీకేజీ వార్తల కారణంగా ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ మార్చి 12న జరగాల్సిన టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీస్‌ (టీపీబీవో); అలాగే మార్చి 15, 16 తేదీల్లో నిర్వహించాల్సి ఉన్న వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ ఉద్యోగాలను రద్దు చేస్తున్నట్టు కమిషన్‌ ప్రకటించింది. అభ్యర్థులకు ఈ సమాచారాన్ని చేరవేసింది. కమిషన్ కార్యాలయంలో సిస్టమ్‌ను ఎవరో ఓపెన్‌ చేశారనే సమాచారం వచ్చిన వెంటనే పోలీస్‌స్టేషన్‌లో కమిషన్‌ ఫిర్యాదు చేసింది. మరుసటిరోజే జరగాల్సిన పరీక్షతోపాటు వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ ఉద్యోగాలను సైతం ముందుస్తు జాగ్రత్త చర్యలో భాగంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం రద్దు చేసిన పరీక్షలను ఏప్రిల్‌ లేదా మే నెలలో నిర్వహించాలని కమిషన్‌ భావిస్తున్నది. మంగళవారం జరిగే భేటీలో తదుపరి తేదీలను ఖరారు చేసి.. తేదీల ప్రకటనపై నిర్ణయానికి రానున్నారు.


బలహీన నెట్‌వర్కే.. వారి బలమైంది!
కంప్యూటర్ నుంచి డౌన్‌లోడ్ చేసిన ఫోల్డర్‌లో భవిష్యత్తులో జరగాల్సిన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు ఉన్నట్లు బయటపడటంతో వాటి స్థానంలో కొత్త ప్రశ్నపత్రాలను కమిషన్ సిద్ధం చేయనున్నట్లు తెలిసింది. ఇందుకు కొంత సమయం తీసుకునే అవకాశాలున్నాయి. టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలోని కంప్యూటర్ల నెట్‌వర్క్ బలహీనంగా ఉందని పోలీసు దర్యాప్తులో తేలిందని తెలిసింది. సరైన భద్రతా ఏర్పాట్లు, ప్రత్యేక సర్వర్ లేకపోవడంతో కంప్యూటర్లను నిందితులు తేలికగా హ్యాక్ చేసినట్లు వెల్లడైంది.


రాజశేఖర్‌రెడ్డి తొలగింపు.. ప్రవీణ్‌కుమార్‌ సస్పెన్షన్‌
ఇద్దరికి ఉద్యోగాలు ఇప్పించబోయి ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులు తమ జీవితాలను రిస్కుల్లో పడేసుకున్నారు. టీఎస్‌పీఎస్సీలో సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌ రాజశేఖర్‌రెడ్డిని ఉద్యోగంలో నుంచి తొలగించారు. అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌కుమార్‌ను సస్పెండ్‌ చేశారు. గురుకుల ఉపాధ్యాయురాలు రేణుక, ఆమె భర్త డీఆర్‌డీఏలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఢాక్య, కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ను రిమాండ్‌కు తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురిపై నేడో, రేపో అధికారికంగా చర్యలు తీసుకోనున్నారు.


అనుకున్నది ఒకటి లీకేజీ మరొకటి..
ఏఈ పరీక్ష మార్చి 5న పూర్తికాగా, ఈ నెల 12, 15, 16న జరగాల్సిన టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీస్‌, వెటర్నరీ అసిస్టెంట్‌ పబ్లిక్‌ పరీక్షా పత్రాలు లీకైనట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులకు సమాచారం అందింది. దీంతో టీఎస్‌పీఎస్సీ అసిస్టెంట్‌ సెక్రటరీ మార్చి 11న పోలీసులకు ఫిర్యాదుచేశారు. దర్యాప్తులో ఈ నెల 5న జరిగిన అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పరీక్ష ప్రశ్న పత్రాలు లీకైనట్లు ఆధారాలు లభించడంతో కంగుతిన్నారు. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల పనితీరు, ప్రశ్నపత్రాల లీకేజీపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ అధికారులతో పాటు ఇతర ఉద్యోగుల పాత్రపై ఆరా తీస్తున్నారు. కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌లో ప్రశ్నపత్రాలు దాచి ఉంచిన సిస్టమ్‌ యూసర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను నోట్‌బుక్‌లో ఎందుకు రాయాల్సి వచ్చింది? దాన్ని ప్రవీణ్‌ ఎలా గుర్తించాడు? చోరీ చేసినట్లు ఎవరూ ఎందుకు గుర్తించలేకపోయారు? సీసీటీవీ కెమెరాలు, కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌లో జరిగే విషయాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఎందుకు లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసిస్టెంట్‌ ఇంజినీర్స్‌ పోస్టుల పరీక్ష పేపర్‌ లీకేజీ వ్యవహారంలో బాధ్యులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో కీలక పాత్ర పోషించిన టీఎస్‌పీఎస్సీ అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌కుమార్‌ను సస్పెండ్‌ చేశారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి రాజశేఖర్‌ రెడ్డిని విధుల నుంచి తొలగించారు. వీరితోపాటు ఉపాధ్యాయురాలు, ఆమె భర్త, కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.


గ్రూప్‌-1 పేపర్‌ కూడా లీకైందా?
అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పరీక్ష ప్రశ్న పత్రాలు లీకైనట్లు తేలడంతో.. టీఎస్‌పీఎస్సీ ఇటీవల నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలో కూడా గోల్‌మాల్‌ జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్రూప్‌-1 పరీక్ష పత్రాలు లీకై ఉండొచ్చని పలువురు అభ్యర్థులు, నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ప్రభుత్వం గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలను వెల్లడించింది. అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్‌కు సన్నద్ధమవుతున్నారు. కాగా.. ప్రస్తుతం ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం టీఎస్‌పీఎస్సీని కుదిపేస్తుండడంతో గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...