తెలంగాణలో 'గ్రూప్-4' ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 3న సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 8,180 ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవానికి జనవరి 30తోనే దరఖాస్తు గడువు ముగియాల్సి ఉన్నప్పటికీ.. అభ్యర్థుల సౌలభ్యం కోసం ఫిబ్రవరి 3 వరకు పొడిగించారు. జనవరి 30న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల సంఖ్య 8,47,277కి చేరగా.. ఫిబ్రవరి 3 నాటికి దాదాపు మరో లక్ష మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జులై 1న రాతపరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. జులై 1న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ పేర్కొంది.
గ్రూప్-4లో 141 కొత్త పోస్టులు..
గ్రూప్-4లో మొత్తం ఉద్యోగాల సంఖ్య 8180కి చేరింది. ఇప్పటివరకు 8039గా ఉన్న ఖాళీల సంఖ్య మహాత్మాజ్యోతిభాపూలే బీసీ సంక్షేమ హాస్టళ్లకు మరో 141 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను జతచేశారు. దీంతో 289గా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య 430కి చేరింది. అదేవిధంగా మొత్తం గ్రూప్-4 ఉద్యోగాల సంఖ్య 8180కి చేరినట్లయింది.
గ్రూప్-4 పరీక్ష విధానం, సిలబస్ వివరాలు..
మొత్తం 300 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష (సీబీటీ) లేదా ఓంఎంఆర్ ఆన్సర్ షీట్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 (జనరల్ స్టడీస్)-150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్)-150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి.
గ్రూప్-4 పోస్టులు, నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..