తెలంగాణలో ఉద్యోగ ప్రకటనల జారీలో ఆలస్యం అవుతుండటం నిరుద్యోగులకు శాపంగా మారింది. కరోనా ప్రభావం, జోనల్ వ్యవస్థ, పోస్టుల వర్గీకరణ, ఎన్నికలు వంటి పలు కారణాలతో మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడలేదు. 2018 నుంచి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Telangana State Public Service Commission- TSPSC) నోటిఫికేషన్లు ప్రకటించలేదు. గ్రూప్ - 1, గ్రూప్ - 2, గ్రూప్ - 3, గ్రూప్ -4లతో పాటు పోలీసు శాఖలో ఉన్న ఖాళీలు, టీచర్ల ఖాళీలకు సైతం నోటిఫికేషన్ల ప్రకటన రాలేదు. ఈ ఖాళీలను భర్తీ చేస్తామని ప్రభుత్వం రెండేళ్లుగా చెబుతున్నా నేటికీ ప్రకటన వెలువడలేదు. దీంతో గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు దాటిన నిరుద్యోగులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత కోల్పోతున్నారు. 2018 నాటికే 40 ఏళ్లు దాటిన వారు 40,994 మంది ఉన్నారని టీఎస్‌పీఎస్సీ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ గణాంకాలు చెబుతున్నాయి. మరికొన్ని నెలల్లో వీరిలో ఎక్కువ మంది అర్హత కోల్పోనున్నారు. ఇక 35 నుంచి 40 ఏళ్ల వయసున్న వారు మొత్తం 1,05,325 మంది ఉన్నారు. 
కలగానే యూనివర్సిటీల్లో కొలువు..
టీఎస్‌పీఎస్సీ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 24.62 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీపడుతున్నారు. వీరంతా ఉద్యోగ ప్రకటనల కోసం ఎదురుచూస్తున్నారు. పోలీసు, యూనివర్సిటీలు వంటి వాటిలో ఉద్యోగాలు ఆశిస్తున్న వారిలో మరో 60 వేల మంది నిరుద్యోగుల కనీస వయోపరిమితి కూడా దాటుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, బోర్డుల ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లుగా ఉంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు మూడేళ్లుగా రాకపోవడంతో నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. 
త్వరలో 20 వేల పోస్టుల భర్తీ..
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ప్రభావం కాస్త తగ్గింది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలతో కొత్త జోన్ల ఏర్పాటుపై ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. దీంతో నియామక ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. తెలంగాణలో త్వరలో 20 వేల పోలీసు నియమకాలను భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ఇటీవల ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ మాత్రం వెలువడలేదు. పోలీసు విభాగంలో గరిష్ట వయోపరిమితి కానిస్టేబుల్ పోస్టులకు 22 ఏళ్లు, ఎస్సై పోస్టులకు 25 ఏళ్లుగా ఉంది. దీంతో ఇప్పటికే 25 ఏళ్లు దాటిన వారికి పోలీసు ఉద్యోగం రావడం కల్లగానే మిగిలిపోయింది.

  
నిరుద్యోగుల ఆందోళనలు.. 
రాష్ట్రంలో వెంటనే ఉద్యోగాల భర్తీ చేపట్టాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలనే డిమాండ్‌తో బీజేవైఎం కార్యకర్తలు, పలు విద్యార్థి సంఘాల నేతలు, నిరుద్యోగులు టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఆందోళనలు నిర్వహించారు. ఇదిలా ఉండగా, సుదీర్ఘ నిరీక్షణ అనంతరం టీఎస్‌పీఎస్సీకి చైర్మన్, సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ గా డా. బి.జనార్దన్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. 




ఉద్యోగాలు తక్కువ ఫీజులు ఎక్కువ ..
టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసినప్పుడు దరఖాస్తు ఫీజు వసూలు చేస్తుంది. గత ఆరేళ్లలో దరఖాస్తుల ఫీజుల రూపంలో ఏకంగా రూ.84 కోట్ల ఆదాయం వచ్చిందని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త గంగాధర్ కిషోర్ దరఖాస్తు ఫీజుల గురించి టీఎస్‌పీఎస్సీకి ఆర్టీఐ (సమాచార హక్కు చట్టం) ద్వారా దరఖాస్తు చేసుకోగా.. ఈ మేరకు సమాధానం ఇచ్చింది. దరఖాస్తుల రూపంలో వసూలైన రూ.84 కోట్లలో 72 కోట్ల 45 లక్షల రూపాయలను సిబ్బంది జీతాలకు వినియోగించినట్లు పేర్కొంది. దీంతో ఉద్యోగాలు ఇచ్చేది తక్కువ ఫీజులు వసూలు చేసేది ఎక్కువ అన్నట్లు టీఎస్‌పీఎస్సీ తీరు ఉందని నిరుద్యోగులు వాపోతున్నారు.