➥ జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహణ
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసినట్లు ప్రకటించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌తోపాటు డీఏవో, ఏఈఈ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. రద్దు చేసిన గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను ఈ ఏడాది జూన్ 11న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇటీవల అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పేపర్ లీకేజీ కారణంగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నివేదిక ఆధారంగా ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్ 16న గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించారు. ఈ ఏడాది జనవరి 22న ఏఈఈ, ఫిబ్రవరి 26న డీఏవో పరీక్షలను నిర్వహించారు. ఇవికాకుండా త్వరలో నిర్వహించనున్న మరిన్ని పరీక్షలను కూడా వాయిదా వేసే యోచనలో టీఎస్‌పీఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో 80,039 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఆ దిశగా నియామక సంస్థలు శరవేగంగా పనిచేస్తున్నాయి. టీఎస్‌పీఎస్సీ ఇప్పటి వరకు 17,136 ఉద్యోగాల భర్తీకి 26 నోటిఫికేషన్లు ఇచ్చింది. అందులో ఇప్పటికే ఏడు నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు పూర్తయ్యాయి. మార్చి 5న అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష జరుగగా, ప్రశ్నపత్రం లీకేజీ ఘటనతో ఆ పరీక్షను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మార్చి 12న జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ (టీపీబీవో); మార్చి 15, 16 తేదీల్లో నిర్వహించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలను కూడా వాయిదా వేసినట్టు ప్రకటించింది. ఏప్రిల్ 4 నుంచి జరగాల్సిన పరీక్షలన్నీ యథావిధిగా షెడ్యూల్ ప్రకారమే నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది..
జరగబోయే పరీక్షలు అన్నింటికీ కొత్త ప్రశ్నపత్రాలు..
ఇకపై జరుగబోయే పోటీ పరీక్షలకు కొత్త ప్రశ్నపత్రాలు రూపొందించాలని టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఏప్రిల్ 4న నిర్వహించే హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష మొదలుకొని మిగిలిన అన్ని పరీక్షలకు కొత్తగా మళ్లీ ప్రశ్నపత్రాలు సిద్ధం చేయాలని భావిస్తున్నది. టీఎస్‌పీఎస్సీ నిర్వహించబోయే పరీక్షల కోసం ఇప్పటికే కొన్ని ప్రశ్నపత్రాలు సిద్ధం చేయగా, మరికొన్ని ప్రశ్నల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు వాటన్నింటినీ పక్కన పెట్టేయాలని కమిషన్ నిర్ణయించింది.
ఏప్రిల్ 4 నుంచి షెడ్యూలులో ఉన్న పరీక్షలు..
➥ ఏప్రిల్ 4న హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష
➥ ఏప్రిల్ 23న అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్(ఏఎంవీఐ) పరీక్ష
➥ ఏప్రిల్ 25న అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్ష
➥ ఏప్రిల్ 26, 27 తేదీల్లో గెజిటెడ్ ఆఫీసర్ (గ్రౌండ్ వాటర్) పరీక్షలు
➥ మే 7న డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పరీక్ష
➥ మే 13న పాలిటెక్నిక్ లెక్చరర్ పరీక్ష
➥ మే 15, 16 తేదీల్లో నాన్ గజిటెడ్ ఆఫీసర్ (గ్రౌండ్ వాటర్) పరీక్షలు
➥ మే 17న ఫిజికల్ డైరెక్టర్స్ పరీక్ష
➥ జూలై 1న గ్రూప్ -4,
➥ ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలతోపాటు ఇతర పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది.
Also Read: ప్రవీణ్ పెన్ డ్రైవ్‌లో మరిన్ని ప్రశ్నపత్రాలు, తొమ్మిది పరీక్షలు రీషెడ్యూల్?
Also Read: షెడ్యూలు ప్రకారమే 'గ్రూప్-1' మెయిన్స్ పరీక్షలు: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్
Also Read: అసిస్టెంట్ ఇంజినీర్ ఎగ్జామ్ రద్దుచేసిన టీఎస్‌పీఎస్సీ, త్వరలోనే కొత్త తేదీ వెల్లడి!