IND vs AUS, Anand Mahindra:
టీమ్‌ఇండియా క్రికెటర్లకే కాదు అభిమానులకూ చాలా సెంటిమెంట్లు ఉంటాయి! తాను నిలబడితేనే ఇండియా మ్యాచ్ గెలుస్తుందని చాలా మంది ఫీలవుతుంటారు. మ్యాచ్ మధ్యలో ఛాయ్ తాగడం వల్లే వికెట్లు పడ్డాయని మరికొందరు బాధపడుతుంటారు. తాను మ్యాచ్ చూస్తే టీమ్‌ఇండియా ఎప్పుడూ గెలవదని, అందుకే చూడనని చెప్పడం మనం వింటూనే ఉంటాం! ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా సైతం ఇలాగే ఫీలవుతున్నారేమో!
ఆస్ట్రేలియా నిర్దేశించిన తక్కువ టార్గెట్‌ను టీమ్‌ఇండియా ఈజీగా ఛేదిస్తుందని ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) భావించారు. సిక్సర్లు, బౌండరీలు బాదేస్తుంటే ఎంజాయ్ చేయాలని అనుకున్నారు. టీమ్‌ఇండియా ఆటగాళ్లను ఎంకరేజ్ చేయాలని మైదానానికి వచ్చారు. అయితే ఛేదనలో 16 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకోవడంతో ఆయన ఓ ట్వీట్ చేశారు.
'ఈ రోజు భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ ప్రత్యక్షంగా చూడాలని నిర్ణయించుకున్నాను. టీమ్‌ఇండియా ఇన్నింగ్స్ మొదలవ్వగానే స్టేడియానికి వచ్చాను. సునాయాసంగా విజయం సాధిస్తుంటే ఉల్లాస పరచాలని అనుకున్నా. ఇప్పటికేతే నమ్మకం పోలేదు కానీ నేను వచ్చినందుకే 3 వికెట్లు పడ్డాయేమో! వెంటవెంటనే వికెట్లు పడ్డానికి నేను కారణం కాబట్టి వెళ్లిపోతే బాగుండనిపిస్తోంది' అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
ఆయన ట్వీట్‌కు కొందరు ఫన్నీగా రిప్లై ఇచ్చారు. 'ఒక గొప్ప నాయకుడిగా ఎలాంటి ఫలితం వచ్చినా మీరు అంగీకరిస్తారని నేను అనుకుంటున్నా. సేల్స్ తగ్గిపోతే మీరు ఆఫీస్ వదిలి వెళ్లిపోతారా? ఏదేమైనా సరే ఒక కీలక వ్యక్తిగా మీరు అక్కడే ఉండాలి' అని ఒకరు బదులిచ్చారు. 'ఇప్పటికే నష్టం జరిగిపోయింది. అయినా మీరు గేమ్ ఎంజాయ్ చేయొచ్చు' అని మరొకరు ట్వీట్ చేశారు.
'ఈ మ్యాచులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌కు మహింద్రా థార్ ఇస్తానని ప్రకటించండి. ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడండి. ప్రశాంతంగా ఉండి శార్దూల్ ఠాకూర్, జడేజాను నమ్మండి. ఒకవేళ గెలిపించకపోతే ఆ థార్‌ను నాకివ్వండి. ఏదేమైనా టీమ్‌ఇండియా మ్యాచ్ గెలుస్తుందని నా నమ్మకం. ఎందుకంటే మీరు అక్కడే ఉన్నారు కదా' అని ఒక యూజర్ ట్వీట్ చేశారు.