తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ల పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పదుల సంఖ్యలో నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తామంటూ మాయమాటలు చెబుతున్న దళారుల నుంచి నిరుద్యోగులు, ఉద్యోగార్థులు అప్రమత్తంగా ఉండాలని టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులకు సూచించింది. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. గతంలో కొందరు ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తయిన పోస్టులకు మెరిట్ లిస్టుల పేరిట డబ్బులు వసూలు చేసినట్లు కమిషన్‌కు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ నియామక నిబంధనల ప్రకారం మెరిట్ లిస్టు విధానం లేదని కమిషన్ తెలిపింది. మోసకారులు, దళారీల నుంచి అప్రమత్తంగా ఉండాలని, వారిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించింది. ఈ మేరకు అభ్యర్థులకు అవగాహన కల్పిస్తూ టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ జనవరి 7న అధికారిక ప్రకటన విడుదల చేశారు. 


కమిషన్ ఎట్టి పరిస్థితుల్లో నియామక పత్రాన్ని అభ్యర్థికి వ్యక్తిగతంగా పంపించదు. ఎంపికైన అభ్యర్థుల నియామకాల కోసం జాబితాను సంబంధిత విభాగాలకు పంపిస్తుంది. మధ్యవర్తులు, దళారులకు డబ్బులు చెల్లించడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేరు. కొందరు దళారులు తప్పుడు నియామక పత్రాలు, సమాచారం, ఈ-మెయిల్స్‌తో పాటు తప్పుడు వెబ్‌సైట్లు సృష్టిస్తున్నారు. స్పష్టమైన సమాచారం కోసం టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ను చూడాలని కమిషన్ సెక్రటరీ కోరారు. 


కోర్టు చెప్పినా.. విజ్ఞప్తులు..
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి OMR పద్ధతిలో నిర్వహిస్తున్న రాతపరీక్షల్లో వ్యక్తిగత వివరాల నమోదులో గడుల బబ్లింగ్‌లో తప్పులు చేస్తూనే ఉన్నారు. బబ్లింగ్ తప్పులు చేసిన వారిని పరిగణనలోకి తీసుకోవద్దని ఇప్పటికే న్యాయస్థానం తెలిపింది. అయినప్పటికీ గ్రూప్‌-1తో పాటు ఇతర పరీక్షల్లోనూ ఈ తప్పులు చేశామని, OMR పత్రాల మూల్యాంకనానికి అనుమతి ఇవ్వాలని అభ్యర్థులు కమిషన్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. 


ఈ ఏడాది 26 నోటిఫికేషన్లు.. మొత్తం 18,263 పోస్టులు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఏడాది జారీ చేసిన 26 నోటిఫికేషన్లల్లో 18,263 పోస్టుల భర్తీకి ప్రకటించింది. వాటిలో ప్రధానంగా గ్రూప్-1లో 503 పోస్టులు, గ్రూప్-2లో 783, గ్రూప్-3లో 1365, గ్రూప్-4లో 8039 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు ఇంజినీరింగ్ విభాగంలో ఏఈఈ 1540 పోస్టులు, మున్సిపల్ ఏఈ, జూనియర్ టెక్నికల్ అధికారులు 837 పోస్టులు, ఇంటర్మీడియెట్ జూనియర్ అధ్యాపకులు 1392 పోస్టులు, పాలిటెక్నిక్ అధ్యాపకులు 247 పోస్టులు, పుడ్ సేఫ్టీ అధికారులు 24. అటవీ కళాశాల ప్రొఫెసర్లు 27, సీడీపీవో 23. ఐసీడీఎస్-గ్రేడ్-1 సూపర్‌వైజర్లు 181. డిఏఓ (వర్క్) గ్రేడ్-2లో 53 పోస్టులు, ఎంఎయూడీ టౌన్‌ప్లానింగ్‌లో 175. భూగర్భ జలశాఖలో గెజిటెడ్ ఉద్యోగాలు 32 పోస్టులు, నాన్ గెజిటెడ్ పోస్టులు 25, డగ్స్ ఇన్స్‌పెక్టర్ 18 పోస్టులు, పశు సంవర్థక శాఖలో విఎఎస్ 185 పోస్టులు, ఉద్యానవన శాఖలో 22 పోస్టులు, గ్రేడ్ 2 హస్టల్ వెల్పేర్ అధికారులు 581 పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 128, వ్యవసాయ శాఖ అధికారులు 148 పోస్టులు ఉన్నాయి.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...