China Travel Curbs:
క్వారంటైన్ అవసరం లేదు..
చైనాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఆ దేశం కఠిన ఆంక్షలు విధించాల్సింది పోయి...క్రమంగా వాటిని సడలిస్తూ వస్తోంది. విదేశీ ప్రయాణికుల కారణంగా ఒక్కో దేశంలో వైరస్ వ్యాప్తి చెందుతూ ఉంది. అందుకే అన్ని దేశాలూ అప్రమత్తమై విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి. చైనా మాత్రం అందుకు భిన్నంగా ఆంక్షలన్నింటినీ తొలగించింది. జనవరి 8వ తేదీ నుంచి వీటిని ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ప్రయాణికులు ఎవరు చైనా వచ్చినా..ఇకపై క్వారంటైన్‌లో ఉండాల్సిన పని లేదు. నేరుగా వెళ్లిపోయే వెసులుబాటు కల్పించింది. ప్రపంచవ్యాప్తంగా చైనా పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ఆ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సంచలనమవుతోంది. అటు మిగతా దేశాలు మాత్రం చైనా నుంచి వచ్చే వాళ్లు కచ్చితంగా కొవిడ్ నెగటివ్ రిపోర్ట్ చూపించాల్సిందేనని నిబంధన విధిస్తున్నాయి. నెదర్లాండ్స్, పోర్చుగల్ కూడా ఈ దేశాల జాబితాలో చేరిపోయాయి. చైనాలో విదేశీ ప్రయాణికులపై దాదాపు మూడేళ్లుగా ఆంక్షలు విధిస్తున్నారు. జీరో కొవిడ్ పాలసీలో భాగంగా...తప్పనిసరిగా క్వారంటైన్ చేశారు. కానీ...ఇప్పుడు ఆ రూల్‌ని పక్కన పెట్టేసి అందరికీ వెల్‌కమ్ చెబుతోంది చైనా.
గత నెల జీరో కొవిడ్ పాలసీని ఎత్తేసినప్పటి నుంచి కేసులు దారుణంగా పెరుగుతూ వస్తున్నాయి. ఆసుపత్రుల్లో బెడ్స్ సరిపోవడం లేదు. రోజుల పాటు వెయిట్ చేస్తే తప్ప ఆసుత్రిలో చికిత్స అందని దుస్థితి. ఇక కొవిడ్‌తో మృతి చెందిన వారి అంత్యక్రియలు చేయాలన్నా రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. కొవిడ్ మందులకూ కొరత ఏర్పడింది. కొందరు మెడికల్‌షాప్ వాళ్లతో ముందుగానే మాట్లాడుకుని ఒకేసారి పెద్దమొత్తంలో మందులు కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా...మిగతా వాళ్లకు అందక ఇబ్బందులు పడుతున్నారు. అయితే...చైనా మరో వ్యాక్సిన్‌ను సిద్ధం చేస్తోంది. mRNA టీకా టెస్టింగ్ దశలో ఉంది. బూస్టర్ డోస్ కింద ఈ టీకాను అందించనున్నారు. CS-2034 వ్యాక్సిన్ ప్రత్యేకించి ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్‌ను అంతం చేసేందుకేనని చైనా చెబుతోంది. ప్రస్తుతం అక్కడ ఈ వేరియంట్స్‌తోనే కేసులు అధికంగా నమోదవుతున్నాయి.
ఆంక్షల సడలింపు..
కొవిడ్ స్థాయిని క్లాస్ 'ఎ' ఇన్‌ఫెక్షన్ల నుంచి క్లాస్ 'బి' కి తగ్గిస్తున్నట్లు చైనా జాతీయ హెల్త్ కమిషన్ ప్రకటించింది. తద్వారా కొవిడ్ రోగులు, వారితో సన్నిహితంగా మెలిగిన వారికి తప్పనిసరి క్వారంటైన్ సహా కేసులు నమోదయ్యే ప్రాంతాల్లో లాక్ డౌన్ అవసరం లేకుండా పోయింది.
అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు సడలించడంతో చైనీయులు విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీని వల్ల ఇతర దేశాలకు కూడా చైనాలో ఉన్న కొత్త వేరియంట్లు ప్రబలే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: Viral News: ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ అధికారులకు షాక్, మహిళ క్యారీబ్యాగ్‌లో కనిపించిన స్నేక్