తమిళ స్టార్ హీరో విజయ్ తాజాగా నటించిన సినిమా ‘వారిసు’. ఈ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తెలుగులో ఈ చిత్రాన్ని ‘వారసుడు’ పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీకు ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉంది. ఏకకాలంలో తమిళంతో పాటు తెలుగు లోనూ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు దర్శకనిర్మాతలు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని జనవరి 11న తెలుగు రాష్ట్రాల్లో భారీగా సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. అయితే గత రెండు రోజులుగా ఈ సినిమా విడుదల తేదీ విషయంలో గందరగోళం నెలకొంది. తెలుగు వెర్షన్ లో విడుదల వాయిదా పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. 


తెలుగు రాష్ట్రాల్లో దళపతి విజయ్ కు మంచి పాపులారిటి పెరుగుతోంది. ఆయన సినిమాలు తెలుగులో కూడా విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి. అందుకే విజయ్‌కు తెలుగు మార్కెట్ లో ఉన్న పాపులారిటీతోనే ‘వారిసు’ చిత్రాన్ని ఏకకాలంలో రెండు భాషల్లో విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్ అనుమతుల విషయంలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ముందుగా ప్రకటించిన తేదీకి సినిమా విడుదల కాకపోచ్చనే వార్తలు వస్తున్నాయి. అందుకే మేకర్స్ మూవీ రిలీజ్ డేట్ ను మారుస్తారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడం, విడుదల తేదీ దగ్గరపడిపోవడం ఇవన్నీ మూవీ రిలీజ్ పై ప్రభావం చూపుతున్నాయి.


అయితే దిల్ రాజు కాంపౌండ్ నుంచి మాత్రం మరో విధంగా వార్తలు బయటకు వస్తున్నాయి. ‘వారసుడు’ సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పులు లేవని, అనుకున్న సమమయానికి తెలుగు రాష్ట్రల్లో విడుదల చేస్తామని దిల్ రాజు సన్నిహితులు బల్లగుద్ది చెబుతున్నారట. రిలీజ్ కి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అనుకున్న సమయానికి రిలీజ్ కష్టమే అంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదనే వార్తలు వస్తున్నాయి. ఇక సినిమా సక్సెస్ టాక్ వస్తేనే దిల్ రాజు సేఫ్ జోన్ లో ఉంటాడు. లేదంటే చాలా కష్టమే అంటున్నారు మూవీ క్రిటిక్స్.


సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోతే తెలుగు ప్రేక్షకుల మాట అటుంచితే తమిళ ప్రేక్షకులు మాత్రం రచ్చ రచ్చ చేయడం గ్యారెంటీ అంటున్నారు. మూవీ విడుదలపై చిత్ర బృందం వీలైనంత త్వరగా అధికారిక ప్రకటన ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే తెలుగులో ‘వారసుడు’ ట్రైలర్ పై కాస్త నెగిటివ్ టాక్ కూడా వచ్చింది. మరి దిల్ రాజు వీటన్నిటినీ ఎలా మ్యానేజ్ చేస్తాడో చూడాలి. ఈ సినిమా తో పాటు తమిళ నటుడు అజిత్ నటిస్తోన్న సినిమా ‘తునివు’ తెలుగులో ‘తెగింపు’ పేరుతో విడుదల కాబోతోంది. అలాగే చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య ‘వీర సింహారెడ్డి’ సినిమాలు కూడా సంక్రాంతి బరిలో దిగుతున్నాయి. 



Read Also: ఒక్కో కుటుంబంలో పది మంది హీరోలున్నారు - టాలీవుడ్‌పై అడవి శేష్ వివాదాస్పద వ్యాఖ్యలు