తెలంగాణలో జూన్‌ 1న నిర్వహించనున్న 'గ్రూప్‌-4' పరీక్షకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. భారీసంఖ్యలో అభ్యర్థులు హాజరుకానున్న నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9.51 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. వీరికోసం 2878 పరీక్ష కేంద్రాల్లో  టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 పరీక్ష నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో గ్రూప్-4 పరీక్ష రాసే అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కొన్ని కీలక సూచనలు చేసింది. 


గ్రూప్‌-4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేయనున్నారు. అంటే ఉదయం జరిగే పేపర్‌-1కు 9.45 గంటలు, మధ్యాహ్నం జరిగే పేపర్‌-2కు 2.15 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు. ఉదయం జరిగే పేపర్‌ 1కు ఉదయం 8 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం జరిగే పేపర్‌-2కు 1 గంట నుంచి అభ్యర్థులను అనుమతిస్తారు. పేపర్‌ 1 జనరల్‌ స్టడీస్‌ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది. పేపర్‌ 2 (సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌) మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.


అభ్యర్థుల వివరాలు, ఫొటోతో కూడిన పర్సనలైజ్డ్‌ ఓఎంఆర్‌ షీట్‌ను టీఎస్‌ఎపీఎస్సీ ఉపసంహరించుకొన్నదంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కమిషన్‌ అధికారులు తెలిపారు. మొదటి నుంచి తాము పర్సనలైజ్డ్‌ షీట్లను వినియోగించడం లేదని స్పష్టంచేశారు. యూపీఎస్సీ వంటి జాతీయ స్థాయి సంస్థలు కూడా సాధారణ ఓఎంఆర్‌ షీట్లనే వినియోగిస్తాయని వెల్లడించారు. వీటిపై హాల్‌టికెట్‌ నంబర్‌, సెంటర్‌ పేరు, అభ్యర్థుల ఫొటోలు ఉండవని తెలిపారు.


గ్రూప్-4 హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


గ్రూప్-4 అభ్యర్థులకు ముఖ్య సూచనలు..


➥గ్రూప్‌ 4 పరీక్ష ప్రారంభం కావడానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసివేస్తారు. అందువల్ల నిర్ణీత సమయానికి ముందే అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.


➥ అభ్యర్థులు పరీక్ష కేంద్రంలో ప్రవేశించే ముందు భద్రతా సిబ్బందికి, పరీక్ష గదిలోకి చేరుకున్నాక ఇన్విజిలేటర్‌కు ఫొటో గుర్తింపుకార్డు చూపించాలి. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.


➥ ఎలక్ట్రానిక్‌ పరికరాలు, రిమోట్‌తో కూడిన కారు తాళాలు, విలువైన, నిషేధిత వస్తువులు తీసుకెళ్లొద్దు. అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలి.. షూ వేసుకొని వెళ్లొద్దు.


➥ అభ్యర్థికాకుండా వేరే వ్యక్తులు హాజరైనట్లు గుర్తిస్తే పోలీసు కేసు నమోదు చేయడంతో పాటు ఆ అభ్యర్థిని పరీక్షలకు అనర్హుడిగా ప్రకటిస్తారు.


➥ ఈ పరీక్షకు భారీగా అభ్యర్థులు హాజరు కానుండటంతో ఈసారి వేలిముద్రను తప్పనిసరి చేశారు. నామినల్‌ రోల్‌లో సంతకం తరువాత ఎడమచేతి బొటన వేలిముద్ర కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. 


➥ పేపర్‌-1 (జనరల్‌ స్టడీస్‌) ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, పేపర్‌-2 (సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌) మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అందువల్ల పేపర్‌-1కు ఉదయం 8 గంటల నుంచి, పేపర్‌-2కు మధ్యాహ్నం ఒంటి గంట నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా సకాలంలో చేరుకోండి.


➥ ప్రతి సెషన్‌ పరీక్ష ముగిశాక ఓఎంఆర్‌ షీట్‌ను ఇన్విజిలేటర్‌కు అందజేసి వేలిముద్ర వేయాలి. అరగంటకోసారి అభ్యర్థులకు సమయాన్ని గుర్తుచేస్తూ బెల్‌ మోగిస్తారు. పరీక్ష ముగియడానికి 5 నిమిషాల ముందు బెల్‌ మోగిస్తారు.


➥ అభ్యర్థులు ప్రశ్నపత్రంపై సమాధానాలను మార్క్‌ చేయకూడదు.  గ్రూప్‌-4 OMR పత్రంలో హాల్‌టికెట్‌, ప్రశ్నపత్రం నంబరు, పరీక్ష కేంద్రం కోడ్‌, అభ్యర్థి పేరుతో పాటు సంతకం చేయాలి. 


➥ ఓఎంఆర్‌ పత్రంలో బ్లూ/బ్లాక్‌ పెన్‌తో పేరు, కేంద్రం కోడ్‌, హాల్‌టికెట్‌, ప్రశ్నపత్రం నంబరు రాయాలి.


➥ హాల్‌టికెట్‌, ప్రశ్నపత్రం నంబరు సరిగా రాయకున్నా, బ్లూ/ బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్‌కాకుండా ఇంక్‌పెన్‌, జెల్‌పెన్‌, పెన్సిల్‌ ఉపయోగించినా ఓఎంఆర్‌ పత్రం చెల్లుబాటు కానిదిగా గుర్తిస్తారు. 


గ్రూప్‌-4కు తనిఖీలు ఇలా..


1)గేటు దగ్గర, పరీక్ష కేంద్రంలో హాల్‌టికెట్‌ను పరిశీలిస్తారు.


2)రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు(ఫొటో తప్పనిసరి)


3)పరీక్ష కేంద్రంలో నామినల్‌ రోల్‌లోని పేరును పరిశీలిస్తారు.


4)నామినల్‌ రోల్‌, ప్రభుత్వ ఐడీలోని ఫొటోను వెరిఫై చేస్తారు.


5)అభ్యర్థి సంతకాన్ని సరిపోలుస్తారు.


6)చివరిగా.. అభ్యర్థి వేలిముద్రలను స్వీకరిస్తారు.


ప్రశ్నల జంబ్లింగ్‌తో మాస్‌ కాపీయింగ్‌కు చెక్‌..
టీఎస్‌పీఎస్సీ పోటీ పరీక్షల నిర్వహణలో ఈసారి ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టింది. అందులో కీలకమైన వాటిలో ప్రశ్నల జంబ్లింగ్‌ విధానం ఒకటి. గతంలో ఏ, బీ, సీ, డీ సిరీస్‌ల పేరుతో నాలుగు ప్రశ్నపత్రాలు అభ్యర్థులకు వరుస క్రమంలో ఇచ్చేవారు. కానీ ఈసారి మాత్రం ఎక్కువ సిరీస్‌లలో వచ్చేలా ప్రశ్నపత్రాలను సిద్ధం చేశారు. ఆ ప్రశ్నలను కంప్యూటర్‌లో జంబ్లింగ్‌ చేశారు. ఎక్కువ సిరీస్‌లలో ప్రశ్నపత్రాలను ముద్రించారు. దీనివల్ల మాస్‌ కాపీయింగ్‌కు పూర్తిగా చెక్‌ పెట్టొచ్చు. అదేవిధంగా, బబ్లింగ్‌ చేసేటప్పుడు ప్రతిఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీకు కేటాయించిన నంబర్‌ను ఓఎంఆర్‌ షీటులో సరిగా బబ్లింగ్‌ చేయకపోయినా, లేదా అభ్యర్థి, ఇన్విజిలేటర్‌ సంతకాలు లేకపోయినా అతని పేపర్‌ను మూల్యాంకనం చేయరు.


పరీక్ష విధానం, సిలబస్ వివరాలు..
మొత్తం 300 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష (సీబీటీ) లేదా ఓంఎంఆర్ ఆన్సర్ షీట్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 (జనరల్ స్టడీస్)-150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్)-150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి. 



ALSO READ:


ఏపీ వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో 331 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు, వివరాలు ఇలా!
ఏపీ వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 331 సెషలిస్ట్‌ డాక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. శాశ్వత, ఒప్పందం విధానంలో గిరిజన, గ్రామీణ ఆస్పత్రుల్లో ఈ నియామకాలు చేపట్టనున్నారు. మొత్తం 14 స్పెషాలిటీ విభాగాల్లో నియామకానికి జులై 5, 7, 10 తేదీల్లో వాకిన్ నిర్వహిస్తారు. అర్హులైన వైద్యులు విజయవాడ, గొల్లపూడిలోని ఏపీవీవీపీ కమిషన్ కార్యాలయంలో హాజరుకావాల్సి ఉంటుంది. నియామకాల్లో కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి స్థానికత, రోస్టర్ విధానంలో ప్రభుత్వం సడలింపు ఇచ్చింది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial