తెలంగాణ పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో స్టెఫండరీ క్యాడెట్ ట్రైనీ కానిస్టేబుల్ (సివిల్/ఎ.ఆర్/ టి.ఎస్.ఎస్.పి/ఎస్.పి.ఎఫ్/ఎస్.ఏ.ఆర్ సిపిఎల్/ఎస్.ఎఫ్.ఓ) అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఆదివారం (ఏప్రిల్ 30) నిర్వహించిన తుది రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం కానిస్టేబుల్ (సివిల్) పోస్టులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, కానిస్టేబుల్ (ఐటీ & సీవో) పోస్టులకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రాతపరీక్షలు నిర్వహించారు.
పరీక్షల సందర్భంగా ట్రాఫిక్ నకు ఎలాంటి అంతరాయం కలుగకుండా పటిష్ట క్రమబద్దీకరణ చర్యలు తీసుకున్నారు. పరీక్ష ముగిసేంతవరకు జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచారు. నగరంలోని లాడ్జిలను తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన వివరాలు తీసుకున్నారు. క్యూపద్ధతి ద్వారా అభ్యర్థులను పరీక్షాహాల్లోకి అనుమతించారు. పురుష, మహిళ అభ్యర్థులను వేర్వేరుగా తనిఖీ చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థుల బయోమెట్రిక్ తో వివరాలు నమోదు చేశారు.
ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,16,464 మంది అభర్థులు అర్హత సాధించగా.. 1,14,143 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 98.01 హాజరుశాతం నమోదైంది. ఇందులో కానిస్టేబుల్ సివిల్ పోస్టులకు 1,09,663 అభ్యర్థులకుగాను 1,08,055 (98.53 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక కానిస్టేబుల్ ఐటీ & సీవో పోస్టులకు 6,801 మంది అభ్యర్థులకు గాను 6,088 (98.53 శాతం) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అత్యధికంగా సంగారెడ్డి నుంచి 99.14 శాతం అభ్యర్థులు హాజరుకాగా.. అత్యల్పంగా హైదరాబాద్ నుంచి 97.59 మంది అభ్యర్థులు తుది పరీక్షలకు హాజరయ్యారు.
ఫైనల్ పరీక్షల నిర్వహణ ఇలా..
➥ మార్చి 11న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ ఎస్‌ఐ (IT&CO) టెక్నికల్ పేపర్ పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఎస్సీటీ ఏఎస్‌ఐ(FPB) టెక్నికల్ పేపర్ పరీక్ష నిర్వహించారు.
➥ మార్చి 26న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ ఎస్‌ఐ (PTO) టెక్నికల్ పేపర్ పరీక్ష నిర్వహించారు
➥ ఏప్రిల్ 2న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్సీటీ కానిస్టేబుల్ (డ్రైవర్) డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు టెక్నికల్ పేపర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఎస్సీటీ కానిస్టేబుల్ (మెకానిక్) పోస్టులకు టెక్నికల్ పేపర్ పరీక్షలు నిర్వహించారు
➥ ఏప్రిల్ 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్ని ఎస్‌సీటీ ఎస్‌ఐ/ఏఎస్‌ఐ పోస్టులకు అరిథ్‌మెటిక్ & రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సీటీ ఎస్‌ఐ/ఏఎస్‌ఐ పోస్టులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహించారు.
➥ ఏప్రిల్ 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ ఎస్‌ఐ(సివిల్) పోస్టులకు జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సీటీ ఎస్‌ఐ(సివిల్) పోస్టులకు తెలుగు/ఉర్దూ పరీక్ష నిర్వహించారు.
➥ ఇక చివరగా ఏప్రిల్ 30న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్సీటీ కానిస్టేబుల్(సివిల్), ఇతక కానిస్టేబుల్ సమాన పోస్టులకు జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సీటీ కానిస్టేబుల్(IT&CO) పోస్టులకు టెక్నికల్ పరీక్ష్ నిర్వహించారు.
తెలంగాణలో పోలీసు ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబరు 8 నుంచి జనవరి 5 వరకు ఫిజికల్ ఈవెంట్లు (పీఎంటీ, పీఈటీ) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించిన ఫలితాలను జనవరి 6న పోలీసు నియామక మండలి విడుదల చేసింది. పోలీసు ఫిజికల్ ఈవెంట్లకు రాష్ట్రవ్యాప్తంగా 2,07,106 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 1,11,209 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తంగా 53.70 శాతం మంది క్వాలిఫై అయ్యారు. 2018-19లో జరిగిన రిక్రూట్‌మెంట్‌తో పోల్చితే, ఇప్పుడు అదనంగా 5.18 శాతం మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు.