తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు వేర్వేరు విభాగాల్లో 5,204 స్టాఫ్‌నర్సు పోస్టులను భర్తీ చేయడానికి వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ గతేడాది డిసెంబరులో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తామని, ఓఎంఆర్ షీట్ విధానంలో ఆన్సర్ షీట్ ఉంటుందని అందులో వెల్లడించారు. అయితే ఇటీవల ప్రశ్నపత్రాల వరుస లీకేజీ ఘటనల దృష్ట్యా... రాతపరీక్ష విధానానికి స్వస్తి చెప్పాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది.


నర్సింగ్ పోస్టుల భర్తీలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)ను నిర్వహించాలని ఇటీవల వైద్య మంత్రి హరీశ్‌రావు వద్ద జరిగిన సమీక్షలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎంసెట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ పరీక్షలను ఎలాగైతే కంప్యూటర్ ఆధారంగా నిర్వహిస్తున్నారో... అదే తరహాలో నర్సింగ్ పోస్టుల భర్తీ పరీక్షను కూడా నిర్వహించాలని తీర్మానించారు. నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో ప్రశ్నపత్రాన్ని జేఎన్‌టీయూ రూపొందించనుండగా... ఆన్‌లైన్‌లో పరీక్షల నిర్వహణలో అపార అనుభవమున్న ఓ సంస్థకు నర్సుల పోస్టుల నియామక పరీక్ష నిర్వహణ బాధ్యతను అప్పగించారు.


వచ్చే వారంలో నియామక పరీక్షకు సంబంధించిన తేదీని టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ ప్రకటించనుంది. పరీక్ష ప్రకటన తేదీకి.. నిర్వహణ తేదీకి మధ్య కనీసం రెండు నెలలు ఉండేలా ప్రణాళిక రూపొందించింది. జులైలో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత సంస్థకు వైద్యశాఖ సూచించింది.


వైద్యారోగ్యశాఖలోని వివిధ విభాగాల్లో 5,204 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 30 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో డీఎంఈ, డీహెచ్  పరిధిలో 3,823 పోస్టులు, వైద్య విధాన పరిషత్‌లో 757 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎంఎన్‌జే సంస్థల్లో 81, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో 127, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ విభాగంలో 8, మహాత్మాజ్యోతిబా పూలే విద్యా సంస్థల్లో 197, తెలంగాణ ట్రైబల్  వెల్ఫేర్ విద్యాసంస్థల్లో 74, తెలంగాణ సోషల్ వెల్ఫేర్‌లో 124, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్‌లో 13 పోస్టులు భర్తీ చేయనున్నారు.


ఒకే రోజు రెండు పరీక్షలు..
జేఎన్‌టీయూ నిపుణుల బృందం రూపొందించిన ప్రశ్నపత్రాల్లో ఏవైనా రెండింటిని పరీక్షకు కొద్ది నిమిషాల ముందు ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకున్న మొత్తం 40,900 మందికి పైగా అభ్యర్థులను రెండు గ్రూపులుగా కంప్యూటర్ ఆధారంగానే ర్యాండమ్‌గా విభజిస్తారు. ఏ గ్రూపులో ఏ అభ్యర్థి వస్తారనేది నిర్వాహకులకు కూడా తెలియదు. వీరికి ఒకే తేదీన ఉదయం 9-12 గంటల వరకూ ఒక పరీక్ష... మధ్యాహ్నం 2-5 గంటల వరకూ మరో పరీక్షను నిర్వహిస్తారు. రెండు ప్రశ్నపత్రాలూ వేర్వేరుగా ఉంటాయి. గతంలో రాతపరీక్షకు ప్రకటించినట్లుగానే... ఆన్‌లైన్ పరీక్షలో కూడా అన్నీ బహుళ ఐచ్ఛిక ప్రశ్నలే ఉంటాయి. ఒక ప్రశ్నకు సమాధానం రాసిన తర్వాతే మరో ప్రశ్న కంప్యూటర్ తెరపై కనిపిస్తుంది. నిర్దేశిత సమయంలో ప్రశ్నలకు ఆన్‌లైన్‌లో సమాధానాలు ఇచ్చుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థికి ఒకటో ప్రశ్న కనిపిస్తే.. మరో అభ్యర్థికి 50వ ప్రశ్న కనిపించే అవకాశాలుంటాయి. పరీక్షలో పాల్గొంటున్న ప్రతి అభ్యర్థికీ ఏక కాలంలో ఒకే ప్రశ్న కనిపించే అవకాశాలుండవని టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ వర్గాలు స్పష్టం చేశాయి.


పరీక్ష కేంద్రాలు ఆ నాలుగు జిల్లాల్లోనే...
హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌లను పరీక్ష కేంద్రాలుగా ఇప్పటికే ప్రకటించారు. అభ్యర్థులు ఈ నాలుగింటిలో ఏ రెండింటినైనా కచ్చితంగా ఎంచుకోవాలి. హైదరాబాద్ నుంచి దరఖాస్తు చేసుకున్న వారు ఎక్కువమంది ఉండడంతో.. ఇక్కడ పరీక్ష కేంద్రాలు ఎక్కువ ఉండే అవకాశాలున్నాయి. జవాబు పత్రాల మూల్యాంకనం బాధ్యత కూడా ఎంపిక చేసిన సంస్థదే. ఆ ఫలితాలకు వెయిటేజీ మార్కులను జోడించి, అర్హుల్లో 1:2 నిష్పత్తిలో నియామక జాబితాను రూపొందిస్తారు. వీరి అర్హత ధ్రువపత్రాలనే సరిచూస్తారు. అనంతరం తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. నర్సులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష తొలిసారి కావడంతో.. వారికి ఈ విషయంలో అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్య మంత్రి హరీశ్‌రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో అభ్యర్థులకు అవగాహన కోసం.. పరీక్ష తేదీని ప్రకటించిన రోజునే.. టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ వెబ్‌సైట్‌లో నర్సింగ్ నియామక ప్రశ్నపత్రం నమూనాను అందుబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు.


వైద్యారోగ్యశాఖలో 5,204 స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...