TS Group I Prelims Exam : తెలంగాణ గ్రూప్​ –1 పోస్టుల భర్తీ ప్రక్రియలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ ఖరారుపై మంగళవారం టీఎస్పీఎస్సీ సుదీర్ఘంగా చర్చించింది. గ్రూప్​–1 ప్రిలిమ్స్​ పరీక్ష తేదీని ఖరారు చేసింది. అక్టోబర్​ 16న గ్రూప్​–1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించేందుకు నిర్ణయించింది. మెయిన్స్​ పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.  


అక్టోబర్ 16న ప్రిలిమ్స్ పరీక్ష 


తెలంగాణలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీ ఖరారు చేసింది టీఎస్పీఎస్సీ. అక్టోబరు 16వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి గ్రూప్‌-1 పరీక్ష కావడంతో ప్రాధాన్యత ఏర్పడింది. సాధారణంగా గ్రూప్ -1 పరీక్షలు కాంపిటీషన్ అధికంగా ఉంటుంది. డిప్యూటీ కలెక్టర్‌, డీఎస్పీ పోస్టులు సాధిస్తే భవిష్యత్తులో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అయ్యే అవకాశం ఉండటంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీపడుతున్నారు. రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. జూన్‌ 4 నాటికి మొత్తం 503 పోస్టులకు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఒక్కోపోస్టుకు సరాసరి 756 మంది చొప్పున పోటీపడుతున్నారు. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష నిర్వహించే అవకాశముందని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది.


మొత్తం 503 పోస్టులు 


తెలంగాణ గ్రూప్‌-1 నోటిఫికేషన్ లో మొత్తం 503 పోస్టులు ఉన్నాయి. ఇందులో 225 మహిళలకు రిజర్వ్ చేశారు. ఈ పోస్టులకు 1,51,192 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు సగటున 672 మంది పోటీపడుతున్నారు. దివ్యాంగుల కేటగిరీలో 24 పోస్టులకు 6,105 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 254 మంది చొప్పున పోటీపడనున్నారు. ఈసారి గ్రూప్ -1 పోస్టులుకు 51,553 మంది ప్రభుత్వ ఉద్యోగులు సైతం దరఖాస్తు చేసుకున్నారు. 


గ్రూప్ -1 పోస్టులు శాఖలవారీగా వివరాలు 



  • జిల్లా బీసీ అభివృద్ధి అధికారి పోస్టులు - 5

  • అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు - 40

  • అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులు -38 

  • అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీస్‌ పోస్టులు - 20 

  • డీఎస్పీ పోస్టులు - 91 

  • జైళ్లశాఖలో డీఎస్పీ పోస్టులు - 2

  • అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ పోస్టులు - 8 

  • జిల్లా ఉపాధి అధికారి పోస్టులు - 2 

  • జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి పోస్టులు - 6 

  • గ్రేడ్‌-2 మున్సిపల్‌ కమిషనర్‌ పోస్టులు - 35 

  • మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి పోస్టులు - 121 

  • జిల్లా పంచాయతీ అధికారి పోస్టులు - 5 

  • సీటీఓ పోస్టులు - 48 

  • డిప్యూటీ కలెక్టర్లు పోస్టులు - 42 

  • అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు - 26 

  • ప్రాంతీయ రవాణా అధికారి పోస్టులు - 4 

  • జిల్లా గిరిజన సంక్షేమ అధికారి పోస్టులు - 2