TGPSC Released Group 4 Results: తెలంగాణలో గ్రూప్ 4 ఫలితాలు (Group 4) గురువారం విడుదలయ్యాయి. మొత్తం 8,084 మంది అభ్యర్థులతో ప్రొవిజినల్ జాబితాను టీజీపీఎస్సీ (TGPSC) విడుదల చేసింది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in ను చూడాలని అధికారులు తెలిపారు. కాగా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 8,180 పోస్టులకు 2022, డిసెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 9,51,321 మంది దరఖాస్తు చేసుకోగా.. 2023, జులై 1 పరీక్ష నిర్వహించారు. తాజాగా, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత 8,084 మంది అభ్యర్థులతో జాబితాను కమిషన్ రిలీజ్ చేసింది.
గ్రూప్ 3 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
మరోవైపు, గ్రూప్ 3 పరీక్షలకు టీజీపీఎస్సీ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 17, 18 తేదీల్లో పరీక్షలు జరగనుండగా.. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం జిల్లాల వారీగా హెల్ప్ లైన్ నెంబర్లను విడుదల చేసింది.
ఈ నెల 17వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకూ పేపర్ - 1 పరీక్ష జరగనుండగా.. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకూ పేపర్ - 2 పరీక్ష నిర్వహిస్తారు. ఈ నెల 18న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకూ పేపర్ - 3 పరీక్ష జరగనుంది. రాష్ట్రంలో దాదాపు 1380కి పైగా పోస్టులకు 5.36 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు టీజీపీఎస్సీ ఐడీ, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి పీడీఎఫ్ రూపంలో హాల్ టికెట్ పొందొచ్చని అధికారులు తెలిపారు.