Patnam Narendar Reddy Sensational Letter: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి ఘటనలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని (Patnam Narendar Reddy) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్నారు. కాగా, పోలీసులు తాను పేర్కొంటున్నట్లు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ పూర్తిగా తప్పని స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం జైలు నుంచి సంచలన లేఖ విడుదల చేశారు. 'పోలీసులు నా పేరుతో బుధవారం బయటకు వచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పు. కేటీఆర్ గురించి కానీ, ఈ కేసు గురించి కానీ ఎలాంటి స్టేట్మెంట్ పోలీసులు నా నుంచి తీసుకోలేదు. నేను చెప్పలేదు. కోర్టుకు వచ్చాక నా అడ్వకేట్ అడిగితే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు. అప్పటివరకూ అందులో ఏముందో నాకు తెలియదు. నేను చెప్పనిదే చెప్పినట్లు పోలీసులు రాశారు. నేను ఎవరి పేరూ చెప్పలేదు. కావాలనే అలా రిమాండ్ రిపోర్ట్ సృష్టించారు.' అని లేఖలో ఆయన స్పష్టం చేశారు.
హైకోర్టులో క్వాష్ పిటిషన్
తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో గురువారం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. చర్లపల్లిలో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన్ను న్యాయవాదులు కలిశారు. 'నన్ను అక్రమంగా ఈ కేసులో ఇరికించారు. అరెస్టుకి ముందు నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. కేటీఆర్ సహా ఇతర ముఖ్య నేతల ఆదేశాలతో దాడులు చేయించినట్లు పోలీసులు కట్టుకథ చెప్పారు. నేను పోలీసులకు ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదు. రిమాండ్ రిపోర్టులో వారు చెప్పింది నిజం కాదు. నా స్టేట్మెంట్ పరిగణనలోకి తీసుకుని విచారణ చేయాలి.' అని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
రిమాండ్ రిపోర్టులో ఏముంది.?
కాగా, లగచర్ల దాడి (Lagacharla Issue) ఘటనలో పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు ప్రస్తుతానికి ఏ1గా చేర్చారు. అయితే ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చాలా పెద్ద స్థాయిలో జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ విషయంలో నరేందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఆయన పేరును రిమాండ్ రిపోర్టులో చేర్చారు. ఆధారాల ప్రకారం చూస్తే.. కలెక్టర్ దాడి ఘటన జరగడానికి ముందు తర్వాత నరేందర్ రెడ్డి ఆరు సార్లు కేటీఆర్‌కు ఫోన్ చేశారని పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. దాడి ఘటనకు ముందు నుంచి దాడి చేసిన తర్వాత పూర్తి స్థాయిలో సురేష్..పట్నం నరేందర్ రెడ్డితో టచ్‌లో ఉండటం.. నరేందర్ రెడ్డి కేటీఆర్‌తో టచ్‌లో ఉండటంతో ఇదంతా ఇంటర్ లింక్డ్ వ్యవహారమని పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. కేటీఆర్ సహా ఇతర పార్టి నేతల ఆదేశాలతో వ్యూహ రచన చేసినట్లు నరేందర్ రెడ్డి చెప్పినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. విచారణలో పట్నం నేరం ఒప్పుకొన్నారని అందులో చెప్పారు. అయితే, ఇది పూర్తిగా తప్పు అంటూ తాజాగా పట్నం లేఖ విడుదల చేశారు.
మరోవైపు, ఈ కేసులో పట్నం నరేందర్ రెడ్డి తనకు బెయిల్ ఇవ్వాలని వికారాబాద్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను కోర్టు ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. అటు, నరేందర్ రెడ్డిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై విచారణను సోమవారానికే వాయిదా వేసింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం సహా దాదాపు 55 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పట్నం నరేందర్‌ను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. బాధిత రైతులను సైతం బీఆర్ఎస్ నేతలు కలిశారు. రైతులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. లగచర్ల రైతులను జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ వద్దకు తీసుకెళ్తానని అన్నారు.
Also Read: Crime News: సంగారెడ్డి జిల్లాలో దారుణం - నడిరోడ్డుపైనే తల్లీకొడుకులను పొడిచి చంపేశాడు