TGPSC Group-1 Candidates Declaration/ Authentication: 'గ్రూప్-1' ఉద్యోగార్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కీలక అప్‌డేట్ ఇచ్చింది. గ్రూప్-1 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్ మీద ఫొటో, పేరు వివరాలు సరిగా లేకుంటే, అభ్యర్థి గెజిటెడ్ అధికారి లేదా విద్యార్థి గతంలో చదువుకున్న విద్యాసంస్థ ప్రిన్సిపల్ అటెస్ట్ చేసిన మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలతోపాటు కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన ధ్రువీకరణ పత్రాన్ని (Declaration Form) పూర్తిచేసి ఇన్విజిలేటర్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. అలా అయితేనే పరీక్షకు అనుమతిస్తారు. అదేవిధంగా హాల్‌టికెట్‌ను ఏ4 సైజులో ప్రింట్ తీసుకోవాలి. దానిపై కేటాయించిన స్థలంలో తాజా పాస్‌పోర్టు ఫొటోను అతికించాల్సి ఉంటుంది. ఫొటో లేని హాల్‌టికెట్లను పరిగణనలోకి తీసుకోరు. వారిని అనుమతించరు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిక్లరేషన్/అథంటికేషన్ (ఫామ్-1, ఫామ్-2)లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. వివరాలు తప్పుగా నమోదుచేసిన అభ్యర్థులు తప్పనిసరిగా డిక్లరేషన్ ఫామ్ సమర్పించాల్సి ఉంటుంది. ఫొటోను సరిగా అప్‌లోడ్ చేయలేకపోయిన అభ్యర్థులు లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను డిక్లరేషన్ ఫామ్-1కు జతచేయాల్సి ఉంటుంది. అలాగే పేరు తప్పుగా ఉన్న అభ్యర్థులు తమ పదోతరగతి లేదా డిగ్రీ సర్టిఫికేట్‌లో ఉన్న విధంగా పూర్తి పేరును డిక్లరేషన్ ఫామ్-2లో నమోదుచేయాల్సి ఉంటుంది. అదేవిధంగా గెజిటెడ్ ఆఫీసర్ లేదా అభ్యర్థులు చివరిగా చదివిన విద్యాసంస్థ ప్రిన్సిపల్ ద్వారా అటెస్టేషన్ చేయించాల్సి ఉంటుంది.
Declaration/ Authentication form-1 for Incorrect photo candidates
Declaration/ Authentication form-2 for Incorrect Name Candidates
జూన్ 1 నుంచి గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు..
తెలంగాణలో 'గ్రూప్-1' ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జూన్ 1న టీజీపీఎస్సీ విడుదల చేయనుంది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనుంది. అభ్యర్థులు జూన్ 1న మధ్యాహ్నం 2 గంటల నుంచి కమిషన్ వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జూన్ 9న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రూప్-1 స్క్రీనింగ్ టెస్ట్ (ప్రిలిమినరీ పరీక్ష) నిర్వహించనున్నారు. అభ్యర్థుల సౌకర్యం కోసం పరీక్షకు సంబంధించిన నియమ నిబంధనలు, OMR షీట్ నమూనాపత్రాలను కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్న సంగతి తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహణకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. గతంలో ఎదురైన సంఘటనలు, న్యాయ వివాదాల నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అభ్యర్థులకు కఠిన నిబంధనలు విధించింది.
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు (150 నిమిషాలు).
పరీక్ష కేంద్రాలు: ఆసిఫాబాద్-కొమ్రంభీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల-రాజన్న, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట, నల్గొండ, భువనగిరి-యాదాద్రి, జనగాం, మేడ్చల్-మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ-గద్వాల్, వనపర్తి, నాగర్‌కర్నూల్.
గ్రూప్-1 పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..