Andhra Pradesh TET 2025: ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ 2025లో ఉద్యోగాలు సాధించలేకపోయిన వారికి మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. అమరావతిలో నిర్వహించిన మెగా డీఎస్సీ ఉద్యోగ పత్రాల పంపిణీ కార్యక్రమంలో కీలక ప్రకటన చేశారు. నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ ఇస్తున్నామని వెల్లడించారు. వచ్చే ఏడాది మరో డీఎస్సీ నోటిఫికేషన్ రాబోతోందని చెప్పారు.  


ఉపాధ్యాయులు క్షమించండి
అమరావతిలో జరుగుతున్న అపాయింట్‌మెంట్ లెటర్స్ పంపిణీలో మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయులకు క్షమాపణలు చెప్పారు. చంద్రబాబుతో కలిసి స్టేజిపైకి వచ్చినప్పుడు అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇచ్చినప్పుడు యువగళం పాట వేసినందుకు క్షమాపణలు చెప్పారు. విద్యాలయాలను రాజకీయాలకు దూరంగా ఉంచుతామని చెప్పి ఉపాధ్యాయులు పాల్గొన్న కార్యక్రమంలో యువగళం పాట వేయడాన్ని ఆయన తప్పు పట్టారు. అందుకే కార్యక్రమంలో పాల్గొన్న వారికి క్షమాపణలు చెప్పారు. 


గురువు కోసం దిగొచ్చిన రాజు
అక్టోబ్‌ 3, 1996లో నాటి రాష్ట్రపతి శంకర్‌దయాల్ శర్మ ఒమన్‌లో పర్యటించారు. మస్కట్‌ విమానం దిగుతున్నటైంలో ఒమన్ రాజు కారులో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. రాజే వచ్చేసరేకి అంతా కంగారు పడ్డారు. శంకర్‌ దయాల్‌శర్మను కారులో ఎక్కించుకొని ఆయన స్వయంగా డ్రైవ్ చేసుకొని ఇంటికి తీసుకెళ్లారు. ఒమన్ రాజు పుణేలో చదువుకున్న టైంలో శంకర్‌ దయాల్‌ శర్మ గురువుగా ఉన్నారు. పాఠాలు చెప్పారు. అదే కృతజ్ఞతతో ఆయన స్వయంగా వచ్చి శంకర్‌ దయాల్‌ శర్మను ఇంటికి తీసుకెళ్లారు. 


దేశాధ్యక్షుడైనా, రాజకీయ నాయకుడైనా, ప్రపంచంలోనే ధనవంతుడైనా గురువుతో పాఠాలు చెప్పించుకున్నా వాళ్లే, మాటలు పడ్డవాళ్లే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తనకు గురువులు గుర్తుకు వస్తున్నారని చెప్పారు. తాను బ్యాక్‌ బెంచర్‌ అని అందుకే తన పట్ల  చాలా స్ట్రిక్ట్‌గా ఉంటూ లైన్‌లో పెట్టారని తెలిపారు. నలుగురు గురువుల వల్లే ఈ రోజు ప్రజల ముందు నిలబడగలిగానని చెప్పారు. యువగళం పాదయాత్రలో యువత అంతా కొరుకున్నది ఒక్కటే డీఎస్సీ నిర్వహించాలని. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ ఇస్తామని చెప్పాను. అన్నట్టుగానే నోటిఫికేషన్ ఇచ్చాం. "చాలా మందికి అనుమానం ఉంది. ఈ పరీక్ష అవుతుందా జాబ్‌లు వస్తాయా అని. కానీ ఇక్కడ  ఉన్నది చంద్రబాబు. డీఎస్సీ అంటే సీబీఎన్, సీబీఎన్ అంటే డీఎస్సీ. ఆంధ్రప్రదేశ్‌లో 15 డీఎస్సీలు జరిగితే 14 డీఎస్సీలు టీడీపీ హయాంలో నిర్వహించాం. రెండు లక్షలకుపైగా ఉపాధ్యాయులు టీడీపీ హయాంలో నియమితులైన వాళ్లే. ఉత్తమ ఉపాధ్యాయులు మీటింగ్‌కు వెళ్తే 99 శాతం మంది టీడీపీ హయాంలో నియమితులైన వాళ్లే. 
తొలిసారి ఎస్సీ రిజర్వేషన్ జరిగింది. వర్టికల్ , హారిజాంటల్ రిజర్వేషన్, ఉమెన్ కోటా, దివ్యాంగుల కోటా, స్పోర్ట్స్ కోటా అన్నీ పరిగణలోకి తీసుకొని పూర్తి చేసి మెగా డీఎస్సీ విజయవంతం చేశాం. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు, కోర్టు ఆదేశాలు, వేసిన కేసులు స్టడీ చేశాం. "  


మెగా డీఎస్సీ ఆఫర్ లెటర్స్ ఇచ్చే కార్యక్రమంలో అధికారుల గురించి నారా లోకేష్ ప్రస్తావించారు. తెరపై తాను కనిపిస్తున్నా తెరవెనుక అధికారులు రాత్రి పగలు శ్రమించారని ప్రశంసించారు. అందుకే వారిని పేర్లు ప్రస్తావించి ధన్యవాదాలు తెలిపారు. 150 రోజుల్లో 150 కేసులు వేసినప్పటికీ అన్నింటినీ ఎదుర్కొని మెగా డీఎస్సీని మెగా హిట్ చేశామని అన్నారు లోకేష్‌. " విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలనే ఆలోచనతో పని చేస్తున్నాం. విద్యావ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలనే విద్యార్థులకు ఇచ్చే కిట్‌లకు సర్వేపల్లి రాధాకృష్ణ పేరు పెట్టాం. డొక్కా సీతమ్మ పేరుతే మధ్యాహ్న భోజనం అందజేస్తున్నాం. మోడల్ ప్రైమరీ స్కూల్‌ తీసుకొచ్చాం. మంత్రి నారాయణ సూచన మేరకు వన్ క్లాస్ వన్ టీచర్ ఇస్తున్నాం. 9600 స్కూల్స్‌ ఈ పద్ధతిలో పని చేస్తున్నాం. నైతిక విలువలు విద్యార్థులకు తెలియజేసేందుకు చాగంటి కోటేశ్వరరావుకు కీలక బాధ్యతలు అప్పగించాం. ఆయన ప్రభుత్వం నుంచి ఎలాంటి సౌకర్యాలు తీసుకోకుండా పని చేస్తున్నారు. నాలుగు పుస్తకాలు రాస్తున్నాను అవి పిల్లలతో చదివిస్తే చాలని చెప్పారు. మహిళలను గౌరవించాలనే కాన్సెప్ట్‌ను నర్సరీ నుంచే నేర్పించాలి. అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. ఇంటి నుంచే మొదలవ్వాలి. అందుకే పుస్తకాల్లో ఇంటి పనుల ఫొటోల్లో కూడా మహిళలు, పురుషులు చేసేలా జాగ్రత్తలు తీసుకున్నాం. 


గతంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టుగానే ఏటా డీఎస్సీ ఉంటుందని పునరుద్ఘాటించారు. నవంబర్‌లో టెట్ ఉంటుందని వచ్చే ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని ప్రకటించారు. ఇప్పుడు ఉద్యోగాలు రాని వారు అధైర్య పడొద్దని కచ్చితంగా మరింత ఉత్సాహంతో ప్రిపేర్ అయ్యి వచ్చే ఏడాది సాధించాలని సూచించారు. 


ఉత్తమ ఉపాధ్యాయులకు విదేశాలకు టూర్‌ 


రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయులకు విదేశ విద్యపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు లోకేష్. అందుకే ఇలా ఉత్తమ ఉపాధ్యాయులకు బెస్ట్ ఎడ్యుకేషన్ అందిస్తున్న దేశాలకు టూర్‌లకు పంపించి అక్కడి విధానాలు తెలుసుకునే ఛాన్స్ కల్పించాలని ఆకాంక్షించారు. దీనికి ముఖ్యమంత్రి అనుమతి ఇవ్వాలని రిక్వస్ట్ చేశారు. దీని వల్ల దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ మోడల్ ఎడ్యుకేషన్ అవలంభిస్తారని అన్నారు.