Rains in Andhra And Telangana: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాల వైపు వేగంగా కదులుతోంది. వాతావరణ శాఖ ప్రకారం, ఈ అల్పపీడనం వచ్చే 12 గంటల్లో వాయుగుండంగా   మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం  27వ తేదీ సాయంత్రం ఉత్తర కోస్తా ఆంధ్ర తీరాన్ని తాకనుందని అధికారులు తెలిపారు. దీంతో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు సెప్టెంబర్ 30 వరకు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌పై ఎక్కువ ప్రభావం

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే కృష్ణా, గోదావరి నదులు పొంగి వరదలు సంభవించాయి. కొత్త అల్పపీడనం కారణంగా కోస్తా జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. సెప్టెంబర్ 26 నుంచి 29 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏలూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వర్షాల కారణంగా  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

 

 తెలంగాణపై వాయుగుండ ప్రభావం

తెలంగాణలోనూ వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు  ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.  ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు  ఎల్లో అలర్ట్  జారీ అయింది. కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా.            

ప్రజలు జాగ్ర్తతలు తీసుకోవాలి ! 

వాతావరణ శాఖ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వరదలు, ఈదురుగాలుల ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులకు సముద్రంలోకి వెళ్లొద్దని కఠిన హెచ్చరికలు జారీ చేశారు. స్థానిక అధికారులు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేశారు.