TSPSC Group3 Revised Breakup: తెలంగాణలో గ్రూప్-3 అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ (TSPSC) నుంచి కీలక అప్‌డేట్ వెలువడింది. గ్రూప్-3 పోస్టుల భర్తీలో జీవో3 ప్రకారం మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేస్తున్నందున.. 'గ్రూప్-3' నోటిఫికేషన్‌లో ఖాళీల వివరాలకు సంబంధించిన రివైజ్డ్ బ్రేకప్‌ను కమిషన్ మే 3న ప్రకటించింది. ఈ రివైజ్డ్ ఖాళీల బ్రేకప్‌లో మహిళలకు రోస్టర్‌పాయింట్ తొలగించి, అన్ని ఖాళీలను రిజర్వు కేటగిరీల వారీగా వెల్లడించింది. ఈ సవరణ బ్రేకప్ వివరాలు కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 1388 గ్రూప్-3 పోస్టుల భర్తీకి 2022, డిసెంబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-3 పోస్టుల భర్తీకి ఈ ఏడాది నవంబరు 17, 18 తేదీల్లో రాతపరీక్షలు నిర్వహించనున్నారు.
గ్రూప్-3 పోస్టుల రివైజ్డ్ బ్రేకప్ కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో 'గ్రూప్-3' ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022, డిసెంబరు 30న నోటిఫికేషన్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 1388 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వివిధ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్ ఆడిటర్, అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే గ్రూప్-3 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 24న ప్రారంభమైంది. పోస్టుల అర్హతలు, ఇతర వివరాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంచారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 23న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించారు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
5.36 లక్షల దరఖాస్తులు..
రాష్ట్రంలో 1,388 గ్రూప్-3 పోస్టులకుగాను 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు 390 మందిగా పోటీ నెలకొంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబరు 17, 18 తేదీల్లో రాతపరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్-3 ఉద్యోగ ప్రకటనలో భాగంగా మొదట 1363 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. తర్వాత మరో 12 పోస్టులను జతచేశారు. బీసీ గురుకుల సొసైటీ పరిధిలో అదనంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు పెంచారు. ఇప్పటికే ఈ సొసైటీ పరిధిలోని 26 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను ప్రకటనలో పేర్కొనగా.. తాజాగా పెంచిన 12 పోస్టులతో కలిపి ఆ పోస్టులు 38కి చేరాయి. కొత్తగా చేరిన 12 పోస్టులతో కలిపి మొత్తం గ్రూప్-3లో పోస్టుల సంఖ్య 1,375కి చేరింది. ఆ తర్వాత మళ్లీ 13 పోస్టులు చేర్చింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 1,388కి చేరింది. నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ కార్యాలయంలో 13 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు చేర్చింది.
పోస్టుల వివరాలు..
* గ్రూప్-3 పోస్టులు
పోస్టుల సంఖ్య: 1388
1) జూనియర్ అసిస్టెంట్: 680 పోస్టులు
2) సీనియర్ అకౌంటెంట్: 436 పోస్టులు
3) ఆడిటర్: 126 పోస్టులు
4) సీనియర్ ఆడిటర్: 61 పోస్టులు
5) అసిస్టెంట్ ఆడిటర్: 23 పోస్టులు
6) జూనియర్ అకౌంటెంట్: 61 పోస్టులు
7) అకౌంటెంట్: 01 పోస్టు
పరీక్ష విధానం:
మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులు కేటాయించారు. ఇందులో పేపర్-1(జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్)-150 ప్రశ్నలు, పేపర్-2(హిస్టరీ, పాలిటీ & సొసైటీ)-150 ప్రశ్నలు, పేపర్-3(ఎకానమీ & డెవలప్‌మెంట్)-150 ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూలో ప్రశ్నపత్రం ఉంటుంది.