Telangana Group 2 Candidate caught while writing exam with cell phone | వికారాబాద్: తెలంగాణలో జరుగుతున్న గ్రూప్స్ పరీక్షలలో ఏదో ఓ చోట గందరగోళం నెలకొంటోంది. ఇటీవల జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ సమయంలో కాపీ కొడుతూ అభ్యర్థులు దొరకడం తెలిసిందే. తాజాగా గ్రూప్ 2 ఎగ్జామ్‌లో మరో వింత ఘటన జరిగింది. పరీక్షా కేంద్రంలో ఓ అభ్యర్థి సెల్ ఫోన్‌తో అడ్డంగా దొరికిపోవడం కలకలం రేపుతోంది. వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్ శ్రీ సాయి డెంటల్ కళాశాలలో గ్రూప్ 2 ఎగ్జామ్ హాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
నేడు తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్ 1 ఎగ్జామ్ జరిగింది. మధ్యాహ్నం సెషన్ లో 3 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్ 2 ఎగ్జామ్ నిర్వహించారు. అయితే వికారాబాద్ లోని శ్రీ సాయి డెంటల్ కాలేజీకి గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహణకు సెంటర్ ఇచ్చారు. పోలీసులు, కాలేజీ సిబ్బంది అభ్యర్థులు జాగ్రత్తగా చెక్ చేసి ఎగ్జామ్ సెంటర్ లోకి పంపించారు. కానీ అనూహ్యంగా ఎగ్జామ్ రాస్తున్న ఓ అభ్యర్థి వద్ద సెల్ ఫోన్ ఉండటాన్ని గమనించిన ఇన్విజిలేటర్ షాకయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఇన్విజిలేటర్ ఆ అభ్యర్థి పేపర్ లాగేసుకున్నారు. అభ్యర్థిని ఎగ్జామ్ రాయనివ్వకుండా పోలీసులకు అప్పగించారు. తనిఖీలలో ఎలా తప్పించుకుని, ఎగ్జామ్ సెంటర్ లోకి ఫోన్‌తో వచ్చాడని పోలీసులు అభ్యర్థిని విచారిస్తున్నారని తెలుస్తోంది.
జనగామలో అధికారుల నిర్లక్ష్యం, అభ్యర్థిని ఎగ్జామ్ మిస్
జనగామలో ఆదివారం నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలో అధికారుల నిర్లక్ష్యం కనిపించింది. ఓ అభ్యర్థిని చేసిన పొరపాటును గుర్తించకపోవడంతో ఆమె ఎగ్జామ్ రాయలేకపోయింది. మొదట అభ్యర్థిని తప్పిదం చేయగా, అధికారులు సరిగ్గా తనిఖీ చేయకపోవడంతో ఎగ్జామ్ రాయకుండానే ఆమె ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. కొడకండ్ల మండలం మొండ్రాయి పరిధిలోని తండాకు చెందిన భూక్యా సునీతకు జనగామ జిల్లా కేంద్రంలోని సాన్ మారియా హైస్కూల్లో సెంటర్ పడింది. ఆ సెంటర్ పక్కనే మరొక ఎగ్జామ్ సెంటర్ సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాల ఉంది. చంటి బిడ్డ, భర్తతో కలిసి ఎగ్జామ్ సెంటర్ కు వచ్చింది సునీత. ఆమె భర్త ఎగ్జామ్ సెంటర్ కోడ్, పేరులో పొరబడి సెయింట్ మేరీస్ సెంటర్‌కు తీసుకెళ్లి డ్రాప్ చేశాడు. సిబ్బంది సైతం ఆమె హాల్ టికెట్ చెక్ చేసి ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతించారు. బయోమెట్రిక్ తీసుకునేటప్పుడు వివరాలు కరెక్ట్ లేవని ఆమె చెప్పడంతో సిబ్బంది సైతం షాకయ్యారు.
ఇటీవల గ్రూప్ 1 మెయిన్స్ లో దొరికిన అభ్యర్థులు
ఎన్నో ఆటంకాల తరువాత తెలంగాణలో తొలిసారి గ్రూప్ 1 మెయిన్స్ అక్టోబర్ నెలలో నిర్వహించారు. అయితే కాపీయింగ్ చేస్తూ వేర్వేరు ఘటనల్లో ఇద్దరు అభ్యర్థులు దొరకడం తెలిసిందే. అధికారులు ఆ అభ్యర్థులను డీబార్ చేశారు. మహబూబ్‌నగర్‌లో ఎస్‌జీటీ టీచర్‌గా చేస్తున్న ఇస్లావత్ లక్ష్మీ అనే మహిళా అభ్యర్థి తన చీర కొంగులో చిట్టీలు కట్టుకొని వచ్చారు. తనిఖీల సమయంలో దొరకని చిట్టీలు ఎగ్జామ్ రాసే సమయంలో దర్శనమివ్వడంతో ఇన్విజిలేటర్ అప్రమత్తం అయ్యారు. చీర కొంగులో దాచిన చిట్టీలు చూస్తూ పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్ ఆమెను గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమెను వారు అదుపులోకి తీసుకున్నారు. మరో చోట మరో అభ్యర్థి సైతం చిట్టిలతో మెయిన్స్ ఎగ్జామ్ రాస్తూ దొరికిపోవడం కలకలం రేపింది. ఇదివరకే పేపర్ లీకులతో ఓసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ వాయిదా పడింది. బయోమెట్రిక్ తీసుకోలేదు అనే కారణం, సహా పలు అంశాల వల్ల మరోసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మరికొన్ని పోస్టులు జత చేసి గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించింది. ఫలితాలు విడుదల చేసి, మెయిన్స్ ఎగ్జామ్‌ను అక్టోబర్ నెలలో నిర్వహించింది. త్వరలో ఫలితాలు విడుదల కానున్నాయి.