తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పది కొత్త పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. పరీక్షల కంట్రోలర్, డిప్యూటీ కంట్రోలర్, అసిస్టెంట్ కంట్రోలర్, చీఫ్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్, చీఫ్ ఇన్‌ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, సీనియర్, జూనియర్ నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్, జూనియర్ ప్రోగ్రామర్ పోస్టులతో పాటు జూనియర్ సివిల్ జడ్జి కేడర్‌లో లా ఆఫీసర్ పోస్టును మంజూరు చేసింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది.
అదనపు కార్యదర్శిగా బీఎం సంతోష్ నియామకం..
టీఎస్‌పీఎస్సీ అదనపు కార్యదర్శిగా బీఎం సంతోష్‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐఏఎస్ ఆఫీసర్ సంతోష్ టీఎస్‌పీఎస్సీ పరీక్షల కంట్రోలర్‌గానూ వ్యవహరించనున్నారు. ఈ మేరకు బీఎం సంతోష్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్ బాధ్యతల నుంచి సంతోష్‌ను బదిలీ చేశారు.
తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఇంటిదొంగలే మోసం చేశారని సాక్షాత్తు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ గోడు వెల్లబోసుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీంతో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ప్రక్షాళన మొదలుపెట్టింది. కమిషన్‌లో అంతర్గత బదిలీలకు రంగం సిద్ధమైంది. టీఎస్‌పీఎస్సీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్, సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్‌రెడ్డి కలిసి ప్రశ్నపత్రాలను లీక్ చేసినట్టు తేలడంతో కొత్త సంస్కరణలకు కమిషన్ శ్రీకారం చుట్టింది. కార్యాలయంలో సిబ్బంది తక్కువగా ఉండటం, పనిభారం ఎక్కువ కావడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే.. బదిలీలు చేయాలని కమిషన్ భావిస్తోంది.
'డేటా' సెక్యూరిటీపై మరింత నిఘా..
టీఎస్‌పీఎస్సీలో నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని కమిషన్ భావిస్తోంది. ముఖ్యంగా డేటా సెక్యూరిటీపై కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో ఉన్నదానికంటే మరింత పటిష్టమైన వ్యవస్థను తీసుకురావాలని భావిస్తోంది. ఇందుకోసం సైబర్ సెక్యూరిటీ నిపుణులతో సమాలోచనలు చేస్తోంది. కంప్యూటర్లు, సర్వర్లు, ఫైర్‌వాల్ తదితర అంశాలను ప్రత్యేకంగా పర్యవేక్షించే చర్యలపై దృష్టి పెట్టింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లో మరింత పకడ్బందీగా సెక్యూరిటీ ఉండేలా చర్యలు తీసుకుంటోంది. సైబర్ దాడులు, కంప్యూటర్ సేఫ్టీ, పాస్‌వర్డ్స్, యూజర్ ఐడీల భద్రత తదితర అంశాలపై సైబర్ సెక్యూరిటీ నిపుణుల సలహాలు తీసుకుంటుంది. కార్యాలయంలో ఉద్యోగుల పనితీరు? ఉద్యోగులను కలవడానికి ఎవరైనా వస్తున్నారా? తదితర అంశాలపై దృష్టి సారించనుంది. కార్యాలయంలోని కంప్యూటర్లకు అసలు పెన్‌డ్రైవ్ యాక్సెస్ లేకుండా చేయడం, ప్రింటింగ్‌కు సంబంధించి కొన్ని ప్రత్యేక ప్రదేశాలకే పరిమితం చేయడం వంటి అంశాలపై దృష్టి పెట్టింది. భవిష్యత్తులో సంస్థ ఉద్యోగులెవరూ తప్పుచేయకుండా, కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం లేకుండా పకడ్భందీ చర్యలు తీసుకుంటోంది.
సైబర్ భద్రతపై ఉద్యోగులకు శిక్షణ..
కార్యాలయ ఉద్యోగులకు సైబర్ భద్రతపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఉద్యోగులకు సైబర్ భద్రత, సాంకేతిక, న్యాయపరమైన అంశాలపై పరిజ్ఞానం పెంపొందించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో కంప్యూటర్లు హ్యాక్ కాకుండా ఎలా వ్యవహరించాలి? కఠినమైన పాస్‌వర్డ్స్‌ను ఎలా పెట్టుకోవాలి? తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. దీనికోసం సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌ను రంగంలోకి దింపారు. ప్రతిరోజు విధులకు ఆటంకం కలగకుండానే ఈ శిక్షణ నిర్వహిస్తున్నారు.
Also Read:
ఏఈఈ అభ్యర్థులకు అలర్ట్, ఆన్‌లైన్‌లో ఏఈఈ(సివిల్) పరీక్ష నిర్వహణ!
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏఈఈ(సివిల్) పోస్టులకు ఆన్‌లైన్‌లో రాతపరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. మే 21న ఏఈఈ పోస్టులకు ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తామని గతంలో టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చర్, మెకానికల్ పోస్టులతో పాటు సివిల్ పోస్టులకు కూడా ఆన్‌లైన్‌లో రాతపరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఈ మేరకు ఏప్రిల్ 21న అధికారికంగా ప్రకటించింది.
పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..